msp price
-
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
ఆగిన ఢిల్లీ ఛలో! 5 పాయింట్లలో..
కీలక డిమాండ్ల సాధనలో నిన్నటి వెనక్కి తగ్గని అన్నదాతలు.. ఇప్పుడు చల్లబడ్డారా? లేకుంటే.. తమ ఆందోళనలను తీవ్ర తరం చేయబోతున్నారా? అసలు ఢిల్లీ ఛలోకి విరామం ఎందుకు ప్రకటించారు?. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అప్పటిదాకా ఏం చేయబోతున్నారనేది కూడా చెప్పేశారు. 1. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరీల వద్ద భారీ సంఖ్యలో రైతులు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సైతం భాష్పవాయువు ప్రయోగం.. లాఠీ ఛార్జీతో ఆ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. అయితే ఆ వెంటనే ఢిల్లీ ఛలోను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. తమ నిర్ణయం ఏంటన్నది ఆరోజునే(29న) ప్రకటిస్తామని చెప్పారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేదాకా.. అక్కడే వివిధ రూపాల్లో నిరసనలను తెలపాలని రైతులకు.. రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2. ఇవాళ క్యాండిల్ మార్చ్.. రేపు రైతుల సమస్యల మీద సెమినార్ల నిర్వహణతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ-కేంద్రం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఆపై రెండు రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో వరుస సమావేశాలు జరుగుతాయన్నారు. రానున్న ఐదురోజుల్లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, మరికొన్ని సంఘాలు భేటీ అయ్యి సంయుక్తంగా తదుపరి కార్యాచరణను రూపొందిస్తాయని ఆ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. 3. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానివైపు వైపు రైతులు కదం తొక్కేందుకు యత్నిస్తుండగా.. గత 11 రోజులుగా భద్రతా బలగాలు వాళ్లను నిలువరిస్తూ వస్తున్నారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో బలగాలు.. ట్రాక్టర్లు, వాటికి రక్షణ కవచాలతో రైతులు పోటాపోటీ ప్రదర్శనలతో యుద్ధవాతావరణాన్ని తలపించారు. ఈ క్రమంలోనే ముందుకొచ్చిన రైతులపై బలగాలు భాష్పవాయుగోళాలు ప్రయోగంతో పాటు లాఠీ ఛార్జీ చేయడం చేశాయి. అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. 4. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెందిన తర్వాత ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. అయితే.. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. దీంతో రైతుల నిరసనలు మొదలయ్యాక ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి. 5.ఒకవైపు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం చెబుతుండగా.. మరోవైపు రైతు సంఘాలు మాత్రం నిర్ణీత కాల వ్యవధితో తమకు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని.. లేకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని అంటున్నాయి. ఇంకోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. -
రైతుల ఆందోళనలు.. నేడు నాలుగో రౌండ్లో చర్చలు
ఛండీగడ్: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాలుగోసారి చర్చలు జరుపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానందరాయ్‌లు నేడు ఛండీగడ్‌లో రైతులతో భేటీ కానున్నారు. మరోవైపు.. రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో రైతులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతు కూలీలకు పింఛను, వ్యవసాయ రుణాల మాఫీ వంటివి రైతుల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. ఇక, శంభు సరిహద్దుల వద్దే రైతులు బస చేశారు. -
సానుకూలంగా చర్చలు.. సరిహద్దులోనే రైతులు!
తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలో యాత్ర చేపట్టిన రైతులు.. తమ నిరసనల్ని కొనసాగించాలనే నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి దాకా కేంద్రంతో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అయితే సానుకూలంగానే జరిగినట్లు ఇటు కేంద్రం, అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మీడియాకు తెలియజేశారు. కానీ, రైతు సంఘాలు మాత్రం కాలపరిమితితో కూడిన హామీ కోరుతున్నాయి. దీంతో ఇరువర్గాలు ఆదివారం సాయంత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. అయితే.. తమ నిరసనలను మాత్రం కొనసాగించి తీరతామని, ఢిల్లీ మార్చ్ కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. మంగళ, బుధవారాల్లో అట్టుడికిన పంజాబ్, హర్యానా సరిహద్దులు.. చర్చల నేపథ్యంలో గురువారం కాస్త శాంతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తాము వెనక్కి వెళ్లబోమని.. శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. చర్చలపై ఎవరేమన్నారంటే.. .. ఛండీగఢ్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్‌తో రైతు సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. రైతుల డిమాండ్లలో ముఖ్యమైన అంశాలపై వివరంగా చర్చించామని.. సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి అర్జున్ ముండా మీడియాకు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం జరగబోయే చర్చలతో ఇరువైపుల నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం సరిహద్దులో వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. #WATCH | Union Ministers Piyush Goyal, Arjun Munda, Nityanand Rai and Punjab CM Bhagwant Mann hold a meeting with farmer leaders, in Chandigarh. (Video: CM Bhagawant Mann PRO) pic.twitter.com/3mCx30DXbd — ANI (@ANI) February 15, 2024 ఇక రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర(MSP), రైతుల రుణమాఫీ లాంటి అంశాలపై చర్చించినా.. కాలపరిమితితో కూడిన హామీ దొరికితేనే తాము నిరసనలు విరమిస్తామని తెలిపారు. ‘‘కేవలం చర్చల కోసమే మేం లేం. పరిష్కారం కూడా కావాలి. అందుకు సమయం కావాలి అని వాళ్లు(కేంద్ర మంత్రుల్ని ఉద్దేశిస్తూ..) కోరారు అని రైతు సంఘాల నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో.. శాంతియుతంగా నిరసనలు కొనసాగిద్దామని రైతులకు సంఘాల నేతలు పిలుపుఇచ్చారు. ఇక తమ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు విధించడం..రైతులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును వాళ్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో.. #WATCH | Chandigarh: After the meeting between the central government and the farmer unions concluded, farmer leader Jagjit Singh Dallewal says, "The protest will continue peacefully... We will not do anything else. We will appeal to the farmers too. When meetings are underway… pic.twitter.com/YJOZIZ8Nlm — ANI (@ANI) February 15, 2024 నేడు బంద్‌కి పిలుపు రైతు సంఘాలు శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తామంటున్నాయి. ఇక సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు వ్యవసాయ పనులు మాని.. రైతులంతా రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపాలని పిలుపు ఇచ్చింది కిసాన్ మోర్చా. ఎమ్ఎస్పీ, కనీస పెన్షన్, కనీస వేతనం.. ఇలా 21 డిమాండ్ల సాధన కోసం తొమ్మిది యూనియన్ల సీనియర్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సంయుక్త నిరసన తెలిపేందుకు సిద్దం అయ్యారు. రైతుల సంఘాలుఇచ్చిన భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. నోయిడాలో 144 సెక్షన్ విధించారు. -
ఒక్క రోజులోనే మార్కెట్‌కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం
జనగామ: వానాకాలం సీజన్లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్‌కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు. రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్లో టోకెన్ కేటాయించి గేట్ ఎంట్రీ వద్ద లాట్ నంబర్ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు. 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం వానాకాలం సీజన్లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్ రూ.2,203, సాధారణ గ్రేడ్‌కు రూ.2,183 ప్రకటించింది. కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్ ప్రైజ్ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది. ధర తక్కువగా వచ్చింది పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్‌కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు. – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్(ఎర్రకుంటతండా) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్‌కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్, నర్మెట ధర పడిపోకుండా చూస్తున్నాం.. మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం. – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్ చైర్మన్ -
AP: ‘ధర’హాసం.. రైతులకు ఎమ్మెస్పీ కంటే మిన్నగా మార్కెట్ రేట్లు
సాక్షి, అమరావతి: కనీస మద్దతు ధర కూడా లభించక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తద్వారా వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)కు మించి రికార్డు స్థాయి రేట్లు పలుకుతున్నాయి. ధర తగ్గిన ప్రతిసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని, అధిక ధరకు పంట కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారులు కూడా అదే ధరకు కొనాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీని పెంచగలిగింది. ప్రత్యేకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడల్లా పంటలు కొనుగోలు చేస్తోంది. ఫలితంగా మార్కెట్లో ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. పత్తి, మిరప, వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్నకు ఎమ్మెస్పీకి మించి లభిస్తోంది. పొగాకు సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలైన జొన్నలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుము, పసుపు, ఉల్లి, టమాటాకు మద్దతు ధర కల్పించింది. మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల ద్వారా మూడున్నరేళ్లలో 4.27 లక్షల మంది రైతుల నుంచి రూ.7,157 కోట్ల విలువైన 20.18 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్లో పత్తి, మొక్కజొన్న, సజ్జ, వేరుశనగను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి పత్తి, మిరప, మినుము, వేరుశనగ, సజ్జలు, మొక్కజొన్న, పెసల ధరలు రికార్డు స్థాయిలో ఉండగా పసుపు, శనగ, సన్‌ఫ్లవర్ సీడ్ ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూ ఇటుగా ఉన్నాయి. రికార్డు స్థాయి ధరలు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా కర్నూలు మార్కెట్లో గరిష్టంగా రూ.37 వేలు, గుంటూరు యార్డులో రూ.30 వేలకు పైగా ఉండటం గమనార్హం. నల్లతామర పురుగుతో గతేడాది మిరప దెబ్బతినగా ఈ దఫా ఆ ప్రభావం పెద్దగా లేదు. మార్కెట్లో ధరలు రికార్డు స్థాయిలో ఉండడంతో రైతన్నలు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటాల్ రూ.6,380 కాగా రూ.7,659, మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,080 కాగా రూ.7,359 పలుకుతోంది. ఈ సీజన్లో గరిష్టంగా రూ.9,500 పలికింది. మిగిలిన పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. అపరాలకు కూడా ప్రస్తుత సీజన్లో మంచి రేటు లభిస్తోంది. మినుము ఎమ్మెస్పీ రూ.6,600 కాగా ప్రస్తుతం రూ.8,400కిపైగా పలుకుతోంది. పెసలు ఎమ్మెస్పీ రూ.7,755 కాగా ప్రస్తుతం రూ.8 వేలు దాటింది. కందులు ఎమ్మెస్పీ రూ.6,300 కాగా ప్రస్తుతం రూ.7,500 పలుకుతోంది. మొక్కజొన్న ఎమ్మెస్పీ రూ.1,860 కాగా మార్కెట్లో రూ.2,600 ఉంది. వేరుశనగ ఎమ్మెస్పీ రూ.5,850 కాగా ప్రస్తుతం రూ.7 వేలు పలుకుతోంది. సజ్జలు ఎమ్మెస్పీ రూ.2,350 కాగా ప్రస్తుతం రూ.2,600 చొప్పున గరిష్ట ధర లభిస్తోంది. ఉల్లి ఎమ్మెస్పీ రూ.770 కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.1,000 నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది. మార్కెట్ ఆశాజనకం మార్కెట్ చాలా ఆశాజనకంగా ఉంది. మిరప, పత్తి, మొక్కజొన్న, అపరాలు, సజ్జలు మినహా చిరుధాన్యాలు ఎమ్మెస్పీ మించి ధర పలకడం శుభ పరిణామం. నిరంతరం సీఎం యాప్ ద్వారా ధరలను పర్యవేక్షిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
రైతులకు గుడ్‌న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
న్యూఢిల్లీ: దేశంలోని రైతులందరికీ శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రబీ సీజన్ 2022-23(జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. గోదుమలకు క్వింటాలుకు రూ.110, ఆవాలు క్విటాలుకు రూ.400 పెంచింది. తాజా పెంపుతో గోదుమలు 2021-22లో క్వింటాలుకు రూ.2015 ఉండగా.. ప్రస్తుతం రూ.2,125కు చేరింది. ఆవాలు క్వింటాలుకు రూ.5,450కి చేరింది. రబీ పంటకాలానికి గోదుమల పెట్టుబడి వ్యయం రూ.1,065గా అంచనా వేసింది కేంద్రం. పంటలకు క్వింటాలుకు పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి.. ► మసూర్ పప్పుకు రూ.500 ► గోధుమలకు రూ.100 ► బార్లీ రూ.100, ► శనగలు రూ.150 ► సన్ ఫ్లవర్ రూ.209 ►ఆవాలు రూ.400 రూపాయలు -
‘ఎంఎస్పీ’ కమిటీపై రగడ.. కేంద్రం ఏమందంటే?
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించాయి. రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్థించిన కుహానా రైతు నేతలకు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధి లేమిని బయట పెట్టుకుందంటూ ధ్వజమెత్తాయి. ఆ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకే కమిటీ వేశారని ఆరోపించాయి. ఇదో బోగస్ కమిటీ అని ఎస్కేఎం సభ్యుడు దర్శన్ పాల్ ఆరోపించారు. మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం వెనక ఉద్దేశం ఇదేనని రైతు నేతలు అంటున్నారు. పలు అంశాలను చేర్చడం ద్వారా మద్దతు ధర అంశం ప్రాధాన్యతను తగ్గించారని హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్‌సింగ్ దుయ్యబట్టారు. రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ ప్యానల్లో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్ చెప్పారు. మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఎంఎస్పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామన్నారు. ఇదీ చదవండి: PM Kisan: అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..! -
జనపనార రైతులకు కేంద్రం శుభవార్త..!
జనపనార రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2022-23 సీజన్‌కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారసుల ఆధారంగా క్వింటాకు రూ.250 పెంచుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23 సీజన్లో ముడి జనపనార(టీడీఎన్3 గ్రేడ్‌కు సమానమైన టీడీఎన్3) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.4,750గా నిర్ణయించారు. దీని వల్ల కనీస మద్దతు ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్వింటాకు రూ.250 పెరగనుంది. 2018-19 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎమ్ఎస్పీని అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు స్థాయిలో నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా కొత్త ఎమ్ఎస్పీని ప్రకటించింది. "దీని వల్ల లాభ శాతం కనీసం 50 శాతం పెరుగుతుంది. జనపనార రైతులకు మెరుగైన లాభదాయకమైన రాబడిని అందించడానికి, నాణ్యమైన జనపనార ఫైబరును ప్రోత్సహించడానికి ఇది ముఖ్యమైన నిర్ణయం" అని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. భారీ జరిమానా కట్టాల్సిందే!) -
రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం
జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకొన్న వివాదాలు ఇప్పట్లో వీడేట్లు లేవు. పార్లమెంట్లో ఆమోదించిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేస్తున్నట్లు నవంబర్ 19న నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఉద్యమం విరమించలేదు సరికదా... మరో ప్రధాన డిమాం డ్‌పై పట్టుబట్టాయి. అన్ని పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర ప్రకటించాలని, లేదంటే ఉద్యమం విరమించ మని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. పోరాడి తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ప్రజాస్వామ్యంలో నిజమే గానీ అన్ని పంటల ఎంఎస్పీకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించినట్లయితే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయా? వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ 2006లో సూచించిన విధానంలో ప్రధాన పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న డిమాండ్‌ను మరుగునపర్చి.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంఎస్పీకి చట్టబద్దత కోరడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? సాగు చట్టాలను రద్దు చేయడం వరకు ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. ఉద్యమాన్ని చల్లార్చడా నికే తప్ప రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు కనపడటం లేదు. 2014 ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామనీ, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే బాణీ మార్చింది. స్వామినాథన్ కమిషన్ పేర్కొన్న విధానంలో అమలు చేస్తే వినియోగదారుడిపై అధికభారం పడుతుంది కనుక ఆ పద్ధతితో ‘ఎంఎస్పీ ఇవ్వం’ అని కరాఖండీగా చెప్పడమే కాదు... ఆ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. పైగా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే పంటల ఉత్పత్తి ఖర్చులను కేంద్ర ప్రభుత్వం తక్కువచేసి చూపడమో, తిరస్కరించడమో చేస్తూ... తక్కువ స్థాయిలో మద్దతు ధరలను నిర్ణయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఎంఎస్పీలో శాస్త్రీయత పాళ్లు 1% కూడా లేవని చెప్పడం అతిశయోక్తి కాబోదు. హెక్టారు వ్యవసాయ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల భత్యం, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు చెల్లించే అద్దె మొత్తం, రైతు కుటుంబ సభ్యులు భూమిలో చేసిన శ్రమ, భూమి కౌలు ధర, సొంత పెట్టుబడి పెట్టినపుడు దానిపై వచ్చే వడ్డీ... వీటన్నింటిని కలిపి మద్దతు ధర నిర్ణయించాలని స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు చేయగా... వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) కొన్ని అంశాలనే పరిగణనలోకి తీసుకొని ఆ ధరలనే సిఫారసు చేయడం, వాటినే కేంద్రం ఆమోదించడం ఓ తంతుగా ఇన్నేళ్లూ నడిచి పోతోంది. ఈ విధానం రైతులకే కాదు ఎవరికీ ఆమోద యోగ్యం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పంటల సాగు వ్యయాలు తీసుకొని వాటిని కలిపి జాతీయ సగటుగా లెక్కించి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి అన్యాయం జరుగుతోంది. దేశం మొత్తాన్ని 4 లేదా 5 జోన్లుగా విభజించి, జోన్ల వారీగా కనీస మద్దతు ధరలను లెక్కించాలన్న హేతుబద్ధ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. పంటల ఉత్పత్తి ఖర్చులను అంచనా వేయడానికి, వాటికి మద్దతు ధరలు నిర్ణయించడానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రమేష్‌చంద్ కమిటీని నియమించింది. ఆ కమిటీ దాదాపు ఏడాది తర్వాత, కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక 23 సూచనలతో ఓ నివేదిక సమర్పించగా దానిని బుట్టదాఖలా చేశారు. 2018–19 నుంచి ఎఫ్2+50 శాతం విధానంలో మద్దతు ధరను అమలు చేస్తూ... అదే స్వామినాథన్ సూచించిన ఎంఎస్పీ అంటూ నమ్మబలికారు. దేశంలో 51 రకాల ప్రధాన పంటలు పండుతోంటే కేంద్ర ప్రభుత్వం 14 నుంచి 23 రకాల పంటలకు మాత్రమే అరకొరగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తోంది. కనీస మద్దతు ధరలు సక్రమంగా లభించని కారణంగా దేశ రైతాంగానికి సాలీనా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయోత్పత్తుల విలువలో గరిష్టంగా 25 శాతం మేర వివిధ సబ్సిడీల రూపంలో రైతులకు అందిస్తుండగా, భారతదేశంలో అన్ని రకాల సబ్సిడీలు 4 శాతం మించడం లేదు. కనీస మద్దతు ధరలు కూడా మిగతా దేశాలతో పోలిస్తే ప్రపంచ మార్కెట్లో 17 శాతం తక్కువగా ఉన్నట్లు ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) వ్యవసాయ నివేదిక తెలియజెప్పింది. ఈ నేపథ్యంలో స్వామినాథన్ కమిషన్ కనీస మద్దతు ధరలను సి2+50 శాతం ప్రకారం ఇవ్వాలని, అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని దాదాపు 15 ఏళ్ల క్రితమే స్పష్టం చేసింది. ఆహార ధాన్యాల దీర్ఘకాల విధానంపై ప్రొఫెసర్ అభిజిత్‌సేన్ కమిటీ 2002లో అందించిన నివేదిక సైతం ఇదే సూచనను బలపర్చింది. స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు వాస్తవ సాగువ్యయానికి 50% కలిపి (సి2+50 శాతం) కనీస మద్దతు ధరను అందిస్తే ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు మాత్రమేనని కిసాన్ స్వరాజ్ స్థాపకుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్లో దాదాపు 8%. పారిశ్రామిక రాయితీల రూపంలో, బ్యాంకుల మొండి బకాయిల రద్దు రూపంలో ఏటా లక్షలాది కోట్ల ఆదాయాన్ని వదులుకొంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. పంటలకు మద్దతు ధర పెరిగితే రైతు కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయి. రైతుల ఆత్మహత్యలు తగ్గు తాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, నీతి ఆయోగ్ ఆశించేటట్లు రైతు ఆదాయం రెట్టింపు కావడానికి ఆస్కారం కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాలలో అతిపెద్ద రాజకీయ సంకల్పానికి సంబంధించిన అంశం ఇది. గట్టి రాజకీయ సంకల్పంతోనే అనేక చారిత్రా త్మక మార్పులు జరిగాయి. 2004లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. అందువల్ల స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ గట్టి రాజకీయ సంకల్పం తీసుకోవాలి. అది చేయ గలిగితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు. -డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో.. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చిందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతుధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్పీ ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలు కనీస మద్దతుధర పరిధిలోకి వచ్చాయని పేర్కొన్నారు. దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే అత్యధిక పంటలకు ఎంఎస్పీ ప్రకటించిన రాష్ట్రం ఏపీ అని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో కూడా అత్యధిక పంటలకు ఎంఎస్పీ ఉండేలా చట్టబద్ధమైన హామీ కల్పించాల్సిన అవసరముందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఆటంకంగా ఉన్న అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్లో చట్టం చేయడానికి ఈ సంప్రదింపులు ఎంతగానే ఉపయోగపడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటుచేసి, కనీస మద్దతు ధరపై ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధిత భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
రైతు అభీష్టానికి... రాజ్యం తలొగ్గిన వేళ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే వివాదాస్పద మూడు నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రం ప్రభుత్వం తొలిరోజే లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. బిల్లును సభ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎస్పీజీ)కు చట్టబద్ధతతోపాటు రైతాంగం డిమాండ్లు, సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా కొనసాగుతున్న పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ (పనిదినాలు) ఉంటాయి. క్రిప్టోకరెన్సీలపై నిషేధం పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుతోపాటు మరో 25 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్రిప్టోకరెన్సీలపై నిషేధం బిల్లు కూడా వీటిలో ఉంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీని మాత్రమే ప్రభుత్వం అనుమతించనుంది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు–2019పై జాయింట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్(జేసీపీ) నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించడంతోపాటు డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు నిమిత్తం ఈ బిల్లును 2019లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిపక్షాల సూచన మేరకు బిల్లును క్షుణ్నంగా పరిశీలించడానికి జేసీపీని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ తదితర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు మినహాయింపు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కీలక బిల్లులివే.. గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో నార్కోటిక్స్ డ్రగ్, సైకోటిక్ సబ్‌స్టాన్సెస్ బిల్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్(సవరణ) బిల్లును ఈసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీవీసీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం పొడిగింపునకు సంబంధించిన బిల్లులు ఇందులో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణకు ఉద్దేశించిన ‘కానిస్టిట్యూషన్ (ఎస్సీలు, ఎస్టీలు) ఆర్డర్(సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
వరికంకుల కొత్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, వరంగల్: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల నీరు బిరబిరా కాల్వల్లో పరుగులు... ఫలితంగా రాష్ట్రంలో వరిసాగు రెండింతలైంది. వరికంకులు కొత్త చరిత్ర సృష్టించాయి. 2020– 21 యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఎకరాలు కాగా, 68,14,555(187.02 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. వరిసాగు అంచనా 22,19,326 ఎకరాలు కాగా.. అనూహ్యంగా 52,78,636 (237.85 శాతం) ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు 1,47,80,181 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా. అయితే ఇప్పటికే రైసుమిల్లులు, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు వానాకాలం ధాన్యంతో నిండిపోయాయి. ఈసారి యాసంగి పంట కొనుగోళ్లు సవాల్‌గా మారనున్నాయి. 137 శాతం అధికంగా వరిసాగు గత యాసంగి, ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పంటలు దండిగా రానున్నాయి. అంచనాలకు మించి 137 శాతం అధికంగా వరి సాగైంది. ఒకదశలో ఈ యాసంగి ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల్లో అలజడి చెలరేగడంతో మళ్లీ వెనుకడుగు వేసింది. యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తాజాగా వెల్లడించారు. గతేడాది యాసంగిలో 38,62,510 ఎకరాల్లో వేస్తే ఈసారి 14,16126 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో సాగు అంచనా 43,710 ఎకరాలు కాగా, 1,19,682 ఎకరాల్లో వరివేశారు. నిజామాబాద్‌లో 1,92,616 ఎకరాలకుగాను 3,87,628, మహబూబ్‌నగర్ 29,415కుగాను 1,21,004, కరీంనగర్లో 1,21,853కుగాను 2,64,609, జగిత్యాలలో 1,32,648కుగాను 2,98,283, పెద్దపల్లిలో 1,13,520 ఎకరాలకుగాను 1,97,741 ఎకరాల్లో వరివేశారు. మొత్తంగా ఈ ఏడు 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గోదాములే సమస్య రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 6,408 కొనుగోలు కేంద్రాలను 31 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,131 ఐకేపీ, 3,964 పీఏసీఎస్(ఫ్యాక్స్), 313 ఏఎంసీ, ఇతర కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. ప్రస్తుత సీజన్‌కు కూడా కామన్ రకం క్వింటాకు రూ.1,868, ‘ఏ’గ్రేడ్ రకానికి చెందిన ధాన్యం క్వింటాకు రూ.1,888గా కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చెల్లిం చనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వానాకాలం ధాన్యంతో రైసుమిల్లులు, గోదాములు నిండుకుండల్లా మార డం ప్రతిబంధకం కావచ్చని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపితే 21.99 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా 2,210 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కానీ, ఈసారి సగం మిల్లుల్లో వానాకాలం ధాన్యం, బియ్యం నిల్వలు ఫుల్‌గా ఉన్నాయి. వల్బాపూర్‌లో యంత్రంతో వరికోసిన తర్వాత ఆరబోసిన ధాన్యం ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు యాసంగిలో రైతులు అధికమొత్తంలో దొడ్డురకం వరిధాన్యం సాగు చేశారు. అక్కడక్కడ మాత్రమే సన్నరకం వరి వేశారు. ఈ యాసంగిలో వరి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు అనుమతుల కోసం లేఖ రాశాం. – రాఘవేందర్, డీఎం, జయశంకర్ భూపాలపల్లి ఈసారి కొంత ఎక్కువ దిగుబడి పోయినసారి కన్నా ఈసారి కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిల ఎకరానికి 23 క్వింటాళ్లు వస్తే, పోయిన వానాకాలంల కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. ఈసారి అధికారులు 28 అంటున్రుగాని సుమారు 26 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. – ఎండపెల్లి శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, కమలాపూర్, వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికైతే మంచిగానే ఉంది ఎన్నో ఏళ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని బతుకుతున్న. మూడు, నాలుగేళ్లుగా ఎవుసం చేస్తె అప్పులే తప్ప గవ్వ మిగులలేదు. వానాకాలం పంట చేతికి వచ్చే సమయానికి వాన నిండా ముంచింది. యాసంగి పంట దిగుబడి ఇప్పటికైతే మంచిగానే ఉంది. కోసే దాక వానలు కొట్టకపోతే ఎకరానికి 25 క్వింటాళ్ల దాక వడ్లు చేతికి వస్తయ్. – డొంగరి రాజయ్య, రైతు, కాటారం, జేఎస్ భూపాలపల్లి జిల్లా 2020–21 యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో) యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఈ ఏడాది యాసంగి సాగు 68,14,555 మొత్తంగా సాగు శాతం 187.02 గతేడాది యాసంగి సాగు 52,22,377 అత్యధికంగా పంటలు సాగైన జిల్లా వరంగల్ రూరల్ (299.10 శాతం) అత్యల్పంగా పంటలు సాగైన జిల్లా ఆసిఫాబాద్ కొమురం భీం (128.95 శాతం) రాష్ట్రంలో వరిసాగు అంచనా(ఎకరాల్లో) 22,19,326 ఈ యాసంగి సాగు 52,78,636 మొత్తంగా వరిసాగు శాతం 237.85 దిగుబడి అంచనా 1,47,80,181(దొడ్డు రకం 1.19 కోట్ల టన్నులు + టన్నులు సన్నాలు 28.80 లక్షల టన్నులు) గతేడాది సాగు 38,62,510 యాసంగి కొనుగోళ్లు ఇలా మొత్తం కొనుగోలు కేంద్రాలు 6,408 ఐకేపీ కేంద్రాలు 2,131 పీఏసీఎస్ (ఫ్యాక్స్) కేంద్రాలు 3,964 ఏఎంసీ, ఇతర కేంద్రాలు 313 కనీస మద్దతుధర (ఎంఎస్పీ) ‘ఏ’గ్రేడ్ (క్వింటాకు) రూ.1,888 కామన్ రకం (క్వింటాకు) రూ.1,868 చదవండి:త్వరలో రంగారెడ్డి జిల్లాలోని అసైన్డ్ భూముల వేలం -
'ఆ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలు'
లక్నో: కొత్తసాగు చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలుగా మారుతున్నాయంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ సభకు హాజరైన కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాయం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. రైతుల భూమిని పెత్తందార్లకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని తెలిపారు. కేంద్రం తెచ్చిన కొత్త సాగుచట్టాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనూ కూలీలుగా మారుతారంటూ పేర్కొన్నారు. ''కొత్త సాగుచట్టాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. గతంలో కనీస మద్దతు ధర ఉంది.. ఇప్పుడు అది కొనసాగుతుంది.. భవిష్యత్తులో కూడా కనీస మద్దతు ధర ఉంటుందని'' మోదీ పార్లమెంట్ సాక్షిగా తెలిపారన్నారు. నూతన సాగు చట్టాల రద్దుకోసం మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల పోరాటాన్ని నీరు గార్చడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు. ఇదే అంశంలో యూపీలో అధికారంలో ఉన్న యోగి ప్రభుత్వానికి మాత్రం రైతుల అంశాలు పట్టవా అని ప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టదు గాని కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు మద్దతిస్తున్నట్లు యోగి ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లుగా మీ రాష్ట్రంలోని చెరకు రైతులకు చెల్లింపు విషయంలో భరోసా ఇవ్వకపోవడంతోనే ఆయన పాలన ఏంటో అర్థమవుతుందన్నారు. రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వానికి ఇది పెద్ద అవమానం అని ఎద్దేవా చేశారు. -
మేం రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి: అన్నదాతలు
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో దాదాపు 70 రోజులుగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుందని.. రైతులు ఉద్యమం విరమించి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. చర్చలకు తాము సిద్ధమని.. డేట్, టైం ఫిక్స్ చేయాల్సిందిగా తెలిపారు. రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సామ్యుక్తా కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు, రైతు నాయకుడు శివ కుమార్ కక్కా మాట్లాడుతూ.. ‘‘ప్రధాని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. చర్చలకు మేం వ్యతిరేకం కాదు.. అలానే ఎన్నడు వెనకడుగు వేయలేదు. కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. సరైన పద్దతిలో వారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే.. వెళ్లడానికి తయారుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఓ డేట్, టైం ఫిక్స్ చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే.. వారితో చర్చిస్తాం’’ అన్నారు. ఇక మోదీ చేసిన ‘ఆందోళన్ జీవి’ వ్యాఖ్యలపై కక్కా మండిపడ్డారు. సాధారణ రైతుల చేస్తోన్న ఉద్యమం గురించి ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. రైతులు కేంద్రం మధ్య ఇప్పటికి 11 సార్లు చర్చలు జరిగాయి. రైతుల కనీస మద్దతు ధరకు సంబంధించి ఖచ్చితమైన హామీని కోరుతున్నారు. ఇక ప్రభుత్వం ఈ నూతన చట్టాలను 12-18 నెలల పాటు అమలు నిలిపివేసేందుకు ముందుకు వచ్చినప్పటికి అన్నదాతలు ఒప్పుకోలేదు. ఇక తాజాగా సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: కనీస మద్దతు ధరపై మోదీ కీలక ప్రకటన సచిన్ ట్వీట్: మహారాష్ట్ర సంచలన నిర్ణయం -
కనీస మద్దతు ధరపై మోదీ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. కనీస మద్దతు ధరను పూర్తిగా ఎత్తివేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కేంద్రం రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి ఫలితం లేకుండా పోయింది. మరోవైపు రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుందని.. ఇప్పటికైనా కేంద్ర నాయకులు చర్చలకు వచ్చి.. వ్యవసాయ చట్టాలపై నేలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అనేది గతంలో ఉంది.. ఇప్పుడు ఉంది.. ఇక మీదట కూడా కొనసాగుతుంది. పేదలకు తక్కువ ధరకు అందించే రేషన్ ఇక మీదట కూడా కొనసాగుతుంది. మండీలను ఆధునీకరిస్తాము. మన వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. ఆందోళన ఏం లేదు. ఈ వేదిక ద్వారా వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాను’’ అన్నారు. ఇక వ్యవసాయ చట్టాలపై కేంద్రం సడెన్‌గా ఇలాంటి ప్రకటన చేయడంతో విపక్షాలు యూటర్న్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించాయి. అందుకు మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన కోటేన్‌ని ఒకదాన్ని వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెటింగ్ వ్యవస్థ 1930లో ఏర్పాటయ్యింది. దీనిలో చాలా అంశాలు రైతులకు ప్రయోజనం లేనివి ఉన్నాయి. ఫలితంగా రైతులు తమ పంటకు ఎక్కువ రేటును పొందలేకపోతున్నారు. వీటన్నింటిని తొలగించాలనే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉమ్మడి మార్కెట్‌ను తీసుకురావాలని భావించింది’’ అన్నారు. ఇక రైతుల ఉద్యమంలో విద్రోహక శక్తులు కూడా ఉన్నాయని మోదీ మరోసారి ఆరోపించారు. ‘‘దేశంలోకి ప్రస్తుతం ఆందోళన్ జీవి అనే కొత్త రకం వైరస్ ప్రవేశించింది. అది దేశంలో ఎక్కడైనా విద్యార్థులు, లాయర్లు, కార్మికులు ఆందోళన చేపడుతున్నారని తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి దాన్ని మరి కాస్త పెద్దది చేసే ప్రయత్నం చేస్తుంది. ఆందోళన అనేది వారి జీవితాల్లో ఓ భాగం అయ్యింది. అలాంటి వారిని గుర్తించి.. వారి బారి నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అన్నారు. ఇక ఎఫ్‌డీఐల మీద కూడా మోదీ స్పందించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని.. దీనిలో కూడా విద్రోహ శక్తులు చేరకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిక్కులపై మోదీ ప్రశంసలు కురిపించారు. వారు దేశానికి ఎంతో సేవ చేశారని.. దేశం వారి త్యాగాలను ఎన్నటికి మరవదన్నారు. కానీ కొన్ని అసాంఘిక శక్తులు వారిని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాయని మోదీ ఆరోపించారు. చదవండి: ఆశ్చర్యం: కాంగ్రెస్ ఎంపీపై మోదీ ప్రశంసలు ఇదీ మా ఎజెండా -
ఇదీ మా ఎజెండా
న్యూఢిల్లీ: చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు విధి విధానాలను రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతో పాటు గతంలో జరిగిన చర్చల సందర్భంగా తాము లేవనెత్తిన మరో రెండు డిమాండ్లపై మాత్రమే చర్చ జరగాలని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను ఆరో విడత చర్చలకు బుధవారం రావాలని ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. సాగు చట్టాల రద్దు కార్యాచరణ, ఎమ్మెస్పీకి చట్టబద్ధతతో పాటు దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్‌లో సవరణల అంశాన్ని కూడా చర్చించాలని 40 రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వానికి పంపిన లేఖలో స్పష్టం చేసింది. అమిత్ షాతో మంతనాలు నేడు రైతు నేతలతో చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, గోయల్ హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తరఫున రైతులతో వ్యవసాయ మంత్రి తోమర్, రైల్వే మంత్రి గోయల్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కొనసాగుతున్న టవర్ల ధ్వంసం రైతులు, రైతు మద్దతుదారులు పంజాబ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో టెలికం టవర్లను ధ్వంసం చేయడాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియో టెలికం సంస్థకు చెందిన టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపేయడం, టవర్లకు చెందిన కేబుల్స్‌ను కత్తిరించడం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మరో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అని రైతులు భావిస్తున్నారు. పంజాబ్‌లో మంగళవారం దాదాపు 63 టవర్లు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. గ్రీన్ రెవెల్యూషన్ @ జిలేబీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో రైతులు ఆకుపచ్చ జిలేబీలను వడ్డించారు. హరిత విప్లవానికి సంకేతంగా ఆకుపచ్చ జిలేబీలను తయారుచేసినట్లు నిరసనలో పాల్గొన్న బల్దేవ్ సింగ్ (65) అనే రైతు చెప్పారు. కాగా, పంజాబ్‌లో రోజుకు దాదాపు అయిదు క్వింటాళ్ల ఆకుపచ్చ జిలేబీ పంచుతున్నామని జస్విర్ చంద్ అనే రైతు తెలిపారు. ఇదిలా ఉండగా హరియాణాలోని కర్నాల్‌లో నిరసన జరుగుతున్న ఓ ప్రాంతంలో నిరసనకారుడు పెళ్లి కుమారుడిలా తయారై ట్రాక్టర్‌పై ఊరేగుతూ విభిన్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్‌నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్‌కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్‌లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్‌లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్‌కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్‌ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్‌లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్‌పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్‌లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్‌ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్‌ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
పద్ధతులు పాటిస్తే.. ‘మద్దతు’!
సాక్షి, అమరావతి: 'వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూడాలి. ఉత్పత్తులకు మార్కెట్లో పోటీ ఏర్పడాలి. తద్వారా మెరుగైన ధర రావడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి. పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర రావాలి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ నడుం బిగించింది. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇచ్చి కొనుగోలు చేసేలా సంకల్పించింది. ప్రస్తుతం వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన ప్రమాణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల్లో అవగాహన కల్పించేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ఖరీఫ్‌లో చెప్పిన దానికంటే మిన్నగా రూ.3,300 కోట్లతో జొన్న, మొక్కజొన్న, అరటి, ఉల్లి, పసుపు తదితర పంటలను, రూ.11,500 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఇలా.. మద్దతు ధర రావాలంటే రైతులు తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా ఇ-పంటలో తమ పంటను నమోదు చేసుకుని ఉండాలి. ఆ తర్వాత తమ పంట ఉత్పత్తులకు తప్పనిసరిగా నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలి. ఈ మేరకు ప్రతి ఆర్బీకే వద్ద నాణ్యతా ప్రమాణాలున్న పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. నిర్దేశిత ప్రమాణాలున్న వరి ధాన్యాన్ని పొలాల వద్దే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ►ధాన్యాన్ని గ్రేడ్-ఏ, కామన్ గ్రేడ్‌గా విభజించి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యంలో 17 శాతం తేమ, కేళీలు 6 శాతం, వడలిపోయిన, కుచించుకుపోయిన, అపరిపక్వ గింజలు 3 శాతం, రంగు వెలిసిన, మొలకెత్తిన, పురుగుపట్టినవి 5 శాతం వరకు, దుమ్మూ, ధూళి ఒక శాతం వరకు మించకుండా ఉండాలి. ధాన్యం శుభ్రంగా, పొడిగా, ఒకే రంగు, పరిమాణం ఉండి, బూజు, పురుగు పట్టకుండా.. ఎటువంటి చెడు వాసన లేకుండా ఉంటే వాటిని ఎంఎస్పీకి కొనుగోలు చేస్తారు. ►వేరుశనగలో తేమ 8 శాతం వరకు ఉండొచ్చు. కెర్నల్స్ (గింజలు), పాడ్స్ (కాయలు) 65 నుంచి 70 శాతానికి మించి ఉండాలి. 4 శాతం వరకు ఇతర రకాల కాయలు, 4 శాతం వడలిపోయిన, పక్వానికి రాని గింజలు, 2 శాతం వరకు పాడైపోయిన గింజలు, దుమ్మూ ధూళి ఉన్నవాటిని 2 శాతం వరకు అనుమతి ఇస్తారు. ►మొక్కజొన్నలో గింజలు పొడిగా, దృఢంగా, శుభ్రంగా, పక్వానికి వచ్చి ఉండటంతోపాటు ఆకారం, రంగు ఒకేలా ఉండాలి. పురుగు, బూజు పట్టకూడదు. చెడు వాసన రాకూడదు. 14 శాతం వరకు తేమ ఉండవచ్చు. 4.5 శాతం వరకు రంగు వెలిసిన గింజల్ని అనుమతిస్తారు. 3 శాతం వరకు పక్వానికి రాని గింజలున్నా కొంటారు. ►పత్తిని బాగా ఆరబెట్టి శుభ్రం చేసుకుని తీసుకురావాలి. తేమ 8 శాతానికి మించకూడదు. అంతకుమించితే ధర తగ్గుతుంది. అది కూడా 12 శాతం వరకే అనుమతి ఇస్తారు. అంతకుమించి ఉంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 మిల్లీమీటర్ల నుంచి 30.50 మిల్లీమీటర్ల వరకు ఉండాలి. మైక్రోనెయిర్ విలువ 3.5 నుంచి 4.5 వరకు ఉండాలి. తడిసిన పత్తిని కొనరు. దుమ్మూ, ధూళి, చెత్తా చెదారం, గుడ్డిపత్తి, రంగుమారిన, పురుగుపట్టిన పత్తి కాయలు ఉండకూడదు. సర్కారు చర్యలివే.. అన్నదాతలకు దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా ఈ ఖరీఫ్ నుంచి రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రభుత్వం పంటలను కొనుగోలు చేస్తోంది. అందుకే ప్రతి ఆర్బీకేని కొనుగోలు కేంద్రంగా ప్రకటించింది. గిట్టుబాటు ధరల కోసం తొలిసారిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని కళ్లాల వద్దే కొనుగోలు చేసి ఆ తర్వాత పది రోజుల్లోనే చెల్లింపులు చేస్తోంది. -
రిటైల్‌కు రెక్కలొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్ : దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వస్తు, సేవల రిటైల్ ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడిని ధరాఘాతం తాకుతోంది. జీవనవ్యయం పెరిగి జేబుపై ఆర్థికభారం పడుతోంది. అక్టోబర్ నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 7.61 శాతానికి చేరుకోగా, తెలంగాణ రాష్ట్రంలో అది ఏకంగా 10.37 శాతానికి ఎగబాకింది. దీంతో ద్రవ్యోల్బణం రేటులో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో ఉంది. గత ఏడాది ఒకనెలతో పోల్చితే (ఉదాహరణకు అక్టోబర్ 2019– అక్టోబర్ 2020 మధ్య తేడా), ఈ ఏడాది అదేనెలలో వినియోగదారుల ధరల సూచీలో పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగినపుడు... ప్రజల జీవన వ్యయం పెరిగిపోతుంది. రూపాయి కొనుగోలు శక్తి తగ్గుతుంది. కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌పీఐ) అక్టోబర్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం గణాంకాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2020 అక్టోబర్‌లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 10.37 శాతానికి చేరింది. పశ్చిమబెంగాల్ 10.89 శాతం ద్రవ్యోల్బణంతో దేశంలో అగ్రస్థానంలో నిలవగా, 10.14 శాతంతో ఒడిశా, 10.03 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రెండో స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రిటైల్ ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయని స్పష్టమవుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం గత కొంతకాలంగా దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తూ వస్తోంది. గత మార్చి నెలలో దేశంలో ద్రవ్యోల్బణం 5.91 శాతం నమోదు కాగా, 8.12 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పల్లెల్లో బతుకుభారం గత అక్టోబర్‌లో గ్రామీణ తెలంగాణలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. 11.98 శాతం ద్రవ్యోల్బణం రేటుతో గ్రామీణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ పట్టణ ప్రాంతాలు 9.05 శాతం ద్రవ్యోల్బణంతో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచాయి. మరో విధంగా చెప్పాలంటే తెలంగాణ పల్లెల్లో రిటైల్ ధరలు దాదాపు 12 శాతం, పట్టణాల్లో 9.05 శాతం పెరిగాయి. ద్రవ్బోల్బణం పెరిగితే రూపాయి విలువ క్షీణించి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తుంది. కూరగాయలు, ఉల్లి ధరలే ప్రధానకారణం ప్రధానంగా కూరగాయలు, ఉల్లి, ఇతర ఆహారపదార్థాల ధరలు అసాధారణంగా పెరగడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ప్రకారం గతేడాదితో పోల్చితే ప్రస్తుతం జాతీయ స్థాయిలో కూరగాయల ధరలు 22.51 శాతం, పప్పు ధాన్యాల ధరలు 18.34 శాతం, మాంసం, చేపల ధరలు 18.70 శాతం, గుడ్ల ధరలు 21.81 శాతం, నూనెల ధరలు 15.17 శాతం వరకు పెరిగిపోయాయి. కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్డౌన్ విధించిన నాటి నుంచి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చాలా కూరగాయలు కిలో సగటున రూ.60 నుంచి 100 వరకు ఎగబాకాయి. ఇక ఉల్లి ధరలకు రెక్కలు వచ్చి ఒకదశలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. భారీ వర్షాలతో ఉల్లి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుదలకు దారితీసిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో వరిసాగు పెరడమే కారణం తెలంగాణ రాష్ట్రం కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో రాష్ట్రంలో వీటి ధరలు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా అధికంగా ఉంటున్నాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2011–12లో రాష్ట్రంలో రూ.9,317.47 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయల ఉత్పత్తి జరగగా, 2017–18 వచ్చేసరికి ఈ ఉత్పత్తుల విలువ రూ.5,737.41 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా పండ్లు, కూరగాయల ఉత్పత్తి దాదాపు సగానికి తగ్గిపోయిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఏటేటా గణనీయంగా పెరిగిపోతోంది. వివిధ సాగునీటి ప్రాజెక్టుల కింద దశాబ్దాలుగా బీడువారిన లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని సరఫరా చేసి స్థిరీకరించారు. గతంలో కూరగాయలు, పప్పుదినుసులు, ఇతర పంటలు పండించిన రైతులు సాగునీరు వచ్చేసరికి వరి సాగువైపు మళ్లారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో కూరగాయల సాగు మరింతగా తగ్గిపోవడంతో... సరఫరా తగ్గి వీటి ధరలు గణనీయంగా పెరిగిపోయాయని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన నియంత్రిత పంటల సాగు విజయవంతమై... స్థానిక అవసరాలకు తగ్గట్టు ఇక్కడే కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు పెరిగితే ధరలు దిగి వచ్చే అవకాశముంది. డిమాండ్‌కు తగ్గట్టు సప్లై లేదు ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి, లాక్డౌన్, నిరుద్యోగం కారణంగా ప్రజల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు లేక డిమాండ్ పతనమై ధరలు తగ్గాల్సింది పోయి... పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టు ఆహారపదార్థాల సరఫరా లేకపోవడం ధరలు పెరగడానికి దోహదపడింది. దేశానికే ధాన్య భండాగారంగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, కూరగాయలు, పండ్లు, ఉల్లి, పప్పులు, మసాల దినుసులు, ఇతర ఆహారపదార్థాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతోంది. ఇతర రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన ధరలు కొద్దిగా పెరిగినా తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. ప్రధానంగా పేద, బలహీనవర్గాల ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణకు అవసరమైన పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి వాటి ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కూరగాయలు, ఉల్లిని పేదలకు సబ్సిడీపై సరఫరా చేయాలి. లేకుంటే పేద ప్రజలకు రెండు పూటల కడుపు నిండా తిండి కూడా లభించదు. – పీఎస్ఎం రావు, ఆర్థికవేత్త -
మద్దతు ధర లేక నిలిచిన పత్తి కొనుగోళ్లు
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ మద్దతు ధర రూ. 5550 కు గాను, వ్యాపారులు రూ. 4950 మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు మండిపడ్డారు. మద్దతు ధర చెల్లించాల్సిందేనని రైతులు పట్టుబట్టడంతో కలెక్టర్ దివ్యదేవ్ రాజన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావు కలుగజేసుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విసిగిపోయిన రైతులు పంజాబ్ చౌక్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. -
వ్యవసాయంతోనే ఆర్థిక సంరక్షణ
ప్రపంచ పర్యావరణాన్ని కోలుకోలేనంతగా ధ్వంసం చేసిన ప్రస్తుత ఆర్థిక విధానాల స్థానంలో వ్యవసాయరంగమే ఆర్థిక వృద్ధికి నిజమైన సంరక్షకదారు అనే భావన ప్రాచుర్యం పొందుతోంది. వ్యవసాయం పట్ల మన ఆలోచనలనే మౌలికంగా మార్చేయాల్సిన విప్లవం ఇప్పుడు ప్రపంచానికి అవసరం. స్థూలదేశీయోత్పత్తి అత్యున్నత స్థాయికి చేరినప్పుడు కూడా ఉపాధి కల్పన సాధ్యం కానప్పుడు మరింత దూకుడుగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాలంటున్న ఆలోచనలు ఇంకా ప్రమాదకరం. ఇప్పుడు కావలసింది కోట్లమందికి దేశీయంగా ఉపాధి కల్పించగలిగిన వ్యవసాయ రంగంలో నిజమైన సంస్కరణలే. ప్రతి రైతు కుటుంబం కూడా ఆర్థిక పుష్టి సాధించినప్పుడు గ్రామాలనుంచి పట్టణాలకు వలసపోవడానికి బదులుగా గ్రామాలే ఉపాధి కేంద్రాలుగా తయారవుతాయి. నయా ఉదారవాదం చేవచచ్చిపోయి చరిత్రలో కలిసిపోయిందనీ, దాని ఫలితంగా ప్రపంచంలో నిరుద్యోగం, అసమానతలు పరాకాష్టకు చేరిపోయి, వాతావరణ మార్పు దాని చరమ దశకు చేరుకుందనీ.. నోబెల్ అవార్డు గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ వ్యాఖ్యానించినప్పుడు, కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి ఉద్దీపింపజేయగల శక్తి వ్యవసాయానికి మాత్రమే ఉందని స్పష్టమైంది. పాశ్చాత్య దేశాల్లో సంపద సంచయనం అనేది తప్పనిసరిగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలపై ఆధారపడి నిర్మితమైందని ప్రముఖ రచయిత అమితాబ్ ఘోష్ చెప్పినప్పుడు, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ ఆ అభిప్రాయాన్ని ఖండించే సాహసం చేశారు ‘ప్రపంచం కొనసాగిస్తున్న ప్రస్తుత ఆర్థిక నమూనా.. పర్యావరణానికి ఆత్మహత్యా సదృశం లాంటిది. వాతావరణంలో మార్పు ఎంత తీవ్రంగా ఉందంటే ఆర్థిక వృద్ధికి సంబంధించిన పాత నమూనా ఇప్పుడు ఒక అడ్డంకిగా మాత్రమే లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్వావలంబన వైపు ఉత్తమంగా నడిపేందుకు మనం ఇప్పుడు ఏకంగా విప్లవాన్నే సాగించాల్సి ఉంది.’’ కానీ, 2011 ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ఆయన ఇచ్చిన పై పిలుపును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక నమూనా ఉపయోగం నిరర్థకంగా తేలిపోయిన ఈ తరుణంలో సహజ వనరుల విధ్వంసం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇది కనీవినీ ఎరుగని సామాజిక, ఆర్థిక విచ్ఛిన్నతల వైపునకు దారి తీస్తోంది. ఆర్థిక వృద్ధికి సంబంధించి పర్యావరణ దుష్ఫలితాలు విధ్వంసకరంగా మారుతున్నాయి. వ్యవసాయం విస్తృతంగా సాగుతున్న ప్రాంతాల్లో కూడా నేల సారం జీరో స్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలను మితిమీరి తోడేయడం ఫలితంగా జలాశయాలు ఎండిపోతున్నాయి. పైగా పురుగుమందులతో సహా వ్యవసాయంలో రసాయనాల వాడకం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నందున ప్రపంచ వ్యాప్తంగా ఆహార రంగం పూర్తిగా కలుషితమైపోయింది. నేల సారం రానురానూ చిక్కి శల్యమవుతున్నందున, పారిశ్రామిక వ్యవసాయ విస్తరణ వెనుకంజ వేసింది. నేల కోత, నీటి క్షీణత కారణంగా అడవులు ఖాళీ అవుతున్నాయి. ఈ అన్ని దుష్పరిణామాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడని బ్రెజిల్ నూతన అధ్యక్షుడు జైర్ బొల్సోనరో ఏకంగా అమెజాన్ వర్షాటవులపైనే దాడిని ప్రారంభించాడు. అధికారాన్ని స్వీకరించి కొద్ది గంటలు కూడా కాకముందే ప్రపంచ శ్వాసగా గుర్తింపుపొందిన జీవారణ్యాలను చావుదెబ్బతీస్తూ ఆదేశాలు జారీ చేశాడు. భారత్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ భూగర్భజలాలను ప్రస్తుత స్థాయిలో తోడేస్తున్న ప్రక్రియలను ఇకనైనా నిరోధించకపోతే భూమి ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పంజాబ్, హర్యానాల్లో భూగర్భజలాలను ప్రస్తుత స్థాయిలో తోడేయడం ఆపకపోతే మరో 35 సంవత్సరాల్లోనే ఈ రెండు రాష్ట్రాలు కచ్చితంగా ఎడారిగా మారిపోక తప్పదని కేంద్ర భూగర్భ జల మండలి తాజా నివేదిక స్పష్టం చేసింది. పర్యావరణ ఉత్పాతం ఇంత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడుతున్నప్పటికీ, ఆర్థిక సంస్కరణలు మరింత స్థాయిలో పెరుగుతున్న సూచనలే కనబడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లు మద్దతు పలుకుతున్న చింతనా పరులు, క్రెడింట్ రేటింగ్ సంస్థలు, ఆర్థశాస్త్ర రచయితలు మరో మాటకు తావీయకుండా మరిన్ని ఆర్థిక సంస్కరణలు మొదలెట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల భావజాలం ప్రాతిపదికన పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పడిన యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాలు పదేళ్లపాటు సాగించిన అత్యున్నత జీడీపీ రేటు కూడా ఉద్యోగాలను తగినంతగా కల్పించకపోయినప్పుడు, మరింత దూకుడుగా ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలనే ప్రతిపాదనలు మరిన్ని ఉద్యోగాలను ఎలా సృష్టించగలవనేది పెద్ద ప్రశ్న. ఉద్యోగాలు లేని దశనుంచి ఉద్యోగాలు కోల్పోతున్న దశకు ప్రపంచ ఆర్థిక గమనం వేగంగా పయనిస్తున్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం లభించడం చాలా కష్టం. పట్టణ కేంద్రాలలోనే కాకుండా గ్రామీణ వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల్లోనూ శ్రామికులు భారీస్థాయిలో ఉద్యోగాలు కోల్పోతున్నారని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా, పెట్టుబడులను ఆకర్షించడానికి మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి కార్పొరేట్ పన్నును తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ వాస్తవానికి ఇది సమర్థనీయమని చెప్పడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారం కూడా లేదు. తమపై అధికపన్నును తగ్గించాలని కార్పొరేట్ రంగం కోరుకుంటోంది కాబట్టి వారి ఆకాంక్షలకు అనుగుణంగా క్రెడిట్ రేటింగ్ సంస్థలు, ఆర్థిక చింతనాపరులు ఈ వాదనను మితిమీరి సమర్థిస్తున్నారు. కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తే అది బారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందనే ప్రచారం ఎంత తప్పు భావనో పేర్కొంటూ నోబెల్ అవార్డు గ్రహీత పాల్ క్రూగ్మన్ ఈ తప్పుడు ఆలోచన మూలాన్నే ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. కార్పొరేట్ పన్నులకు, పెట్టుబడుల పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని యుఎస్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ ఆధారంగా పాల్ పట్టిక సహితంగా సూచిస్తూ సవాలు చేశారు. పైగా, కార్పొరేట్ పన్నుల తగ్గింపు మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఏవిధంగానూ దారి తీయడం లేదు. నిజానికి కార్పొరేట్లపై పన్నులు తగ్గించిన ప్రతిసారి సంపన్నులు స్టాక్ మార్కెట్లలో మరింత అధికంగా మదుపు చేయడానికే ప్రాధాన్యమిచ్చారని పాల్ పేర్కొన్నారు. పారిశ్రామిక సంస్థలు పదే పదే కోరుతున్న మరొక సాహసోపేత సంస్కరణ ఏదంటే, లేబర్ మార్కెట్లను సంస్కరించడమే. దీని అర్థం ఏమిటంటే, కార్మికులను తమ ఇష్టమొచ్చినట్లుగా నియమించుకోవడం, వారిపై ఓటువేయడం తమకు హక్కుగా కల్పించాలని కార్పొరేట్ సంస్థల డిమాండ్. అయితే లేబర్ మార్కెట్లపై పాశవితను ప్రదర్శించడం ద్వారా సంపన్నులు పొందగలిగేది ఏమీ ఉండబోదని పాల్ మరొక ట్వీట్లో తేల్చి చెప్పారు. సులభంగా చెప్పాలంటే, అమెరికాలో అనుసరించిన పాశవికమైన కార్మికరంగ సంస్కరణలు ఏ దశలోనూ పనిచేయలేదు. ఇలాంటి ఆలోచనా విధానం మారాలి. మన వ్యవసాయరంగంలో వ్యవస్థాగతమైన సంస్కరణల అవసరం ఉందని గుర్తిస్తున్న తరుణంలో పాత ఆలోచనల్లో మార్పు రావడం సులభం కాదు. కాని మార్పువస్తుందని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వ్యవసాయం మాత్రమే ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవితం చేయగలదు. వ్యవసాయం మాత్రమే కోట్లాదిమందికి జీవనం కలిపించగలదు, అదేసమయంలో భూతాపాన్ని గణనీయంగా తగ్గించగలదు కూడా. అయితే దీన్ని సాధించాలంటే మొట్టమొదటగా గుర్తించవలసిందీ, ఆమోదించవలసిందీ ఏమిటంటే రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థకు తిరిగి ప్రాణం పోయడంలో వ్యవసాయం నిర్వహించే పాత్రను అందరూ అర్థం చేసుకోవాలి. నగరాలకు అవసరమైన చౌక శ్రమను పూరించడానికి వ్యవసాయం నుండి పెద్ద ఎత్తున రైతులను నగరాలకు తరలించాల్సి ఉందన్న ఆలోచననే మొదటగా మార్చుకోవలసి ఉంది. వ్యవసాయాన్ని ఆర్థికంగా చెల్లుబాటయ్యేలా చేయాలంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పరివర్తింప జేస్తూ, నగరాలకు వలసలను గణనీయంగా అరికట్టాల్సి ఉంటుంది. వ్యవసాయం లాభదాయకంగా మారినప్పడు నగరాల్లో ఉద్యోగాల కల్పన చేయవలసిన అవసరం దానికదేగా తగ్గుతుంది. అందుకే వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థ సంరక్షక పాత్రను పోషిస్తుంది. న్యూఢిల్లీలో ఇటీవల నీతి అయోగ్ పాలనామండలి అయిదో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, వ్యవసాయంలో సంస్థాగత సంస్కరణలనూ సూచిస్తూ ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ని ఏర్పరుస్తున్నట్లు ప్రకటించారు. ఇది నిజంగానే సానుకూల పరిణామం. 2014 నాటికి వ్యవసాయరంగ పరివర్తనకు అవసరమైన పునాదికి ఇది వీలుకల్పిస్తుంది. పర్యావరణ రంగ స్వావలంబన, దేశ ప్రాదేశిక అవసరాలను గుర్తించడం దీని లక్ష్యం. ప్రధాని ఈ అంశాన్నే నొక్కి చెబుతూ సాంప్రదాయిక జల వనరుల పరిరక్షణ సాంకేతికతలను పెంపొందించాలని, వ్యవసాయ రంగ వ్యూహంలో నీటి పరిరక్షణను అతి ముఖ్యమైన అంశంగా మార్చాలని ప్రతిపాదించారు. దశాబ్దాల పర్యంతం ఆకలి, పోషకాహార లోపానికి దారితీసిన గత ఆహార విధానాలను తోసిపుచ్చుతూ వ్యవసాయంలో దేశీ సంస్కరణను విస్తృంతంగా అమలుచేయడమే ఇప్పుడు భారత్ ప్రధాన అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే విఫలమైన వ్యవసాయ విధానాలను మళ్లీ అరువు తెచ్చుకోవడానికి బదులుగా భారత్ ఇప్పుడు వ్యవసాయ ఆర్థికవ్యవస్థను స్వావలంబన వైపు మళ్లించే తరహా సాగు విప్లవాన్ని సాధించాల్సిన అవసరముంది. ప్రతి వ్యవసాయదారుడికి రూ. 6,000ల నగదు మద్దతును అందించడం ద్వారా మోద్లీ మన ఆలోచనల్లోనే పెద్ద మార్పును తీసుకొచ్చారు. ఈ పథకం ఇప్పుడు దేశంలోని ప్రతి రైతుకూ నెలకు రూ.500లు అందిస్తోంది. భవిష్యత్తులో ప్రతిరైతూ నెలకు రూ. 5,000లు లబ్ధి పొందేలా మన వ్యవసాయ విధానాలు మెరుగుపడేరోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వ ఖజానాకు వ్యవసాయం శిరోభారం అనే ఆలోచనాతీరునే మన పాలసీ నిర్ణేతలు మార్చుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుందని విశ్వసించడం మాత్రమే వ్యవసాయరంగలో నిజమైన మార్పులకు వీలు కల్పిస్తుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు ఇమెయిల్ :hunger55@gmail.com -
మా డబ్బులు.. మాకివ్వండి!
సాక్షి, నల్లగొండ: రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో తమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత అరిగోస పడుతున్నాడు. అమ్ముకున్న ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా పేమెంట్లు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ చివరకు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ సంస్థ నుంచే సొమ్ములు అందాల్సి ఉంది. ప్రధాన కార్యాలయం నుంచే డబ్బుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లా అధికారులు సైతం ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లపైకి వచ్చి రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 235 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.813.43కోట్ల విలువైన 4,59,565 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పెడుతుండు. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, నెలలు గడుస్తున్నా.. డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంకా చెల్లించాల్సిన బకాయి రూ.344 కోట్లు ఐకేపీ, పీఏసీఎస్‌లు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ఇంకా రూ.344.04 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 73,582 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు కేవలం 39,958 మంది రైతులకు మాత్రమే రూ.469.39 కోట్లు చెల్లించారు. ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో వీరంతా ఇపుడు ఇంకెప్పుడు చెల్లింపులు జరుపుతారన్న ఆందోళనలో ఉన్నారు. కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నామని, ప్రైవేటు వ్యాపారులకు, నేరుగా మిల్లర్లకు అమ్ముకున్న రైతుల చేతిలో ఎప్పుడో డబ్బులు పడ్డాయని, తాము మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, తమ అకౌంట్లో జమ అయిన వరకు రైతులకు బదిలీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి నిధులు విడుదల కానిదే తామేమీ చేయలేమని వారు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రధాన కార్యాలయం నుంచి అందిన సొమ్ము కేవలం రూ.469.41 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో ఈసారి ఎక్కువగానే కొనుగోలు చేశారు. జిల్లాలోని మిల్లులకు 4,43,697 టన్నుల ధాన్యం తరలించి మిగిలిన 15,867 టన్నుల ధాన్యాన్ని సిద్ధిపేటలోని మిల్లుకు కూడా తరలించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కార్పొరేషన్ ..డబ్బులు చెల్లించడంలో మాత్రం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవీ ... గణాంకాలు మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు చెల్లించిన మొత్తం ఇంకా చెల్లించాల్సిన డబ్బు ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు అందిన రైతులు ఎదురు చూస్తున్నవారు 235 4,59,565 టన్నులు రూ.469.39 కోట్లు రూ.344.04 కోట్లు 73,582 39,958 33,62 ధాన్యం డబ్బులు రాలేదు చిట్యాల : మా కుటుంబసభ్యులకు ఉన్న పొలంలో పండించిన 262 క్వింటాళ్ల ధాన్యాన్ని గుండ్రాంపల్లి గ్రామంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏప్రిల్ 29వ తేదీన అమ్మాను. నాకు సుమారుగా ఐదు లక్షలకు పైగా డబ్బులు రావాలి. నేటికీ రాలేదు. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు నెలల తరబడి రాకపోవడంతో పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ధాన్యం డబ్బులు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. – ఆకుల శంకరయ్య, రైతు. గుండ్రాంపల్లి. చిట్యాల మండలం. -
‘విజవర్ధిని’ కి పునర్జీవం
సాక్షి, అలంపూర్:బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్‌కు పునర్జీవం రానుంది. ఏళ్ల తరబడిగా మూతబడిన పరిశ్రమ త్వరలోనే కళకళ లాడనుంది. ఫ్యాక్ట రీ తిరిగి ప్రారంభించడానికి ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేజర్ సుధాకర్‌రెడ్డితో బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్ పునరుద్ధరణపై సమావేశం జరిగింది. దీంతో మిల్లు పునఃప్రారంభంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్డీడీ బీ నుంచి తీసుకున్న అప్పును చెల్లించి తిరిగి ఆయిల్ మిల్ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు. విజయవర్ధిని ఆయిల్‌మిల్ తిరిగి తెరచుకోనుండటంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఉద్యోగావకాశాలు కలగనుండటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నెలల్లో విజయవర్ధినికి పునర్జీవం కలగే అవకాశం ఉంది. మిల్లులను తెరుచుకుంటే బీచుపల్లి ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు జోరందుకునే అవకాశం ఉంటుంది. బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్ మిల్లు 2003లో మూతపడింది. మిల్లులో ఉత్పత్తయిన నూనె, ఇతర పదార్థాల అమ్మకాల్లో అధికారుల చేతివాటం అక్రమాలు తోడై అప్పుల ఊబిలోకి వెళ్లింది. అప్పులను తీర్చి మళ్లీ ప్రారంభించేందుకు ఎన్డీడీబీ (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ అక్రమాలు ఆగక వచ్చిన ఆర్థికసాయం కూడా నష్టాల్లోకి వెళ్లడంతో 2003లో పూర్తిగా ఫ్యాక్టరీ మూతపడింది. మిల్లు మూతపడడంతో గద్వాల, వనపర్తి వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగ ఉత్పత్తులకు కేవలం వ్యాపారులు మాత్రమే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఆయిల్‌మిల్లు పనిచేసినంత కాలం ఈ మార్కెట్లో మిల్లుకు సంబంధించిన అధికారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం మార్కెట్లలో ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా తర్వాత గద్వాల, వనపర్తి జిల్లాలో వేరుశనగను ఎక్కువగా పండిస్తున్నందున ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్‌మిల్ మూత పడడం రైతులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడిగా మిల్లు మూతపడి ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలోనే కొంత సామగ్రి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తరలించారు. ఉన్న సామగ్రి తుప్పుపడుతున్నాయి. బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్మిల్ను 1990లో ప్రారంభించారు. ఇటిక్యాల మండలం తిమ్మాపురం శివారులోని 410,411,412,413,401 సర్వే నంబర్లలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌మిల్ ఏర్పాటు చేశారు. అప్పట్లో దాదాపు రూ.18కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. 1983లో వేరుశనగ రైతులకు మరింత ఆదాయం కల్పించడానికి, తక్కువ ధరకే వేరుశనగ నూనె ప్రజలకు అందించడానికి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీజాలు పడ్డాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కర్నూలు జిల్లాలో నూనె గింజలను సేకరించి రైతులకు మద్దతు ధర కల్పించడం కూడా ఒక ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. ప్రభుత్వం బీచుపల్లి వద్ద విజయబ్రాండ్ ఆయిల్ మిల్లును ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు, విజయ బ్రాండ్ నూనెలను ఉత్పత్తి చేసి వచ్చే ఆదాయంలో రైతులకు వాటా ఇచ్చే లక్ష్యంతో బీచుపల్లి ఆయిల్ మిల్‌ను ప్రభుత్వం నిర్మించింది. వేలాదిమంది కార్మికులతోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడం, రైతులకు వాటా ఇవ్వడం బీచుపల్లి మిల్లు నిర్మాణం లక్ష్యం. అప్పట్లోనే ఈ మిల్లు ద్వారా 1400 మందికి ఉద్యోగావకాశాలను కల్పించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2వేల మందికి పైగానే ఉపాధి కల్పించిన ఆయిల్‌మిల్లు కొన్నేళ్లపాటు విజయవంతం కొనసాగింది. పునరుద్ధరణకు సన్నాహాలు దాదాపు 16ఏళ్ల పాటు మూతపడిన విజయర్ధిని ఆయిల్ ఫ్యాక్టరీ పురుద్ధరణకు ఆయిల్‌ఫెడ్ కంపెనీవారు సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఫ్యాక్టరీ తెరవడానికి చర్యలు చేపడుతుంది. అప్పట్లో వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారీ జరిగేది. ఇందుకోసం జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ) నుంచి అప్పు తీసుకుంది. ప్రస్తుతం ఈ అప్పు చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ అప్పును వన్ టైం సెటిల్మెంట్తో చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్డీడీబీ రూ.7.5 కోట్లు కావాలని కోరుతుండగా ఆయిల్‌ఫెడ్ రూ.3 నుంచి రూ.5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయిల్‌ఫెడ్ ఎండీ సమావేశం నిర్వహించింది. గతంలో 200 మెట్రిక్ టన్నులు వేరుశనగ, ఇతరత్రా నూనెలను ఉత్పత్తి చేయడం జరిగేది. ఫ్యాక్టరీ తెరిచాక వేరుశనగ నూనెలతోపాటు పామాయిల్, ఇతరాత్ర నూనెలు ఉత్పత్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసి రెండు లేక మూడు నెలల్లో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అయితే జోగుళాంబ జిల్లాలో కీలకంగా మారనుంది. ఉద్యోగ, వ్యాపారాలతో కళకళ లాడనుంది. -
రైతుల.. నిలువు దోపిడీ
బాల్కొండ: ఎర్రజొన్న రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారుల మాయాజాలంలో ఘోరంగా మోసపోతున్నారు. మద్దతు ధర కోసం ఓవైపు రైతులు ఉద్యమిస్తుంటే సర్కారు నుంచి స్పందన కరువైంది. ఇదే అదనుగా వ్యాపారులు ధర తెగ్గోసి రైతుల పుట్టి ముంచుతున్నారు. మొన్నటి వరకు ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ. 2,100 పలికింది. అయితే, గిట్టుబాటు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమించడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వ్యాపారుల ఆగడాలు రెట్టింపయ్యాయి. సర్కారు స్పందించక పోవడాన్ని అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయిస్తున్నారు. మొన్నటివరకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేసిన దళారులు.. ఇప్పుడు ఏకంగా రూ.1,650కి తగ్గించేశారు. పైగా క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల వరకూ కడ్తా తీసేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత సంవత్సరం జొన్న విత్తడం ప్రా రంభం నుంచి విక్రయించే వరకు రైతులకు తిప్ప లు తప్పడం లేదు. ఎర్ర జొన్నలను గతేడాది ప్ర భుత్వం కొనుగోలు చేయడంతో, ప్రస్తుత సంవత్సరం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ధీమాతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. కానీ సర్కారు చేతులు ఎత్తివేయడంతో జొన్న రైతులు ఉద్యమ బాట పట్టారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలో ఎర్ర జొన్నలను క్వింటాల్‌కు రూ.2100 చొప్పున వ్యాపారులు కొనుగోళు చే శారు. ఆ తర్వాత వారం వ్యవధిలో ధర తగ్గించేశా రు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1650 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధర కారణంగా రైతులు ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.450 చొప్పున నష్టపోతున్నారు. గతేడాది ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2300 రూపాయాల మద్దతు ధర ప్రకటించింది. ఆ లెక్క ప్రకారమైతే రూ.650 చొప్పున నష్టపోతున్నారు. మరింత తగ్గుతుందని ప్రచారం.. మరోవైపు, ధర మరింత తగ్గుతుందని దళారులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. క్వింటాల్ ధర రూ.1500 వరకు పడిపోతుందంటూ వ్యాపారులు ప్రచారం చేయిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనతో వచ్చిన ధరకే తెగనమ్ముకుంటున్నారు. తామంతా ఐక్యంగా ఉండాలని, ఎవరు కూడా జొన్నలను విక్రయించవద్దని తొలుత రైతులు నిర్ణయించుకున్నారు. అయితే, రైతుల ఐక్యతను దెబ్బ తీయడానికి మొదట్లో వ్యాపారులు రూ.2100 ధర చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించగా, కొందరు పంట విక్రయించుకున్నారు. దీంతో రైతుల ఐక్యతను క్రమంగా దెబ్బతీసిన వ్యాపారులు ఇప్పుడు ధరను తగ్గించేస్తున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం స్పందించి ఎర్ర జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధర తగ్గించేశారు.. ఎర్ర జొన్నలు క్వింటాలుకు 1650 రూపాయాలకు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో 2100 రూపాయాలకు కొనుగోలు చేసిన వ్యాపారులు 15 రోజుల్లో ధరను తగ్గించేశారు. ధర తగ్గించడం, కడ్తా రూపంలో ఆరు కిలోలు తీసేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. –సతీష్, రైతు, నాగంపేట్ ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఎర్ర జొన్నల ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో వచ్చిన ధరకే పంటను విక్రయించుకుంటున్నాం. ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది. జొన్న రైతుల గురించి సర్కారు ఆలోచన చేయాలి. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనాలి. – గణేష్, రైతు, నాగంపేట్ -
పుచ్చకాయతో నష్టాలు
పుచ్చకాయ తింటే లాభాలనేకం అందుకే వేసవిలో పుచ్చకాయను తినని వారుండరు. కాని పుచ్చ పంటకు తెగులు సొకడంతో దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతన్నను మార్కెట్లొ ధర వెక్కిరించింది. చివరికి పెట్టుబడి సొమ్ము కూడా చేతికి రాక రైతుకు కన్నీరే మిగిల్చింది. సాక్షి, చిట్టమూరు: వర్షాభావ పరిస్థితులు మెట్టపంటల సాగు రైతును కుదేలు చేసింది. ఈ ఏడాది పుచ్చ పంట వేసిన రైతులకు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. గతేడాది వివిధ ప్రాంతాల్లో వేసిన పంటకు అంతు పట్టని తెగులు సోకడంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అయినా పంట ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులు గతేడాది కంటే ఎక్కువగా నష్టాలను చవిచూశారు. పుచ్చ పంట సాగు చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారుల నుంచి ఎటువంటి సలహాలు, సూచనలు అందలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన సేద్యం పద్ధతులు అవలంబించలేకపోవడంతో పంటలను తెగుళ్లు ఆశించాయి. రైతులు పురుగు మందు దుకాణదారులు చెప్పిన మందులు వాడినా దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయన్నారు. గూడూరు నియోజకవర్గంలో చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు చిల్లకూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో మెట్ట ప్రాంతాల్లో రైతులు పుచ్చ పంట సాగుచేశారు. ప్రస్తుతం కోత దశలో ఉండటంతో రైతులు కాయలు కోసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కాయ సైజును బట్టి వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. చిన్న సైజు కాయలను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పక్కన రైతులే అమ్మకాలు చేస్తున్నారు. వేలు పెట్టుబడి పెట్టి చివరకు కాయ సైజు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో ప్రధానంగా చిల్లమూరు, మొలకలపూడి, రామాపురం గ్రామాల్లో మెట్టు ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగు చేశారు. చిట్టమూరు మండలం నుంచి గతంలో దేశ రాజధాని ఢిల్లీకు కూడా ఎగుమతి అయ్యేవి. అయితే ఈ సంవత్సరం కాయ సైజు పెద్దగా రాకపోవడం, నాణ్యత లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయని రైతులు చెబుతున్నారు. ధరలు భారీగా పతనం ఈ ఏడాది పుచ్చకాయల ధరలు భారీగా పనమయ్యాయి. గతేడాది టన్ను రూ.10 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ.6 వేల నుంచి రూ.6,500 వరకు ఉన్నాయి. కాయలు చిన్నవి అయితే రూ.4,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ మార్కెట్లో వ్యాపారులు మాత్రం కాయల సైజ్‌ను బట్టి విక్రయిస్తుండడంతో టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకంటే.. వ్యాపారులు రెండింతల లాభాలను పొందుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పుచ్చసాగు నియోజకవర్గంలో ఈ ఏడాది వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతులు వరి పంటకు సాగు నీరు లేక ఆరుతడి పంట పుచ్చను సాగు చేశారు. బావులు, గుంతల్లోని నీటి ఆధారంగా పుచ్చసాగు చేశారు. డీజిల్ ఇంజన్ల ద్వారా పుచ్చ పంటకు సాగునీరు అందించి వ్యయప్రయాసలు పడి పండించినా చివరకు కష్టమే మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పుచ్చసాగుకు దుక్కి మొదలు, కోత దశ వరకు సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అయితే తొలి కోతలో రెండు టన్నులు, రెండో కోతలో రెండు టన్నులు మొత్తం ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని రైతులు తెలిపారు. అయితే అన్ని బాగుండి గతంలో ఎకరాకు సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చేదని రైతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఎకరాకు రూ.10 వేలు నష్టం వస్తుందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.10 వేలు నష్టం నాలుగు ఎకరాల్లో పుచ్చ పంట సాగు చేశాను. దిగుబడి తక్కువగా రావడంతో ఎకరాకు రూ. 10 వేలు నష్టం వచ్చింది. అధికారుల నుంచి పంట సస్యరక్షణపై ఎటువంటి సలహాలు, సూచనలు లేకపోవడంతో తెగుళ్లను తగ్గించేందుకు పెట్టుబడులు పెరిగాయి. – సంక్రాంతి కస్తూరయ్య, రైతు, మొలకలపూడి, చిట్టమూరు మండలం డిసెంబర్ నెలలో నాటుకోవాలి రైతులు డిసెంబర్ నెలలో విత్తనాలు నాటుకుంటే పంటకు తెగుళ్లు తగ్గి దిగుబడి పెరుగుతోంది. తామర పురుగు, డైబ్యాక్ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్ ఎక్కువగా సోకడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. రైతులు మేలు రకమైన విత్తనాలను విత్తుకోవాలి. పాతరకం విత్తనాలు వేసుకోవడం వల్ల తెగుళ్లు వస్తున్నాయి. – ఆనంద్, ఉద్యానశాఖ అధికారి, గూడూరు -
రైతుకు నోటీసు
మోర్తాడ్(బాల్కొండ): రైతుల ఉద్యమాన్ని నియంత్రించేందుకు పోలీసులు కొత్త అస్త్రం సంధిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కోసం పోరాడుతుంటే నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేయడంపై మండి పడుతున్నారు. పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్ కేంద్రంగా శాంతియుత నిరసనలు చేపడుతున్నా రు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారు ల దిగ్బంధనంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందు కు యత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఎర్రజొన్నలకు ధర నిర్ణయం తో పాటు కొనుగోలు అంశంపై సర్కారు స్పష్టతనివ్వడం లేదు. దీంతో రైతులు వరుసగా ధర్నాలు, రాస్తారాకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ‘మద్దతు’ కరువు.. ఆర్మూర్ డివిజన్లో పసుపు, ఎర్రజొన్నలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఆయా పంటలు పెద్ద విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పసుపు పండిస్తున్న రైతులకు ఏటా నష్టాలే మిగులుతున్నాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి సగటున రూ.40 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. మరోవైపు, ఎర్రజొన్నల విషయంలోనూ అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. పండించిన పంటను అమ్ముకునేందుకు ఏటా తిప్పలు పడుతూనే ఉన్నారు. మార్కెట్ మాయాజాలంలో మోసపోతూ ప్రతి సంవత్సరం ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా కొనుగోలు చేసింది. అయితే, ఈ సంవత్సరం మాత్రం మద్దతు ధరతో కొనుగోలుపై సర్కారు నుంచి స్పందన కరువైంది. వరుస ఆందోళనలు.. ఏటా తలనొప్పిగా మారిన ఎర్రజొన్నలతో పాటు పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని అన్నదాతలు గత నెల రోజులుగా ఉద్యమిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లోని 14 మండలాలకు చెందిన రైతులు ఆర్మూర్ కేంద్రంగా ఆందోళనలు చేపడుతున్నారు. గత నెల 12, 16 తేదీల్లో ఆర్మూర్‌లో బైఠాయించిన రైతులు.. 18వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడించారు. గత నెల 25న జాతీయ రహదారులను దిగ్బంధించి, రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఆ తర్వాతి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, పోలీసులు వారిని జక్రాన్‌పల్లి శివారులో అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసు తాఖీదులు రైతుల ఉద్యమాన్ని చల్లార్చడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 14 మండలా ల్లో 144 సెక్షన్ విధించినా అన్నదాతలు మాత్రం ఆందోళనలను ఆపలేదు. పోలీసులు గ్రామాలకు వెళ్లి ధర్నాలకు వెళ్లొద్దని ప్రచారం చేయడంతో పాటు పికెటింగ్ నిర్వహించారు. తాజాగా నోటీసు అస్త్రం సంధించారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్న రైతులకు సీఆర్పీసీ 149 సెక్షన్ ప్రకారం ముందస్తు హెచ్చరికగా నోటీసులు జారీ చేస్తున్నా రు. హైవేలు, జనసమ్మర్థం గల ప్రాంతాల్లో ఆందో ళన నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని నోటీసులో పేర్కొన్నారు. మున్ముందు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నోటీసులు అందుకున్న రైతులు ఎలాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఉద్యమానికి నాయక త్వం వహిస్తున్న వారికే ఈ తాఖీదులు జారీ చే స్తుండడం గమనార్హం. మోర్తాడ్, కమ్మర్పల్లి, వే ల్పూర్, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొం డ, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, నందిపేట్ తదితర మం డలాల్లోని రైతు నాయకులకు నోటీసులు జారీ చేశారు. ప్రతి గ్రామంలో రైతులను సమన్వయం చేస్తు ఉద్యమానికి ఊతమిస్తున్నట్లుగా గుర్తించిన రైతు నాయకులకు ఈ నోటీసులిచ్చారు. రైతుల్లో ఆందోళన.. ఇప్పటికే గ్రామాలలో పికెటింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా నోటీసులు జారీ చేయడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంఘ విద్రోహ శక్తులకు జారీ చేయాల్సిన నోటీసులను శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తమకు జారీ చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళన కార్యక్రమాలను అడ్డుకోవడంలో భాగంగా ముందస్తు అరెస్టులు చేయడం, గ్రామాలలో పికెటింగ్ నిర్వహించడం, తాజాగా నోటీసులను జారీ చేయడంపై మండిపడుతున్నారు. రైతుల ఐక్యతను దెబ్బ తీసి ఉద్యమాన్ని అణచి వేయడానికే పోలీసులు నోటీసులను జారీ చేస్తున్నారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకరావడం వల్లే నోటీసులు జారీ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గుణపాఠం తప్పదు పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది. అలా చేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. మద్దతు ధర కోసం ఉద్యమం కొనసాగిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో వెయ్యి మంది వరకు నామినేషన్లు వేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తాం. రైతులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను విరమించుకోవాలి. – అన్వేష్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు ఎవరికైనా ఇవ్వవచ్చు.. సీఆర్పీసీ 149 సెక్షన్ కింద పోలీసులు ఎవరికైనా నోటీసులు ఇవ్వవచ్చు. ప్రధానంగా సంఘ విద్రోహ శక్తులకు ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తుంటారు. అయితే, రైతులు సంఘ విద్రోహశక్తులు కాదు. ఈ సెక్షన్ కింద వారికి నోటీసులు ఇవ్వకుంటేనే బాగుండేది. పోలీసులకు అధికారం ఉన్నప్పటికీ రైతుల విషయంలో ఆలోచించాల్సింది. రైతుల వరుస ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఈ సెక్షన్‌ను ఉపయోగించుకున్నారు. – రాజేశ్వర్, న్యాయవాది -
చకచకా..సీఎంఆర్
నల్లగొండ / మిర్యాలగూడ : జిల్లాలో సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ వేగవంతంగా సాగుతోంది. ఖరీఫ్ – 2018–19లో రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఇచ్చి, వారి నుంచి బియ్యం సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బియ్యం సేకరణ చేపట్టిన అధికారులు గడువులోగా వందశాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74 శాతం బియ్యం సేకరించారు. మార్చి నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు గడువు ఉన్నప్పటికీ ఫిబ్రవరి 15లోగా సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన బియ్యం నిల్వ ఉంచడానికి గాను గోదాములలో ఖాళీల కోసం ఉన్నతాధికారుల అనుమతికి కూడా లేఖ రాశారు. మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని నిల్వలు పెట్టుకోవడానికి అనుమతి కూడా వచ్చే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు ఇలా ఖరీఫ్ 2018–19లో జిల్లాలో ప్రభుత్వం భారీగా ధాన్యం కొనుగోళ్లు చేసింది. జిల్లాలో 58 ఐకేపీ, 48 పీఏసీఎస్ కేంద్రాలు మొత్తం 106 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఆయా కేంద్రాల ద్వారా 43,598 మంది రైతులనుంచి 391.08 కోట్ల రూపాయలు వెచ్చించి 2,20,949 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎప్పటికప్పుడు జిల్లాలోని 50 రైస్‌మిల్లులకు దిగుమతి చేశారు. ప్రతి ఏటా ఇలా ... గతంలో ప్రతిఏటా ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఐకేపీ కేంద్రాలకు కేవలం దొడ్డు ధాన్యం మాత్రమే వచ్చేది. మిల్లర్లే రైతుల వద్దకు వెళ్లి అవసరమైతే ఐకేపీ వద్ద చెల్లించే ధరనే చెల్లించి సన్నధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. పెద్దఎత్తున నిల్వ చేసి ముందుగా వాటిని మర ఆడించి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేవారు. వారికి ధాన్యం కంటే బియ్యం ధరలు అధికంగా ఉండేవి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకుండా వారు వ్యాపారం చేసుకొని మిల్లులకు పనిలేని సందర్భంలో తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి ఇచ్చేవారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ బియ్యాన్ని కూడా వ్యాపారం చేసుకొని రబీ సీజన్లో ఖరీఫ్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేవారు. ఈసారి కథ అడ్డం తిరిగింది మిల్లర్లు ప్రతిసారి మాదిరిగా ఈ ఖరీఫ్‌లో సన్నధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ఎంఎస్పీ ధర పెంచింది. గతంలో క్వింటాకు కామన్ ధాన్యానికి ధర రూ.1550 ఉండగా గ్రేడ్ ఏకు రూ.1,590 ఉండేది. దాన్ని కామన్ రకానికి రూ.1750, గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1770కి పెంచడంతో రైతులకు గిట్టుబా టు ధర లభించినట్లయ్యింది. ధాన్యం ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో బియ్యం రేటు పెరగలేదు. దీంతో మిల్లర్లు ధాన్యాన్ని కొని మర ఆడించి బియ్యాన్ని అమ్మడం వల్ల నష్టం వస్తుందని భావించి సన్నధాన్యాన్ని కొనలేదు. దీంతో ఈసారి సన్నధాన్యం కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వచ్చింది. 74 శాతం సీఎంఆర్ సేకరణ : రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు దిగుమతి చేసిన అధికారులు వెంటనే సీఎంఆర్ సేకరణ కూడా ప్రారంభించారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి సంబంధించి మార్చి 31 వరకు అప్పగించాల్సి ఉంది. ప్రతి ఏటా మిల్లర్లు ఆలస్యంగా బియ్యాన్ని అప్పగిస్తున్నారన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 15ను గడువుగా నిర్ణయించారు. మిల్లులకు ఇచ్చిన 2,20,949 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 1,48,035 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,09,404 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించారు. ఇంకా 38,631 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 74 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తి చేశారు. ఇక 26 శాతం బియ్యం మాత్రమే ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అది ఈనెల పూర్తయ్యేలోపే వచ్చే అవకాశం ఉంది. గడువుకు ముందు సేకరిస్తాం జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74 శాతం కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించాం. గడువుకు ముందే నూరుశాతం బియ్యం సేకరిస్తాం. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించాం. గోదాములలో నిల్వ ఉంచడానికి కూడా ఖాళీ స్థలం కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. – ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నల్లగొండ -
ధాన్యం..దైన్యం
నేలకొండపల్లి: రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సొసైటీ) కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. దోమపోటుతో చాలావరకు వడ్లు తాలుగా మారాయి. ఎకరానికి 30క్వింటాళ్ల దిగుబడి కూడా రావట్లేదు. జిల్లాలో 83 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో కేంద్రాల వద్ద నిబంధనల కొర్రీలతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా 67, ఐకేపీ సంఘాల ద్వారా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ–గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1770, బీ–గ్రేడ్‌కు రూ.1750 చెల్లించాలి. అయితే ఈ మద్దతు ధర అందరికీ అందట్లేదు. గింజ రంగు మారిందని, తేమ ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని..కేంద్రాల్లో కాంటాలు పెట్టకపోవడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఐకేపీ, సొసైటీల కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు. ఇక్కడ టార్పాలిన్లు ఉంచలేదు. వడ్లను ఆరబోసేందుకు స్థలం లేదు. రైతులు రోడ్ల వెంట ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీసం పట్టాలు కూడా సరఫరా చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు పెట్టుబడి పెరిగింది. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు వెచ్చించారు. దిగుబడి చూస్తే 30క్వింటాళ్లు కూడా రాలేదు. విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకొస్తే నిబంధనల పేర ఆపేస్తున్నారని అంటున్నారు. పైగా రూ.1770 మద్దతు ధర సరిపోదని చెబుతున్నారు. నిల్వ ఉంచితే మరింత ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చని కొందరు ఇళ్లకు తరలిస్తున్నారు. కనీసం క్వింటాకు రూ.2 వేలు వచ్చే వరకు ఆపేస్తామని పలువురు రైతులు చెబుతున్నారు. -
రబీ పంటలకు ‘మద్దతు’ పెంపు
న్యూఢిల్లీ: వ్యవసాయంలో పెట్టుబడి కూడా తిరిగిరాక తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులకు కాస్తంత ఊరటనిచ్చేలా రబీ పంటల మద్దతు ధరలను కేంద్రం బుధవారం పెంచింది. గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, తెల్ల కుసుమలు, మసూర్ పంటల మద్దతు ధరలు 6 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై మద్దతు ధరల పెంపుకు ఓకే చెప్పింది. తాజా పెంపు వల్ల రూ.62,635 కోట్ల అదనంగా రైతులకు అందుతాయని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు, ఏడు నెలల్లో దేశమంతటా సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధరలను పెంచడం గమనార్హం. మద్దతు ధరల పెంపు, రుణమాఫీ కోరుతూ మంగళవారమే రైతులు ఢిల్లీలోనూ భారీ నిరసనకు దిగడం తెలిసిందే. పెట్టుబడి కన్నా 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చూస్తామని గతంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు హామీనివ్వడం తెలిసిందే. తాజా పెంపు తర్వాత రబీ పంటలన్నింటికీ మద్దతు ధరలు పెట్టుబడి వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగానే ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చెప్పారు. 2018–19 వ్యవసాయ సంవత్సరానికి వర్తించేలా గోధుమ ఎమ్మెస్పీని కేంద్రం రూ. 105 పెంచడంతో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,840కి చేరింది. అలాగే ప్రతి క్వింటాల్‌కు బార్లీకి రూ. 30 (పెంపు తర్వాత మద్దత ధర రూ. 1,440), శనగలకు రూ. 220 (రూ. 4,620), మసూర్‌కు రూ. 225(రూ. 4,475), ఆవాలకు రూ. 200(రూ. 4,200), తెల్ల కుసుమలకు రూ. 845(రూ. 4,945)ల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. గత జూలైలోనే వివిధ ఖరీఫ్ పంటల మద్దతు ధరలను కూడా పెంచి అన్ని పంటలకూ పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉండేలా చేసింది. -
టీఆర్ఎస్ కూడా అలా చేయాలి
సాక్షి, హైదరాబాద్: 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీ వేసిన మరో ముందడుగని పేర్కొన్నారు. అసెంబ్లీ మీటింగ్ హాల్లో బుధవారం వారు మీడియాతో మట్లాడారు. పంటల సాగు వ్యయానికి 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను స్థిరీకరిస్తామని గత లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీపై బీజేపీ సానుకూల నిర్ణయం తీసుకుందని లక్ష్మణ్ అన్నారు. రైతుల సంక్షేమానికై బీజేపీ కట్టుబడి ఉందనీ, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పుడెందుకు నోరుమెదపరు స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులపై మాట్లాడే రాజకీయ పార్టీలు రైతుల సంక్షేమానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని కిషన్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమానికై పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాదిరిగా పంటలకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
‘మాస్’ ఓ గుదిబండే..!
సాక్షి, హైదరాబాద్ : గోధుమ, వరి మినహాయించి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ల పరిధిలోకి వచ్చే ఇతర పంటల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన మార్కెట్ హామీ పథకం(మాస్)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండించిన పంటలను ఎంఎస్పీకి కొనుగోలు చేసే వ్యవస్థను బలోపేతం చేసేందుకే మాస్‌ను తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతుల నుంచి ఎంఎస్పీకి పంటను కొనుగోలు చేశాక, ఆయా ఉత్పత్తులను తిరిగి వివిధ సంస్థలకు ఎప్పుడు అమ్మాలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి. పంటలను బయట విక్రయించేప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఎంఎస్పీ విలువలో 40–50% వరకు నష్టం వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. అయితే 50% కంటే ఎక్కువ నష్టం వస్తే రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన రాష్ట్రాలకు గుదిబండగా మారే ప్రమాదముందన్న విమర్శలున్నాయి. రాష్ట్రల సంస్థలకు భారీగా నష్టం..: రైతుల నుంచి కొనుగోలు చేశాక పంటను అమ్మే క్రమంలో ఆయా రాష్ట్రాల సంస్థలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అనుసరించాల్సిన వ్యవసాయ ప్రణాళికపై కేంద్రం ఇటీవల రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాస్ పథకంపై దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ పాల్గొన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి నూతనంగా ధరల లోటు సేకరణ పథకం(పీడీపీఎస్) కూడా కేంద్రం ప్రారంభిస్తోంది. రైతు ఉత్పత్తి చేసిన పంటకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర, మార్కెట్లో లభించే వాస్తవ ధరకు మధ్య తేడాను ఈ పథకం కింద కేంద్రం అందజేయనుంది. వ్యవసాయ మార్కెట్లో రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఇది వర్తింపజేస్తారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా ఇతర పంటలకు ఏటా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తుంది. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం.. : సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన (పీకేవీవై) కింద దీన్ని అమలు చేస్తారు. క్లస్టర్ల పరిమాణాన్ని 2,500 ఎకరాలకు పెంచారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్ తదితర అంశాలకు సంబంధించి రాష్ట్రాలు వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్రం మార్గదర్శకాల్లో సూచించింది. సాధారణ వ్యవసాయ పద్ధతి నుంచి సేంద్రీయం వైపు మరలడం, పెట్టుబడి రాయితీల వంటి వాటికి ఇచ్చే సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తుంది. నేరుగా మార్కెట్ చేసుకునేందుకు ఆర్థిక సాయం చేస్తుంది. రాష్ట్రానికి అదనంగా 50 సేంద్రీయ వ్యవసాయ క్లస్టర్లు ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని కమిషనర్ జగన్మోహన్ తెలిపారు. వ్యవసాయం వైపు యువకులు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. -
అందని బంధు
బూర్గంపాడు : పంటలకు గిట్టుబాటు ధర లభించనప్పుడు రైతుల తక్షణ అవసరాల కోసం మార్కెటింగ్ శాఖ రైతుబంధు పథకాన్ని అమలుచేస్తోంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు పథకానికి అర్హులవుతారు. ఇలా నిల్వచేసిన పంటల కనీస మద్దతు ధరలో 75 శాతం మేర రైతులకు మార్కెటింగ్ శాఖ వడ్డీ లేకుండా రుణం అందజేయడమే రైతుబంధు పథకం ఉద్దేశం. ఇలా ఒక్కో రైతు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. పంటలను అమ్ముకున్నప్పుడు రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల వరకు వడ్డీ ఉండదు. ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ధరలు వచ్చేవరకు తమ అవసరాలకు తగిన రుణసాయం ఈ పథకంలో అందుతుంది. అయితే ఈ పథకంపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరు మార్కెట్ కమిటీలు... జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేట, చర్లలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాములున్నాయి. ధాన్యం, అపరాలు నిల్వచేసుకున్న వారికి రైతుబంధు పథకం వర్తిస్తుంది. అయితే మార్కెటింగ్ అధికారులు రైతులకు అవగాహన కల్పించడకపోవడంతో తక్షణ అవసరాలకు తక్కువ ధరలకే పంటలు అమ్ముకుంటున్నారు. జిల్లాలో నలుగురు రైతులకే వర్తింపు... జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రైతుబంధు పథకాన్ని నలుగురు రైతులకే వర్తింపజేశారు. బూర్గంపాడు మార్కెట్లో ఇద్దరు, కొత్తగూడెంలో ఇద్దరు రైతులు వడ్డీలేని రుణం పొందారు. గత వ్యవసాయ సీజన్లో కూడా జిల్లాలో 40 మంది రైతులకు మాత్రమే ఈ పథకం అమలైంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడం వల్లే ఎక్కువ మంది ఉపయోగించుకోవడం లేదని, మార్కెట్ అధికారులు కరపత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు వివరిస్తే ఎంతోమంది వినియోగించుకునే అవకాశాలున్నాయని అంటున్నాయి. ఈ ఏడాది అపరాలకు సరైన గిట్టుబాటు ధర లేకున్నా రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరలకే అపరాలను అమ్ముకుంటున్నారు. ఈ పథకం గురించి తెలిస్తే అపరాలు నిల్వచేసుకుని రుణం తీసుకునేవారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం రైతుబంధు పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మార్కెట్ గోదాముల్లో పంటలను నిల్వచేసుకునే రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. చాలామంది రైతులు పంటలు నిల్వ చేసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఇక నుంచి గ్రామస్థాయిలో కూడా ఈ పథకంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
యార్డు నిండెన్.. ధర తగ్గెన్..
ఖమ్మంవ్యవసాయం : మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది.. వ్యాపారులు ఇదే అదనుగా భావించారు.. రైతులకు కుంటిసాకులు చెప్పి.. ధర దోపిడీకి పాల్పడ్డారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరుకు రాక ఎక్కువైనప్పుడల్లా వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకోవడం నిత్యకృత్యమైంది. నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా వచ్చింది. సుమారు 60వేల బస్తాలు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి విక్రయానికి వచ్చింది. ప్రధాన యార్డు నిండటంతో మరో యార్డును మిర్చి కోసం కేటాయించారు. దీనిని అదనుగా భావించిన వ్యాపారులు కూడపలుక్కొని ధరను పూర్తిగా పతనం చేశారు. గత వారంతో పోలిస్తే ఏకంగా రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేశారు. గత వారం క్వింటా రూ.11,275 వరకు పలికిన ధర సోమవారం గరిష్టంగా రూ.10,100 చేరింది. వ్యాపారులు కొనుగోలు చేసింది సగటున రూ.9వేలు మాత్రమే. జనవరి మూడో వారం నుంచి రోజుకో రకంగా ధర పెరిగింది. డిసెంబర్ చివరి వారంలో రూ.8,800 వరకు ఉన్న ధర 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.11,000 దాటింది. జనవరి 27 వరకు రూ.11, 275 ధరను తాకింది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు ధరను పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎ దురవుతాయని చర్చించుకొని సిండికేటుగా మారి, తిరిగి ధర తగ్గించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో జనవరి 30న ధరను రూ. 10,800 తగ్గించారు. 31వ తేదీ నాటికి రూ.10,600 చేర్చారు. సోమవారానికి(జనవరి 5న) ఏకంగా గరి ష్ట ధరను రూ.1 0,125 తీసుకొచ్చారు. కానీ. అంతా కూడపలు క్కొని సగటున రూ.9వేలకు మించి ధర పెట్టలేదు. కొందరి పంటను రూ.8వేల వరకు కూడా కొనుగోలు చేశారు. ఇదేమిటంటే.. నాణ్యత లేదని, తేమ అధికంగాఉందని కుంటి సాకులు చెప్పారు. రూ.2వేలకు పైగా ధర దోపిడీ గత నెల 27వ తేదీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ధర తగ్గించి కొంటున్నారు. విదేశాల్లో తేజ రకం మిర్చికి డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడి వ్యాపారులు సిండికేటుగా మారి దోపిడీకి గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇంతగా ధర తగ్గించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరుకు పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను కృత్రిమంగా పడేసి ధర దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అవసరాన్ని ఆసరా చేసుకొని దగా రబీ పంటల సాగు అవసరాలు, మిర్చి కోసిన కూలీల చార్జీలు చెల్లించటం కోసం రైతులు పంటను విక్రయానికి తెస్తున్నారు. దీనిని వ్యాపారులు అదనుగా భావించి.. సిండికేటుగా ఏర్పడి ధర దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారులు ధరను తగ్గించినా రైతులు ధిక్కరించలేకపోతున్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఇచ్చేది ఆ వ్యాపారులే కావటంతో ఏమీ మాట్లాడలేక పెట్టిన ధరకే పంటను విక్రయించక తప్పటం లేదు. వ్యాపారులు పెట్టే ధరలను చూసి రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు. రూ.11వేలు వస్తుందనుకున్నా.. మిర్చికి ధర ఉందని, క్వింటాల్‌కు రూ.11వేలకు పైగా ధర వస్తుందని ఆశించా. ఎకరం మిర్చి తోట వేశా. 20 బస్తాలు విక్రయానికి తెచ్చా. క్వింటాల్‌కు రూ.9వేల ధర పెట్టారు. ఎంత బతిమిలాడినా వ్యాపారులు ధర పెంచలేదు. ధరలో అన్యాయం చేశారు. ధర దోపిడీ చేస్తున్నారు. – షేక్ జానీమియా, వనంవారి కిష్టాపురం, ముదిగొండ మండలం కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉండి మిర్చి అమ్మకానికి తెచ్చా.. మిర్చి తోట ఏరిన కూలీలు డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబ అవసరాలు కూడా ఉన్నాయి. అయినా ఖమ్మం మార్కెట్లో రూ.11వేలకు పైగా ధర ఉందని 30 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. రూ.9వేల ధర పెట్టారు. అవసరాన్ని చూసి రైతులకు వాత పెడుతున్నారు. – ధర్మసోత్ సాగర్, ఎల్లంపేట, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా -
దిగుబడి లేదు..గిట్టుబాటు రాదు
కారంచేడు : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతన్నలను నిండా ముంచేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.11 లక్షల ఎకరాల్లో వరి, 2.57 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేశారు. వరి, శనగ సాగుల్లో ప్రకాశం జిల్లా రైతులు మంచి మెళకువలు పాటించి ఎక్కువ దిగుబడులు సాధిస్తుంటారు. కానీ వాతావరణం అనుకూలించక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కర్షకులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దిగుబడులు పతనమై, ధరలు దిగజారిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ధాన్యాగారానికి తప్పని నష్టాలు.. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంత రైతన్నలకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వాతావరణం అనుకూలించి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటున్న అన్నదాతలు ఈ ఏడాది మాత్రం పంట దిగుబడుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ఏడాది దిగుబడులు బాగున్నాయి, ధరలు కూడా బాగున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు లేకపోగా ధరలు కూడా పతనమవడంతో ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారు.జిల్లాలోని 12 సబ్ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో మొత్తం శనగ సాగు 2,56,598 ఎకరాల్లో, వరిసాగు 1,10,513 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయా«ధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంత ఘోరమైన దిగుబడులు గతంలో చూడలేదు గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శనగ సాగు ఘోరంగా ఉంది. వాతావరణం అనుకూలించపోవడంతో కాపు తగ్గిపోయింది. చెట్టు బాగా పెరిగింది. కానీ కాయలు తగ్గిపోయాయి. దీంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వచ్చేలా ఉంది. ఒక్కో రైతు కనీసం 5 ఎకరాల వరకు సాగు చేశారు. – దగ్గుబాటి నాగశ్రీను, రైతు, కారంచేడు వరిలోనూ నష్టపోవాల్సిందే ఈ ఏడాది వరి సాగులో కూడా రైతులు నష్టపోవాల్సిందే. ముదురులో సాగు చేసిన చేలల్లో కనీసం 90 శాతం పంట పడిపోయింది. దీంతో గింజ రాలిపోయింది. వాతావరణం ఈ ఏడాది అన్నదాతలను నిండా ముంచేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోగా ధరలో బస్తాకు రూ.300 వరకు తగ్గింది. దీంతో రైతులు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోవాల్సి వస్తుంది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుకు కొంత ఊరటగా ఉంటుంది. – యార్లగడ్డ శ్రీకాంత్, రైతు, కారంచేడు -
ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలి
ఆర్మూర్ : ఎర్రజొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ప్రాంగణంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రజొన్న రైతు ప్రతినిధులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 110 గ్రామాల్లో ఎర్రజొన్న పంటను సుమారు 50 వేల ఎకరాల్లో పండిస్తున్నారన్నారు. ఈ పంటను మన రాష్ట్రంతో పాటు హర్యానా, ఢిల్లీ, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా లాంటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఇక్కడ పండిన పంట దేశ సరిహద్దులు దాటుతున్నా సీడ్ వ్యాపారుల మోసాల కారణంగా రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కోసం రైతులు చేసిన ఉద్యమంలో రైతుల పక్షాన నిలిచిన టీఆర్‌ఎస్‌నాయకులు ఇప్పుడెందుకు రైతులను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీడ్ వ్యాపారుల సిండికేట్ వ్యాపారానికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తూ విత్తన వ్యాపారం చేయాలనే డిమాండ్‌తో రైతు ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని ప్రారంభించనున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 9న చలో కలెక్టరేట్‌కు పిలుపునిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రజొన్న రైతులు తరలి వచ్చి చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజేశ్వర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఏపీ గంగారాం, రాజన్న, నాయకులు కిషన్, అశోక్, పీడీఎస్‌యూ జిల్లా మాజీ కార్యదర్శి సుమన్, ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పైసా ఇస్తే ఒట్టు
మదనాపురం : ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నకు అడుగడుగునా కష్టాలే.. పంటల సాగు సమయంలో ఎరువులు, విత్తనాల కొరత.. తీరా చేతికొచ్చిన పంటను విక్రయించగా డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన వ్యథ.. ఈ పరిస్థితినే జిల్లాలో కంది రైతులు ఎదుర్కొంటున్నారు. నెలరోజుల క్రితం ధాన్యం అమ్మినా చిల్లిగవ్వా చేతికందని దైన్యం. జిల్లాలోని వనపర్తి, మదనాపురం వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో డిసెంబర్ 27న మార్కెటింగ్ శాఖ సహకారంతో హాకా ఆధ్వర్యంలో అట్టహాసంగా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆరంభం ఆర్భాటంగా మొదలైంది.. ఇదిచూసి సంబురపడిన రైతులు తండోపతండాలుగా తరలొచ్చి పండించిన కందులను మార్కెట్లో విక్రయించారు. మద్దతు ధర వచ్చినా రాకున్నా అమ్ముకున్నారు. రూ.4.67కోట్ల బకాయిలు కొత్తకోట, మదనాపురం, మూసాపేట, అడ్డాకుల మండలాలకు చెందిన 493 మంది రైతులు 4,913 క్వింటాళ్ల కందు లను క్వింటాలుకు రూ.5,450చొప్పున మదనాపురం మార్కెట్లో విక్రయిం చారు. వీరికి సుమారు రూ.2.67కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే వీపనగండ్ల, పాన్‌గల్, ఖిల్లాఘనపురం గోపాల్పేట, ఎర్రవల్లి, వనపర్తి తదితర మండలాలకు చెందిన సుమారు 281 మంది రైతులు వనపర్తి మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో రూ.3,788క్వింటాళ్ల కందులు విక్రయించారు. వీరికి సుమారు రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు డబ్బులు అకౌంట్లలో వేస్తామని 25రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుచేసి పంట పండిస్తే వచ్చే డబ్బులు వడ్డీలకే సరిపోతున్నాయని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం ఎందుకంటే..! మార్కెట్ యార్డుల్లో కందులు కొనుగోలుచేసే సమయంలో రైతుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. సంబంధిత గ్రామ వీఆర్వోతో పాటు పొలం పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, జిరాక్స్ కాపీలను తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని ఒక నమూనాలో పొందుపరిచి లారీలో కందుల ధాన్యం తరలించే సమయంలో ప్రభుత్వానికి పంపిస్తారు. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు వివరాలను పొందుపర్చకపోయినా అందరికీ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆగిపోతుంది. ముందుగా ధాన్యం కొనుగోలుచేసిన అధికారులు 20రోజుల తర్వాత రైతుల నుంచి బ్యాంకుల ఖాతాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. అడుగడుగునా కష్టాలే! రైతులు భూమి చదును చేసే నాటి నుంచి పంటకోసే వరకు కష్టాలు తప్పడం లేదు. కంది పంట సాగుకు ఎక రా దుక్కి దున్నేందుకు రూ.2వేలు విత్తనాల ఖర్చు రూ.500, అచ్చులతో విత్తనాలు వేసేందుకు రూ.వెయ్యి, కలుపుతీతకు కూలీల ఖర్చు రూ.ఐదువేలు, ఎరువుల ఖర్చు రూ.ఐదువేలు, పంటకోత కూలీ రూ.రెండువేలు, ఇలా ఎకరాకు రూ.15వేలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. రైతు కంది పంట ను సాగుచేస్తే దిగుబడి రాకపోతే అప్పులపాలు కాకతప్పదని వాపోతున్నారు. ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్నంపెట్టే రైతన్నల కు మాత్రం మొండిచేయి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం అమ్మిన రూ.4.67కోట్ల డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. 10క్వింటాళ్ల కందులు తీసుకొచ్చా 10 క్వింటాళ్ల కందులను మదనాపురం మార్కెట్ యార్డుకు విక్రయించేందుకు తీసుకొచ్చాను. ఇంతకుముందు కందులు అమ్మిన రైతులకు డబ్బులు రాలేదని తెలిసింది. రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చూడాలి. – నాగరాజు, రైతు, గట్లఖానాపురం రైతులను ఇబ్బంది పెట్టొద్దు మేం ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాం. గత నెలలో కందులు అమ్మిన రైతులకు డబ్బులు ఇంకా రాలేదు. తక్షణమే అధికారులు స్పందించి డబ్బులు చెల్లించాలి. – బాలస్వామి, రైతు, కొత్తకోట -
పసుపు రైతులకు కష్టకాలమే..
మొదటిసారిగా రూ.4వేల ధర ప్రకటించిన ప్రభుత్వం పెట్టుబడి పెరగడంతో నష్టపోతున్న రైతులు వరంగల్ సిటీ, న్యూస్‌లైన్,జిల్లాలో పసుపు సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ఇప్పటికే సాగు కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేసిన రైతులు కనీస ధర లభించకపోవడంతో ఆవేద న చెందుతున్నారు. రెండు నెలల క్రితం నుంచి మార్కెట్లకు పసుపు వస్తుండగా... ప్రభుత్వం ఎన్నడూలేని విధంగా పసుపు క్వింటాల్‌కు రూ.4 వేలుగా ఎంఎస్పీ ధర నిర్ణయించింది. అయితే, కనీసం రూ.5వేల ధర నిర్ణయిస్తే లా భం జరిగేదని రైతులు చెబుతున్నారు. గతంలో రూ.10వేలు రెండేళ్ల క్రితం పసుపు క్వింటాల్‌కు రూ.10వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు పసుపు సాగుపై ఆసక్తి పెంచుకోగా.. గత ఏడాది మా త్రం రూ.4వేల నుంచి రూ.5వేల వరకే ధర లభించింది. ఆ సంవత్సరం వరంగల్ మార్కెట్‌కు 50,845 క్వింటాళ్ల పసుపు వచ్చింది. దీంతో ఈసారి ఎలా ఉంటుందోనని రైతులు బెంగ పడుతున్నట్లుగానే ప్రభుత్వం రూ.4వేల ధర నిర్ణయించడంతో.. వ్యాపారులు కూడా కొ ద్దిగా అటూఇటు ఇదే ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇచ్చేది కూడా ఇంతేనని దబాయిస్తుండడం చేసేదేం లేక రైతులు పసుపు అమ్ముకుని నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరికొందరు మాత్రం ధర పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసముద్రంలోనూ అదే తీరు.. కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పసుపు అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ సీజన్ అడపాదడపా పసుపు వస్తుండగా.. బుధవారం నాలుగు వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. గత ఏడాది క్వింటాల్ పసుపు రూ.3200 నుంచి రూ. 4వేల వరకు ధర లభించగా, రైతులు నష్టపోయారు. ఈసారి అకాల వర్షాలతో పసుపు దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ లో బుధవారం కాడి రకం క్వింటాల్‌కు రూ.5725-రూ.4631, గోల రకానికి రూ.5800-రూ.4600 ధర లభించింది. ఇలా కనీసం గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతుండగా.. కాం టాలు సరిగ్గా సాగక రాశుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈసారి ఎంతగానో ఆశపడ్డాను గత సంవత్సరం పసుపు ధర భాగా తగ్గడంతో ఈ ఏడాది మంచి ధర లభిస్తుందని ఆశపడి సాగు చేశాను. కానీ ధర ఏ మాత్రం పెరగకపోవడంతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి. నేను చేసిన అప్పులు మిగిలేలా ఉన్నాయి. - అనుముల సంజీవ, మొండ్రాయి ఇక పసుపు సాగుచేయను ఎంతో కష్టపడి ఎక్కువ పెట్టుబడితో పసుపు సాగు చేస్తే అందులో సగం కూడా ధర రావడం లేదు. ఇక నుంచి పసు పు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నా. ఐదేళ్లుగా పసుపు సాగు చేస్తున్న నాకు ఎప్పుడూ ఓ ఇబ్బంది ఎదురవుతోంది. - గుగులోతు బిక్షపతి, దీక్షకుంట్ల