సాక్షి, హైదరాబాద్: ఎర్రజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం నిఘా పెట్టింది. దళారులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎకరానికి 12 క్వింటాళ్లకు మించి ఎర్రజొన్నలను మార్కెట్‌కు తీసుకువచ్చే వారిపై విజిలెన్స్ నిఘా పెట్టాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసినవాటికి ఇచ్చే డబ్బును రైతు ఖాతాలోనే జమ చేయాలని స్పష్టం చేశారు. ఎర్రజొన్న కొనుగోళ్లపై శుక్రవారం ఇక్కడ ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఎర్రజొన్న రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేయాలని, వ్యవసాయ విస్తరణాధికారి, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలించిన తర్వాతే నిజమైన రైతుల నుంచి ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని సూచిం చారు. ఎర్రజొన్న పండించిన అసలు రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎర్రజొన్నల సేకరణ వ్యవహారంపై శనివారం ఆర్మూర్‌ను సంద ర్శించాలని అధికారులను ఆదేశించారు. కర్ణాటక లో దాదాపు మూడున్నర లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్న నిల్వలున్నట్టు సమాచారం అందిందని, అక్కడ క్వింటాలు ధర రూ.1600 మాత్రమే ఉన్నందున అవి రాష్ట్రానికి రావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ రంగంలో వస్తున్న ధోరణులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి పరిశోధన విభాగం అవసరమన్నారు.
రేపట్నుంచి ఎర్ర జొన్నల కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 19 నుంచి ఎర్రజొన్నల కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో 45 రోజులపాటు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మద్దతు ధరకు ఎర్రజొన్నలు కొంటారు. వీటికి క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున మార్క్‌ఫెడ్ చెల్లిస్తుంది. కొనుగోలులో ఏమైనా నష్టం సంభవిస్తే ఆ మేరకు నోడల్ ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పార్థ సారథి స్పష్టంచేశారు. మూడు జిల్లాల్లోని 33 మండలాల్లో 27,506 మంది రైతులు 51,234 ఎకరాల్లో ఎర్రజొన్నలు సాగు చేస్తున్నారని ఉత్తర్వులో వెల్లడించారు. 87,099 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నలు పండుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment