Legitimacy
-
‘హైడ్రా’కు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా)కు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనితో ఇకపై ‘హైడ్రా’ చేపట్టబోయే కార్యకలాపాలకు చట్టబద్ధత లభించనుంది. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారని అధికారవర్గాలు తెలిపాయి. తక్షణమే అమల్లోకి..హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ.. చెరువులు, కుంటలు, పార్కులు, ఆటస్థలాలు వంటివి కబ్జా అవకుండా కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్వోసీ జారీచేయడం తదితర లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జీవో ఎంఎస్ నంబర్ 99 ద్వారా ‘హైడ్రా’ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తున్నప్పటికీ.. తాజాగా ఆర్డినెన్స్ ద్వారా కీలక అధికారాలను అప్పగించారు. ఈ సవరించిన జీహెచ్ఎంసీ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్నట్టు వెల్లడించారు.ప్రపంచంలో ఉత్తమ నివాసయోగ్య నగరంగా..రాష్ట్రంలో పన్ను రాబడి, జీఎస్డీపీలో మూడో వంతు ఆదాయ వనరు అయిన హైదరాబాద్ ప్రపంచంలోని ఉత్తమ నివాస యోగ్య నగరాల్లో ఒకటిగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు గుర్తించాయని గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో, ఈజ్ ఆఫ్ లివింగ్తోపాటు ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాల్లో హైదరా బాద్ పేరెన్నికగన్నదని తెలిపింది. వివిధ ప్రగతిశీల విధానా ల ద్వారా ఈ ఆకర్షణను కొనసాగించడానికి హైదరాబాద్ పాలనా యంత్రాంగం ప్రయత్నిస్తోందని వివరించింది.ప్రత్యేక ఏజెన్సీ ఆవశ్యకత ఉందంటూ..ఇటీవలి భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ నగరం దుర్భల పరిస్థితికి అద్దం పట్టాయని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఆకస్మిక పరిస్థితులు, విపత్తుల కోసం ప్రత్యేక ఏజెన్సీల అవసరం ఉందని.. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నిర్వహణ కోసం సమర్థమైన స్థితిస్థాపక వ్యవస్థలను అమలు చేయడానికి ఈ ఏజెన్సీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. జీహెచ్ఎంసీ మరింత విస్తృతంగా పనిచేయడానికి, అధికారాలను బలోపేతం చేయడానికి ఈ ఏజెన్సీల ఆవశ్యకత ఎంతో ఉందని వివరించింది. ఆక్రమణలకు గురయ్యే చెరువులు, కుంటలు వంటి నీటి వనరులు, గ్రీనరీ, బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ ఆస్తులు మొదలైన విలువైన వాటి రక్షణకు సంబంధించి ప్రత్యేక ఏజెన్సీ అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీకి అవసరమైన సామర్థ్యాన్ని అందించడానికి ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టం–1955’కు అవసరమైన సవరణలు చేయడం తప్పనిసరని తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ను ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) ఆర్డినెన్స్– 2024’గా పేర్కొంది.కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్ఆర్డినెన్స్తో జీహెచ్ఎంసీ చట్టం–1955లో కొత్తగా 374–బీ సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. కార్పొరేషన్, ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది. కార్పొరేషన్, కమిషనర్లకు సంబంధించిన అధికారాలను ఎవరైనా అధికారికి, లేదా ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌కే పరిమితమైన అధికారాలన్నీ ఇకపై ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. తద్వారా రోడ్లు, డ్రెయిన్లు, వీధులు, జల వనరులు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్కులు మొదలైన ఆస్తుల పరిరక్షణ వంటివాటి ఆక్రమణలు, విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. -
చట్టబద్ధత కోసం తీవ్ర ఒత్తిడి తెస్తాం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్‌లో రాహుల్‌ను రైతు సంఘాల నేతలు కలిశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్‌తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు. -
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
అధికారంలోకి రాగానే కుల గణన
భోపాల్: రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ఈ రెండు అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని బంద్నవర్ పట్టణంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం తరహాలో కులగణన కూడా ఒక భారీ విప్లవాత్మకమైన ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు కచి్చతంగా ఎవరెంత మంది ఉన్నారో కులగణన ద్వారా తెలుస్తుందని, దీని ఆధారంగా ఆయా వర్గాల కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయవచ్చని తెలిపారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక న్యాయం చేకూర్చడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రైతన్నలకు సైతం న్యాయం చేస్తామన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
పంజగుట్ట: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం నుంచి సమావేశాలు పూర్తయ్యే 22 వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 3న జాతీయ స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నేతల సమావేశాలు, 4, 5 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించడం, 6న జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 9న అన్ని మండలాల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 18న ఢిల్లీలో మాదిగ ఉద్యోగుల నిరాహార దీక్ష, 19న ఢిల్లీలో మాదిగ మేధావులు, విద్యావంతుల దీక్ష, 20న మాదిగ జర్నలిస్టుల దీక్ష, 21న మాదిగ కళామండలి దీక్ష, 22న మాదిగ లాయర్ల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: రైతు విజయమిది. ఏడాదిగా ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికినా... మొక్కవోని సంకల్పంతో, దీక్షతో నిలిచి గెలిచాడు అన్నదాత. రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనే భయమో... తరముకొస్తున్న ఎన్నికల్లో ఓట్ల లెక్కల బేరీజు, ఎదురయ్యే పర్యవసానాలో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు తలవంచింది. మూడు వివాదాస్పద సాగు చట్టాల బిల్లుల ఉపసంహరణకు సోమవారం పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి... దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. 24న కేంద్ర మంత్రి మండలి ఈ బిల్లును ఆమోదించడంతో... ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొని శీతాకాల సమావేశాల తొలిరోజు... సోమవారమే పార్లమెంటు ఉభయసభల్లో ఉపసంహరణ బిల్లును గట్టెక్కించింది. చర్చ కావాలనే విపక్షాల ఆందోళన మధ్యనే నిమిషాల వ్యవధిలో లోక్‌సభ, రాజ్యసభలో ‘వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు– 2021‘ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే... నల్ల చట్టాలుగా ఖ్యాతికెక్కిన మూడు సాగు బిల్లులు చరిత్ర గర్భంలో కలిసిపోనున్నాయి. మద్దతు ధరకు చట్టబద్ధత, ఆందోళనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం... తదితర అంశాలపై చర్చకు విపక్షాలు ఎంత పట్టుపట్టినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. రైతుల (సాధికారత, రక్షణ)కు ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు–2020, రైతు ఉత్పత్తుల వ్యాపారం– వాణిజ్యం (ప్రొత్సాహం... సులభతరం) చట్టం–2020, నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం–2020... పేరిట 13 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద ఆర్డినెన్స్‌లను తెచ్చి... తర్వాత పార్లమెంటులో ఆమోదం పొందడటంతో... రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12న సుప్రీంకోర్టు ఈ మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళనలు విరమించలేదు. ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రైతులు నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. చట్టాల ఉపసంహరణ తర్వాతే ఆందోళన విరమిస్తామని రైతులు తెగేసి చెప్పడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కేంద్ర ప్రభుత్వమూ అంతే పట్టుదలకు పోవడంతో ఏడాదికాలంగా ఇది కొనసాగిన విషయం తెలిసిందే. చర్చకు విపక్షాల పట్టు సోమవారం మధ్యాహ్నం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ లోక్‌సభలో ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. చర్చకు పట్టుబట్టారు. రైతులను న్యాయం చేయాలని బ్యానర్లను ప్రదర్శిస్తూ... నినాదాలు చేశారు. విపక్షసభ్యులు ఆందోళనను విరమించి తమ స్థానాల్లోకి వెళితే... సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే బిల్లుపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. సభామోదం కోసం బిల్లును ప్రవేశపెట్టినపుడు చర్చకు ఎందుకు అనుమతించడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిరరంజన్ చౌదరి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం సభను తీవ్ర అలక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. విపక్ష ఎంపీల నినాదాల నడుమే స్పీకర్ బిల్లును మూజువాణి ఓటింగ్‌కు పెట్టి... ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఎంపీలందరూ సోమవారం సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందాక సభ వాయిదా పడింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సభ ప్రారంభమైనా... విపక్షాల నిరసనలతో 2 గంటల ప్రాంతంలో లోక్‌సభ మంగళవారానికి వాయిదాపడింది. చర్చ ఎందుకు?: తోమర్ మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు రూల్ –267 కింద సభా కార్యాకలాపాలను పక్కనబెట్టి... రైతు సమస్యలపై చర్చను చేపట్టాలని నోటీసులు ఇచ్చాయి. చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో నిరసనల మధ్య సభ వాయిదాపడింది. అనంతరం లోక్‌సభలో ఉపసంహరణ బిల్లు ఆమోదం పొందిందని రాజ్యసభకు తెలుపుతూ... నరేంద్ర తోమర్ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. అపై రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్) మాట్లాడుతూ... ఇటీవలి ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, ఐదు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడటంతో మోదీ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకుంటోందని పేర్కొన్నారు. ఆందోళనల్లో 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంతలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మీకిచ్చిన రెండు నిమిషాల సమయం ముగిసిపోయిందని ఖర్గేకు మైక్‌ను కట్ చేశారు. తోమర్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని తమ మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని తోమర్ విమర్శించారు. అందరూ వ్యవసాయ బిల్లుల ఉపసంహరణనే కోరుకుంటున్నపుడు ఇక చర్చ ఎందుకన్నారు. ఆందోళనల నడుమే బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని హరివంశ్ ప్రకటించారు. టీఎంసీ, ఆప్ డుమ్మా సోమవారం ఉదయం రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన విపక్షాల సమావేశానికి 11 పార్టీలు హాజరుకాగా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డుమ్మా కొట్టాయి. రచ్చ కాదు.. చర్చలే కొలమానం కావాలి ఎంత అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరిపిందనేదే పార్లమెంటు పనితీరుకు కొలమానం కావాలి. ఎంత దుందుడుకుగా వ్యవహరించి సభా కార్యక్రమాలకు అడ్డుతగిలామనేది ఒకరి పనితీరుకు కొల బద్ధ కారాదు. అన్ని అంశాలనూ చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిస్తాం. ప్రస్తుత సెషన్‌తో పాటు పార్లమెంటు ప్రతి సమావేశమూ జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై చర్చించాలని, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయులు స్ఫూర్తితో దేశాభివృద్ధికి పరిష్కారమార్గాలను అన్వేషించాలని ప్రజలు కోరుకుంటారు. దీర్ఘకాలిక ప్రభావం చూపే, సానుకూల నిర్ణయాలను ప్రస్తుత సమావేశాల్లో తీసుకోవడం జరుగుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో సభ పనితీరుయే కొలమానం కావాలి. దానికి ఎవరెంత మేరకు దోహదం చేశారనేది లెక్కలోకి రావాలి తప్పితే.. ఎవరెంత హంగామా చేసి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనేది ముఖ్యం కారాదు. పార్లమెంటు ఉత్పాదకతే ప్రామాణికం కావాలి. ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా ఎంత బలంగానైనా గళాలు వినిపించొచ్చు. అయితే సభా మర్యాదను, సభాపతుల స్థానాలకున్న గౌరవాన్ని కాపాడాలి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా పార్లమెంటు వ్యవహారశైలి ఉండాలి. – సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో ప్రధాని మోదీ జడిసే... చర్చ పెట్టలేదు పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా మూడు వ్యవసాయ చట్టాలకు ఉపసంహరించుకునే బిల్లును ఆమోదింపజేసుకోవడం మోదీ సర్కారు తీవ్ర భయభ్రాంతులకు లోనైందనే దానికి నిదర్శనం. తాము తప్పు చేశామని వారికి తెలుసు కాబట్టే చర్చ రాకుండా తప్పించుకున్నారు. ప్రధాని క్షమాపణ ఎందుకు చెప్పారు. రైతులకు అన్యాయం చేయకపోతే ఎందుకు మన్నించమని కోరారు? కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకనాడు ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పదని కాంగ్రెస్ ముందునుంచే చెబుతోంది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన ముగ్గురు నలుగురు బడా పెట్టుబడిదారులు... కర్షకుల, శ్రామికుల శక్తి ముందు నిలువలేరు. బిల్లుల ఉపసంహరణ రైతుల విజయం... దేశ విజయం. చర్చ జరగకపోవడం దురదృష్టకరం. ఈ బిల్లులు ప్రధాని వెనుకున్న శక్తుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మేము దానిపై చర్చ జరగాలని కోరుకున్నాం. కనీస మద్ధతు ధరపై, లఖీమ్‌పూర్ ఖేరీ దమనకాండపై, ఆందోళనల సందర్భంగా 700 మంది పైచిలుకు రైతులు ప్రాణాలు కోల్పోవడంపై చర్చించాలని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్చకు అనుమతించలేదు. చర్చకు జడుసుకుంది. వాస్తవాలను దాచేయాలని చూసింది. చర్చలకు వీల్లేకపోతే ఇక పార్లమెంటుకు అర్థమేముంది. చర్చలకు అనుమతించకపోతే పార్లమెంటును మూసేయడమే మంచిది. దేశ భవిష్యత్తుకు హానికరమైన శక్తులు ప్రధాని వెనకుండి నడిపిస్తున్నాయి. వారెవరో గుర్తించాలి. – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ -
కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చండి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతులు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై ఇంకా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చాలని, లఖీమ్‌పూర్ ఖేరి హింసలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేవరకు వారి పోరాటం ఆగదని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుకుని ఉండి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారని వ్యాఖ్యానించారు. మోదీకి రాసిన లేఖను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రైతులు చేస్తున్న డిమాండ్లన్నీ నెరవేర్చేవరకు వారి ఉద్యమం ఆగదు. ఇప్పటికీ వారిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. అవి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటకి వస్తాయి. అందుకే కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి’ అన్నారు. గత ఏడాదిగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని వరుణ్ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఇవే.. ► కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలి. ► సంప్రదాయ ఆహార పంటల్ని కొనుగోలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి ► మండీ వ్యవస్థను పరిరక్షించాలి ► విద్యుత్(సవరణ) బిల్లు–2020ను వెనక్కి తీసుకోవాలి. ► పంట వ్యర్థాల్ని తగలబెడుతున్నందుకు రైతులకు విధిస్తున్న జరిమానాలు, జైలు శిక్షలకు ఇకపై స్వస్తి పలకాలి. -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
Bitcoin:బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత!
శాన్ శాల్వడార్ (ఎల్ శాల్వడార్): క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ శాల్వడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ శాల్వడార్ నిల్చింది. ఎలాంటి లావాదేవీలకైనా ఈ డిజిటల్ కరెన్సీని ఉపయోగించవచ్చని, టెక్నాలజీ లేని సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్‌కాయిన్ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఎల్ శాల్వడార్ వెల్లడించింది. అయితే, తమ దేశానికి అమెరికా డాలరే అధికారిక కరెన్సీగా కొనసాగుతుందని, బిట్‌కాయిన్ రూపంలో చెల్లింపులు జరపాలంటూ బలవంతమేమీ ఉండదని పేర్కొంది. ఈ క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరపడం కోసం ప్రజలకు శిక్షణ కూడా కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అధికారికంగా ప్రకటించాక 90 రోజుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, నవకల్పనలు, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడగలదని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్ మారకం విలువపరంగా ఎవరూ నష్టపోయే రిస్కులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ఎమ్ఎస్పీకి చట్టబద్ధతే పరిష్కారం
నాటి కాంగ్రెస్ పాలకులు స్వార్థంకొద్దీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ వ్యతిరేక ఎమర్జెన్సీకి దీటుగా మరొక ‘ఎమర్జెన్సీ’ రావొచ్చునని బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ప్రకటించడంతో అడ్వాణీయే సైడ్‌లైన్ కావలసి వచ్చింది. ఇక ఇప్పుడు ‘కరోనా’ మహమ్మారి ముసుగులో అసలు పార్లమెంట్‌ని కాస్తా ‘రబ్బరు స్టాంప్’ హోదా కిందికి పాలకులు మార్చారు. సెలెక్ట్ కమిటీలకు, న్యాయ వ్యవస్థకు తగిన విలువ లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ పౌర జీవనాన్ని పౌరుల ఎరుకలో లేని అజ్ఞాత శక్తులు శాసించే దశ ప్రవేశించింది. ఈ దుర్దశ చివరికి అంతర్జాతీయ స్థాయికి పాకి చిన్న వయస్సులోనే పెద్దబుద్ధితో ప్రవేశించిన పర్యావరణ, పౌర చైతన్యమూర్తులయిన ధన్‌బర్గ్, దిశా రవిలను కూడా చుట్టుముట్టింది. అందుకే ‘భారతదేశమా..! ఎటు నీ ప్రయాణం ఇంతకూ’ అని మరొక్కసారి ప్రశ్నించుకోవలసి వస్తోంది. ‘‘మన దేశంలో ఇటీవల కాలంలో నిర్దేశిత కీలక రాజ్యాంగ విలువలు కాస్తా ఊడ్చుకుపోతున్నాయి. రాజ్యాంగ విలువలకు ప్రాణప్రదమైన సెక్యులరిజం (లౌకిక విధానం) అన్న పదమే ప్రభుత్వ పదజాలం నుంచి దాదాపుగా కనుమరుగై పోయింది. ఈ పదం నిజ స్వభావాన్ని, దాని ఆంతరంగిక శక్తిని రాజకీయ, సామాజిక శక్తులు గుర్తించలేకనో లేదా గుర్తించినా పాటించడంలో విఫలం కావడం వల్లనో సెక్యులరిజాన్ని భ్రష్టు పట్టించారు. ఇందుకు మారుగా సెక్యులర్ రాజ్యాంగానికి విరుద్ధమైన భావాలనూ, ఆచారాలను పోషిస్తూ వచ్చారు’. – భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ (న్యాయచరిత్ర: బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్) ‘‘ఇటీవల ప్రభుత్వ చర్యలు దేశంలో పత్రికా రచనా వ్యవస్థపైనేగాక యావత్తు సమాచార వ్యవస్థనే దెబ్బతీసేవిగా ఉన్నాయి. క్రమంగా ఇది ప్రజాస్వామ్యం కనుమరుగై పోవడమే’’ – పన్నీర్ సెల్వన్ ‘హిందు’ రీడర్స్ ఎడిటర్ (15.2.21) భారత్ సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణ కోసం తపన పడుతున్న బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఇరువురు మేధావులు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత నేడు ఆందోళనతో వెలిబుచ్చుతున్న పై అభిప్రాయాలు మనకు ఏం సందేశం ఇస్తున్నాయి? వారు ప్రకటిస్తున్న ఆందోళనకు తాజా ప్రతిరూపమే– గత వంద రోజులుగా భారత రాష్ట్రాలలో యావత్తు రైతాంగ ప్రజలూ.. బడా పెట్టుబడిదారులకు రైతాంగ మౌలిక ప్రయోజనాలనే తాకట్టుపెట్టేందుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు చట్టాలను ప్రతిఘటిస్తూ ఈ రోజుకీ జరుపుతున్న మహోద్యమం. దేశీయంగా రాష్ట్రాలలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్కరణలు రైతాంగ ప్రయోజనాలకు నష్టదాయకంగా ఉండరాదని భావించే వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు.. ఇప్పటికి సుమారు రెండు వందలమంది రైతాంగ సత్యాగ్రహ కార్యకర్తల బలిదానానికి నిరసనగా తమవంతుగా సంఘీభావం వ్యక్తం చేశారు. అయినా కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో తాను తీసుకొచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడానికి కేంద్రం ఎందుకు భీష్మిస్తోంది? రైతాంగం తాము పండించిన పంట లకు నిర్ణయించే కనీస ధరకు చట్టరూపేణా భద్రత కల్పించమని కోరింది. సరిగ్గా ఈ దేశ ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ బతికి బట్ట కట్టడానికి ఆదరువుగా ఉన్న రైతాంగం కోరుతున్న ఈ కనీస కోర్కెను ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తున్నట్టు? ‘కనీస ధర’కు మేం వ్యతిరేకం కాదని ఒకవైపు ప్రకటిస్తున్న పాలకులు దానికి చట్టబద్ధత కల్పించ డాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కనీస మద్దతు ధరను ‘చట్టం’గా ప్రకటించకుండా పాలకుల చేతుల్ని అడ్డుకునేదెవరో, అడ్డుకుంటున్న దెవరో? స్వాతంత్య్రానికి ముందే (1933లో) పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాబోయే పరిణామాలను ఊహించి ఇలా హెచ్చరించాడు: ‘‘ప్రత్యేక హక్కులను, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ, గ్రూపులూ తమ హక్కులను తాముగా స్వచ్ఛందంగా వదులుకున్నట్లు చరిత్రకు దాఖలా లేదు. సాంఘికంగా మార్పులు రావాలంటే ఒత్తిడి, అవసరాన్ని బట్టి బలప్రయోగమూ తప్పనిసరిగా అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం.. ఈ స్వార్థ ప్రయోజనాలకు భరత వాక్యం పలకడమే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థపర వర్గాల ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్ర స్వాతంత్య్రం కూడా కాదు.’’ సరిగ్గా 89 ఏళ్ల నాటి ఈ అంచనాకు వీసమెత్తు తేడా లేకుండా మధ్య మధ్యలో ‘ఉదారం’గా ఉన్నట్టు నాటకమాడినా తరువాత స్వాతంత్య్రానంతరం క్రమంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వమూ, ఆ తరువాత వచ్చిన బీజేపీ–ఆరెస్సెస్ పాలనా యంత్రాంగమూ అను సరిస్తూ వచ్చిందీ, వస్తున్నదీ–వీసమెత్తు తేడా లేకుండా బడా పెట్టు బడిదారీ శక్తుల మౌలిక ప్రయోజనాల రక్షణ కోసమే. అందులో భాగంగానే రైతాంగం కోరుతున్న ‘పంటల కనీస ధరకు చట్టరీత్యా’ గ్యారంటీ ఇవ్వబోమన్నది కేంద్ర ప్రభుత్వం. మరొకమాటగా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పాలంటే–వెనకనుంచి ‘తోలుబొమ్మ’ ఆట ఆడించే బడా వ్యాపార వర్గాలు లేకపోతే బీజేపీ పాలకుల చేతులను కట్టిపడవేస్తున్న వాళ్లెవరు? నిజానికి బీజేపీ పాలకుల ప్రయోజనాల రక్షణ కోసమే కాంట్రాక్టు లేదా కార్పొరేట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రవేశపెట్టించగోరారు. రైతాంగం అందుకు వ్యతిరేకించి ‘ససేమిరా’ అని ప్రాణ త్యాగాలకు సిద్ధమైనప్పుడు మాత్రమే ‘లాలూచీ బేరం’గా– ‘మాకు కార్పొరేట్ వ్యవసాయం పెట్టాలన్న ఉద్దేశం లేదు, మాకు ఆ రంగంతో సంబంధం లేద’ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో ఆ రహస్యం ప్రభుత్వానికి తెలియాలి, ఆదానీ అంబానీలకు కూడా తెలియాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలి ఘడియల్లోనే టాటా–బిర్లాలు ఏకమై దేశీయ బడా పెట్టుబడిదారీ వర్గం జాయింట్‌గా జాతీయ పథకం రచించింది. దాని పేరే ప్రసిద్ధ బొంబాయి (బాంబే) ప్లాన్. దాని లక్ష్యం స్థూలంగానూ, సూక్ష్మంగానూ కూడా భారతదేశంలో పక్కా పెట్టుబడి దారీ వ్యవస్థ స్థాపనకు నాంది పలకడమే! అంటే నాడే దేశానికి దశా–దిశా నిర్దేశించిన పక్కా ప్రణాళిక అది. ఆ తరువాత ఎవరెన్ని కబుర్లు చెప్పినా కాంగ్రెస్ (తర్వాత కాంగ్రెస్–యూపీఏ), ఆ పిమ్మట బీజేపీ (ఆరెస్సెస్–ఎన్డీఏ) సంకీర్ణ ప్రభుత్వాలు అనుసరించింది కూడా ఆచరణలో... నాటకంలో ‘విదూషకుల’ పాత్రేనని మాత్రం మనం మరచి పోరాదు. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీకి చెందిన పాలకులు తొలి అయిదేళ్లలోనూ ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుల విధానం– రాజ్యాం గవిహితమైన రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని పూర్తిగా హరించివేస్తూ వచ్చింది. క్రమంగా సెక్యులర్ రాజ్యాంగానికి అడుగడుగునా ఉల్లంఘ నలు ఎదురయ్యాయి, 1975–77 నాటి కాంగ్రెస్ పాలకులు స్వార్థం కొద్దీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ వ్యతిరేక ఎమర్జెన్సీకి దీటుగా మరొక ‘ఎమర్జెన్సీ’ రావొచ్చునని బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ప్రకటించడంతో తర్వాత అడ్వాణీ తానే సైడ్‌లైన్ కావలసి వచ్చింది. ఇక ఇప్పుడు ‘కరోనా’ మహమ్మారి ముసుగులో అసలు పార్లమెంట్‌ను కాస్తా ‘రబ్బరు స్టాంప్’ హోదా కిందికి మన పాలకులు మార్చారు. సెలెక్ట్ కమిటీలకు, న్యాయ వ్యవస్థకు ఇప్పుడు తగిన విలువ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ పౌర జీవనాన్ని పౌరుల ఎరుకలో లేని అజ్ఞాత శక్తులు శాసించే దశ ప్రవేశించింది. ఈ దుర్దశ చివరికి అంతర్జాతీయ స్థాయికి పాకి చిన్న వయస్సులోనే పెద్దబుద్ధితో ప్రవేశించిన పర్యావరణ, పౌర చైతన్యమూర్తులయిన ధన్‌బర్గ్, దిశా రవిలను కూడా చుట్టుముట్టింది. అందుకే ‘భారతదేశమా..! ఎటు నీ ప్రయాణం ఇంతకూ?’ అని మరొక్కసారి ప్రశ్నించుకోవలసి వస్తోంది. సామెత ఎందుకు పుట్టిందోగానీ– ‘పాలకుడు ప్రజా సేవలో నీతి తప్పితే, నేల సారం తప్పుతుందట!’ ‘ప్రజాస్వామ్యం’ పేరు చాటున ప్రస్తుత భారత రాజకీయాల్లో ఎన్నితంతులు? ఎన్ని డ్రామాలు? అనుభవానికి ప్రత్యక్ష సాక్షులుండరు గదా!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కొత్త కమిషనరేట్లకు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్లకు చట్టబద్ధత కల్పిస్తూ న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర పడింది. చట్ట రూపం పొందిన ఈ బిల్లులకు సంబంధించి న్యాయ శాఖ శుక్రవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం విడివిడిగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు, వ్యాట్ సవరణలకు సంబంధించిన రెండు బిల్లులు, కొత్త జిల్లాల ఏర్పాటు సవరణ బిల్లుల నోటిఫికేషన్లు వీటిలో ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించిన రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
మాదిగ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఘట్కేసర్ టౌన్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ, మాదిగ ఉప కులాల జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయాలని మాదిగ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధారి లక్ష్మీనారాయణ, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మాదిగ జేఏసీ కార్యాలయంలో బుధవారం చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తెలుగు ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ మండల కన్వీనర్ శ్రీనివాస్, నల్లగొండ జిల్లా నాయకులు అంజయ్య, మైసయ్య, గూర్జకుంట నర్సింహ, కడుపోళ్ల మల్లేష్, నాగులపల్లి శ్రీనివాస్, నల్లగారి నర్సింహ, యాదగిరి, సుంకం గణపతి, ములుగురం పాండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
భూసమీకరణకు చట్టబద్ధత లేదు
మంగళగిరి రూరల్ : భూసమీకరణకు చట్టబద్ధత లేదని, భూములను ప్రభుత్వం లాక్కుంటుందని రైతులు ఆందోళన చెంది మానసికంగా కుంగిపోవద్దని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో మంగళవారం మహిళా రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మా భూములను ప్రభుత్వం తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటాం. ప్రభుత్వం భూములు తీసుకుంటుందని తెలిసినప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా పోయింది’ అని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ భూముల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. భూములున్న రైతులతో సంప్రదించకుండా చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు అన్నదాతల్లో మరింత ఆందోళన పెంచుతోందన్నారు. రైతుల వద్ద లాక్కున్న భూములను కార్పొరేట్ల చేతికి అప్పగించి చంద్రబాబు ఆర్థికంగా లబ్ధిపొందాలని చూస్తున్నాడనే భావన రైతుల్లో నెలకొందన్నారు. స్వయానా ఉప ముఖ్యమంత్రే రాజధాని భూముల సమీకరణకు రెండేళ్లపైగా పడుతుందని చెబుతున్నారని.. ఇప్పుడే రైతుల వద్ద భూములు తీసుకుని రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారని ఆర్కే ప్రశ్నించారు. అసలు రాజధాని భూముల విషయంలో చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల మాటలు తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో కాని, గజిట్ కాని రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆసక్తిగా ఉన్న రైతుల భూములను తీసుకుని రాజధాని నిర్మాణం సాగించాలని, అలాచేయకుండా అధికార పార్టీ పెద్దలు భూములు ఇవ్వమని ఘంటాపథంగా చెబుతున్న గ్రామాల్లో తమ పార్టీ వారితోపాటు రైతుల్లో చీలికతెచ్చి గందరగోళం స్పృష్టించి వారిలో అభద్రతాభావం కల్పించే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. బాధిత రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు మద్దతుగా తగు న్యాయం జరిగేవరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని చెప్పారు. అవసరమైతే రైతులతో ఢిల్లీ చేరుకుని పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వెనుకాడబోమని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పచ్చల శ్యాంబాబు, మండెపూడి యోహాను, ఉయ్యూరు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ గాదె లక్ష్మారెడ్డి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ప్రభుత్వం రియల్ దందా చేస్తుంది