కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పసుపు, ఎర్రజొన్న రైతులు దిగాలు పడుతూ.. ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంటే మరోవైపు పోలీసులు పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పహారా కాస్తున్నారు. ప్రభుత్వం కొను గోలుకు స్పందించక పోవడంతోనే ఎర్రజొన్న పంట ధర మరింత దిగజారిపోతోందని, వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారని రైతన్నలు వాపోతున్నారు. ఫలితంగా పల్లెల్లో రోడ్లపై ఆరబెట్టిన ఎర్రజొన్న కుప్పలుగా కనిపిస్తోంది.
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం ముందుకు రాకపోగా, సీడ్ ఇచ్చిన వ్యాపారులూ గిట్టుబాటు ధర ఇవ్వక పోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మార్కెట్‌లో ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నా తమ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యాపారులు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.3,500 ధర చెల్లించిన వ్యాపారులు క్రమక్రమంగా ధరను తగ్గిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఏటేటా పెరుగుతుండగా తాము పండించిన పంటలకు మాత్రం ధర ఎలా పడిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నా గతంలో మాదిరిగా ప్రభుత్వం కొనుగోలు చేయదని గుర్తించిన వ్యాపారులు కావాలని ధరను తగ్గిస్తున్నారని రైతులు అంటున్నారు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని తాము ఉద్యమం ఆరంభించిన మొదట్లో ఎక్కువ ధరకు వాటిని కొనుగోలు చేస్తామని వ్యాపారులు మాట ఇచ్చారని రైతులు చెబుతున్నారు.
అటు ఎర్రజొన్న..
క్వింటాలుకు రూ.2,300 వరకు ధర ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ప్రభుత్వ ధోరణి స్పష్టం కావడంతో ఇప్పుడు మాట మార్చారని రైతులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.2000 నుంచి రూ.2,300 వరకు ధర చెల్లించడానికి ముందుకు వచ్చిన వ్యాపారులు ఇప్పుడు ధరను మరింత తగ్గించారు. క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.1,800 ధరనే చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి క్వింటాలుకు ఆరు కిలోల తరుగుగా లెక్కించి సొమ్ము చెల్లిస్తామని కూడా వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కతో ఒక క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.1,690 మాత్రమే రైతుకు లభిస్తాయి.
అంటే గతంలో చెల్లించిన ధరలో సగం ధర మాత్రమే ఎర్రజొన్నలకు లభిస్తుంది. దీంతో ఎర్రజొన్నలను సాగు చేసిన రైతులు ఎక్కువ మొత్తంలో నష్టపోతారు. ఒక పక్క రైతుల ఉద్యమం కొనసాగుతుండగా గ్రామాలలో తమ ఏజెంట్లను తిప్పుతున్న వ్యాపారులు తాము సూచించిన ధరకు ఎర్రజొన్నలు విక్రయిస్తే వెంటనే నగదు చెల్లిస్తామని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించి గతంలో మాదిరిగా ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తే వ్యాపారులు కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్నల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అటు పోలీసన్న..
ఉద్యమాన్ని కొనసాగిస్తారని గుర్తించిన పోలీసులు గ్రామాలలోకి బలగాలను దించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జగిత్యాల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ తదితర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సివిల్ పోలీసులతో పాటు ప్రత్యేక బెటాలియన్ పోలీసులు కూడా గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు గ్రామాలలోకి చేరుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలను నిర్వహించినా తాము శాంతియుతంగానే ఉద్యమం నిర్వహించామని రైతులు చెబుతున్నారు. కాని పోలీసులు పల్లె ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి పికెట్‌లను కొనసాగించడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఉద్యమానికి తరలివచ్చిన రైతులు ఏగ్రామానికి చెందిన వారు అని గుర్తించి ఆ గ్రామాలపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించారు. అలాగే జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలలో ఎక్కువ మంది పోలీసులను నియమించారు. ఏ క్షణంలోనైనా ఉద్యమాన్ని అడ్డుకోవడానికి తాము సిద్ధమే అనే విధంగా పోలీసులు ఎక్కడ అంటే అక్కడ పికెట్ నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు బలగాలను గ్రామాలలో దింపడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలు సద్దుమణగని ఈ తరుణంలో పోలీసుల పికెట్‌లు నిర్వహించడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment