Red sorghum
-
ఇటు ఎర్రజొన్న..అటు పోలీసన్న
కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పసుపు, ఎర్రజొన్న రైతులు దిగాలు పడుతూ.. ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంటే మరోవైపు పోలీసులు పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పహారా కాస్తున్నారు. ప్రభుత్వం కొను గోలుకు స్పందించక పోవడంతోనే ఎర్రజొన్న పంట ధర మరింత దిగజారిపోతోందని, వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారని రైతన్నలు వాపోతున్నారు. ఫలితంగా పల్లెల్లో రోడ్లపై ఆరబెట్టిన ఎర్రజొన్న కుప్పలుగా కనిపిస్తోంది. సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం ముందుకు రాకపోగా, సీడ్ ఇచ్చిన వ్యాపారులూ గిట్టుబాటు ధర ఇవ్వక పోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మార్కెట్లో ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నా తమ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యాపారులు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.3,500 ధర చెల్లించిన వ్యాపారులు క్రమక్రమంగా ధరను తగ్గిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఏటేటా పెరుగుతుండగా తాము పండించిన పంటలకు మాత్రం ధర ఎలా పడిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నా గతంలో మాదిరిగా ప్రభుత్వం కొనుగోలు చేయదని గుర్తించిన వ్యాపారులు కావాలని ధరను తగ్గిస్తున్నారని రైతులు అంటున్నారు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని తాము ఉద్యమం ఆరంభించిన మొదట్లో ఎక్కువ ధరకు వాటిని కొనుగోలు చేస్తామని వ్యాపారులు మాట ఇచ్చారని రైతులు చెబుతున్నారు. అటు ఎర్రజొన్న.. క్వింటాలుకు రూ.2,300 వరకు ధర ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ప్రభుత్వ ధోరణి స్పష్టం కావడంతో ఇప్పుడు మాట మార్చారని రైతులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.2000 నుంచి రూ.2,300 వరకు ధర చెల్లించడానికి ముందుకు వచ్చిన వ్యాపారులు ఇప్పుడు ధరను మరింత తగ్గించారు. క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.1,800 ధరనే చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి క్వింటాలుకు ఆరు కిలోల తరుగుగా లెక్కించి సొమ్ము చెల్లిస్తామని కూడా వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కతో ఒక క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.1,690 మాత్రమే రైతుకు లభిస్తాయి. అంటే గతంలో చెల్లించిన ధరలో సగం ధర మాత్రమే ఎర్రజొన్నలకు లభిస్తుంది. దీంతో ఎర్రజొన్నలను సాగు చేసిన రైతులు ఎక్కువ మొత్తంలో నష్టపోతారు. ఒక పక్క రైతుల ఉద్యమం కొనసాగుతుండగా గ్రామాలలో తమ ఏజెంట్లను తిప్పుతున్న వ్యాపారులు తాము సూచించిన ధరకు ఎర్రజొన్నలు విక్రయిస్తే వెంటనే నగదు చెల్లిస్తామని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించి గతంలో మాదిరిగా ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తే వ్యాపారులు కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్నల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అటు పోలీసన్న.. ఉద్యమాన్ని కొనసాగిస్తారని గుర్తించిన పోలీసులు గ్రామాలలోకి బలగాలను దించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జగిత్యాల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ తదితర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సివిల్ పోలీసులతో పాటు ప్రత్యేక బెటాలియన్ పోలీసులు కూడా గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు గ్రామాలలోకి చేరుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలను నిర్వహించినా తాము శాంతియుతంగానే ఉద్యమం నిర్వహించామని రైతులు చెబుతున్నారు. కాని పోలీసులు పల్లె ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి పికెట్లను కొనసాగించడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యమానికి తరలివచ్చిన రైతులు ఏగ్రామానికి చెందిన వారు అని గుర్తించి ఆ గ్రామాలపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించారు. అలాగే జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలలో ఎక్కువ మంది పోలీసులను నియమించారు. ఏ క్షణంలోనైనా ఉద్యమాన్ని అడ్డుకోవడానికి తాము సిద్ధమే అనే విధంగా పోలీసులు ఎక్కడ అంటే అక్కడ పికెట్ నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు బలగాలను గ్రామాలలో దింపడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలు సద్దుమణగని ఈ తరుణంలో పోలీసుల పికెట్లు నిర్వహించడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిం చి, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. మంగళవారం సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో పసుపు, ఎర్రజొన్న ప్రధాన వాణిజ్య పంటలు అయినప్పటికీ అక్కడి రైతుల పంటలను న్యాయమైన ధర చెల్లించి కొనుగోలు చేసే మార్కెట్ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. పసుపు శుద్ధికి, అమ్మకానికి నిజామాబాద్‌లో కావాల్సిన సౌకర్యాలు లేవన్నారు. ఎర్రజొన్న మార్కెట్ కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఉందని, వారే మార్కెట్‌ను శాసిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారన్నారు. అందు కే రైతులు గిట్టుబాటుధర కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగిన చర్య లు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఎర్రజొన్నలను క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున, పసుపు క్వింటా ల్కు రూ.15 వేల ధర స్థిరీకరించేలా చర్యలు చేపట్టాలని, పసుపు బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నా రు. మార్కెట్ చట్టంలోని సెక్షన్ 11ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. కేంద్రం సూచించినట్లుగా కాంట్రాక్టు వ్యవసాయంలో రైతుల రక్షణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఆందోళన చేస్తున్న రైతులపై, రైతు సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న నాయకులను విడుదల చేయాలని ఆయన కోరారు. -
మొదటి దశలో ఐదు ఎర్రజొన్న కొనుగోలు కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎర్రజొన్న కొనుగోలుకు మొదటిదశలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అవసరాన్ని బట్టి వాటి సంఖ్య పెంచుతామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మరపల్లి, బాల్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఎర్రజొన్నల కొనుగోలుకు అనుసరించాల్సిన విధివిధానాలపై శనివారం ఆయన వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగ న్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, మార్క్‌ఫెడ్ జీఎం రాములుతో సమావేశమయ్యారు. పోచారం మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా సోమవారం నుంచి ఎర్రజొన్నలను క్వింటాకు రూ.2,300తో కొనుగోలు చేస్తామని, రైతులు ఎర్రజొన్నలను మార్కెట్‌కు తీసుకురావడానికి టోకెన్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట విస్తీర్ణం, దిగుబడి ఆధారంగా టోకెన్లను జారీ చేస్తామని, టోకెన్‌లో ఉన్న తేదీ ఆధారంగా రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు చూపాలన్నారు. రైతులు మధ్యవర్తులను, బ్రోకర్లను నమ్మొద్దని, వారికి సహకరించొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది పండిన పంటను మాత్రమే కొనుగోలు చేస్తామని, గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లోని గత ఏడాది నిల్వలను కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా పాత నిల్వలను అమ్మడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఎర్రజొన్నల దిగుమతులను అనుమతించబోమన్నారు. -
ఎర్రజొన్న కొనుగోళ్లపై విజి‘లెన్స్’
-
ఎర్రజొన్న కొనుగోళ్లపై విజి‘లెన్స్’
సాక్షి, హైదరాబాద్: ఎర్రజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం నిఘా పెట్టింది. దళారులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎకరానికి 12 క్వింటాళ్లకు మించి ఎర్రజొన్నలను మార్కెట్‌కు తీసుకువచ్చే వారిపై విజిలెన్స్ నిఘా పెట్టాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసినవాటికి ఇచ్చే డబ్బును రైతు ఖాతాలోనే జమ చేయాలని స్పష్టం చేశారు. ఎర్రజొన్న కొనుగోళ్లపై శుక్రవారం ఇక్కడ ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎర్రజొన్న రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేయాలని, వ్యవసాయ విస్తరణాధికారి, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించిన తర్వాతే నిజమైన రైతుల నుంచి ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని సూచిం చారు. ఎర్రజొన్న పండించిన అసలు రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రజొన్నల సేకరణ వ్యవహారంపై శనివారం ఆర్మూర్‌ను సంద ర్శించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటక లో దాదాపు మూడున్నర లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్న నిల్వలున్నట్టు సమాచారం అందిందని, అక్కడ క్వింటాలు ధర రూ.1600 మాత్రమే ఉన్నందున అవి రాష్ట్రానికి రావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ రంగంలో వస్తున్న ధోరణులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి పరిశోధన విభాగం అవసరమన్నారు. రేపట్నుంచి ఎర్ర జొన్నల కొనుగోలు సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 19 నుంచి ఎర్రజొన్నల కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో 45 రోజులపాటు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మద్దతు ధరకు ఎర్రజొన్నలు కొంటారు. వీటికి క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున మార్క్‌ఫెడ్ చెల్లిస్తుంది. కొనుగోలులో ఏమైనా నష్టం సంభవిస్తే ఆ మేరకు నోడల్ ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పార్థ సారథి స్పష్టంచేశారు. మూడు జిల్లాల్లోని 33 మండలాల్లో 27,506 మంది రైతులు 51,234 ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు చేస్తున్నారని ఉత్తర్వులో వెల్లడించారు. 87,099 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలు పండుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. -
కదంతొక్కిన ఎర్రజొన్న రైతులు
-
కదంతొక్కిన ఎర్రజొన్న రైతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎర్రజొన్న రైతులు కదంతొక్కారు.. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కారు.. ఎర్రజొన్న కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సుమారు రెండు వేలమంది రైతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ముందుగా మామిడిపల్లి చౌరస్తాకు చేరుకున్న రైతులు రోడ్డుపై బైటాయించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అక్కడ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. రైతుల ఆందోళనకు మద్దతు పలికేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించేశారు. నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న కొనుగోలుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని పేర్కొన్నారు. ఎర్రజొన్నకు క్వింటాలుకు రూ.4,500, పసుపునకు క్వింటాలుకు రూ.15 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. 144 సెక్షన్ విధించినప్పటికీ.. పోలీసులు రైతుల నిరాహార దీక్షకు అనుమతి మంజూరు చేయలేదు. గురువారం ఆర్మూర్ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ చేసి, 144 సెక్షన్ విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని నిజామాబాద్ సీపీ కార్తికేయ ప్రకటించారు. అయితే ఇవేవీ లెక్కచేయని రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. ప్రకటించిన కార్యాచరణ మేరకు రాస్తారోకో, ర్యాలీ, నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులను ఆర్మూర్‌కు తరలించి పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే నివాసాల వద్ద భద్రత.. రైతుల దీక్ష నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే సమీపంలోని పెర్కిట్‌లో ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అవసరమైతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బందోబస్తును పెంచారు. వీరి నివాసాల ముందు బారికేడ్లను ఏర్పాటు చేశారు. -
క్వింటా ఎర్రజొన్నకు రూ.2,300
సాక్షి, హైదరాబాద్ : ఎర్రజొన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాలుకు రూ.2,300 ధరకు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సోమవారం (18వ తేదీ) నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గురువారం సాయంత్రం సచివాలయంలో పోచారం, ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎర్రజొన్న రైతులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎర్రజొన్నలకు తగిన ధర లేకపోవటం, వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవటంతో నిజామాబాద్, నిర్మల్, జగి త్యాల జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని కవిత, వేముల, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దానిపై సీఎం వెం టనే స్పందించారు. ఎర్రజొన్న రైతులను ఆదుకునే బాధ్య త ప్రభుత్వానిదేనని, వెంటనే కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎర్రజొన్న రైతుల తరఫున తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పోరాడిందని పోచారం అన్నారు. ‘‘ఎర్ర జొన్న రైతులను 2014కు ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.12 కోట్ల బకాయిలను చెల్లించింది. కాంగ్రెస్ నేతలు సొల్లు మాటలు చెబుతున్నారు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్కడ ఎర్రజొన్నలను క్వింటా రూ.1,600కే కొంటున్నారు. ఇక్కడ మాత్రం రైతులకు కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారమిచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. ఆఖరి బస్తా వరకూ కొంటాం: కవిత ఆఖరి బస్తా వరకు ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతు లు దిగులు పడాల్సిన అవసరమే లేదని కవిత భరోసా ఇచ్చారు. ‘రెండు రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కాం గ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం. గతంలో కనీస మద్దతు ధర కోసం నిజామాబాద్‌లో ఆందోళన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కడుపుల్లో తూటాలు దింపింది’ అంటూ మండిపడ్డారు. ఎర్ర జొన్నలనుకొనాలని నిర్ణయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలి
ఆర్మూర్ : ఎర్రజొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ప్రాంగణంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రజొన్న రైతు ప్రతినిధులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 110 గ్రామాల్లో ఎర్రజొన్న పంటను సుమారు 50 వేల ఎకరాల్లో పండిస్తున్నారన్నారు. ఈ పంటను మన రాష్ట్రంతో పాటు హర్యానా, ఢిల్లీ, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా లాంటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఇక్కడ పండిన పంట దేశ సరిహద్దులు దాటుతున్నా సీడ్ వ్యాపారుల మోసాల కారణంగా రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కోసం రైతులు చేసిన ఉద్యమంలో రైతుల పక్షాన నిలిచిన టీఆర్‌ఎస్‌నాయకులు ఇప్పుడెందుకు రైతులను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీడ్ వ్యాపారుల సిండికేట్ వ్యాపారానికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తూ విత్తన వ్యాపారం చేయాలనే డిమాండ్‌తో రైతు ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని ప్రారంభించనున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 9న చలో కలెక్టరేట్‌కు పిలుపునిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రజొన్న రైతులు తరలి వచ్చి చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజేశ్వర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఏపీ గంగారాం, రాజన్న, నాయకులు కిషన్, అశోక్, పీడీఎస్‌యూ జిల్లా మాజీ కార్యదర్శి సుమన్, ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మోర్తాడ్ : రైతులు పండిస్తున్న ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగ సమస్యల పరిశీలనలో భాగంగా ఆయన ఆదివారం మోర్తాడ్‌లో రైతులను కలిసి వారి సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్మూర్ డివిజన్లో రైతులు అధికంగా ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎర్రజొన్నల ఎగుమతి సాగుతుందని వివరించారు. ఈ వాణిజ్య పంటను ప్రభుత్వం బ్రోకర్లకు అప్పగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆర్మూర్ డివిజన్లో 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పంట సాగు అవుతుందని, 7 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి సాగుతుందని తెలిపారు. దళారులు ఈ పంటను కొనుగోలు చేస్తూ రైతులకు సరైన ధర చెల్లించడం లేదన్నారు. గత సంవత్సరం ఎర్రజొన్న పంటను విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు అందాల్సి ఉందన్నారు. అలాగే మొక్కజొన్న పంటకు క్వింటాలుకు రూ.1,410 మద్దతు ధరగా ప్రకటించడం శోచనీయమని తెలిపారు. మక్కలకు మార్కెట్లో ధర అధికంగా ఉండగా, ప్రభుత్వం మద్దతు ధరను పెంచకపోవడం సరికాదన్నారు. రైతు కూలీ సంఘం నాయకులు దేవారాం, భూమయ్య, గంగాధర్, రామకృష్ణ, డాక్టర్ సత్యనారాయణ, సురేశ్, రాజేశ్వర్, కిషన్, భాజన్న, అశోక్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి : ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగ సమస్యలపై పరిశీలన కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఏఐకేఎంఎస్ నేతలు ఆదివారం పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. అనంతరం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రూ. 2 వేలు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేతలు దేవరాం, భూమయ్య, గంగాధర్, రామకృ ష్ణ, సత్యనారాయణ, సురేశ్, రాజేశ్వర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.