
మాట్లాడుతున్న ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్
ఆర్మూర్ : ఎర్రజొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ప్రాంగణంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రజొన్న రైతు ప్రతినిధులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 110 గ్రామాల్లో ఎర్రజొన్న పంటను సుమారు 50 వేల ఎకరాల్లో పండిస్తున్నారన్నారు. ఈ పంటను మన రాష్ట్రంతో పాటు హర్యానా, ఢిల్లీ, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా లాంటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఇక్కడ పండిన పంట దేశ సరిహద్దులు దాటుతున్నా సీడ్ వ్యాపారుల మోసాల కారణంగా రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కోసం రైతులు చేసిన ఉద్యమంలో రైతుల పక్షాన నిలిచిన టీఆర్‌ఎస్‌నాయకులు ఇప్పుడెందుకు రైతులను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీడ్ వ్యాపారుల సిండికేట్ వ్యాపారానికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తూ విత్తన వ్యాపారం చేయాలనే డిమాండ్‌తో రైతు ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని ప్రారంభించనున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 9న చలో కలెక్టరేట్‌కు పిలుపునిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రజొన్న రైతులు తరలి వచ్చి చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజేశ్వర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఏపీ గంగారాం, రాజన్న, నాయకులు కిషన్, అశోక్, పీడీఎస్‌యూ జిల్లా మాజీ కార్యదర్శి సుమన్, ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment