
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్‌పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్‌కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్‌కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్‌కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్‌కేఎం తెలిపింది.
చేతల్లో చూపండి: తికాయత్
సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్‌లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్‌లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment