మంగళగిరి రూరల్ : భూసమీకరణకు చట్టబద్ధత లేదని, భూములను ప్రభుత్వం లాక్కుంటుందని రైతులు ఆందోళన చెంది మానసికంగా కుంగిపోవద్దని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో మంగళవారం మహిళా రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘మా భూములను ప్రభుత్వం తీసుకుంటే ఆత్మహత్యలు చేసుకుంటాం. ప్రభుత్వం భూములు తీసుకుంటుందని తెలిసినప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా పోయింది’ అని అన్నారు.
ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ భూముల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. భూములున్న రైతులతో సంప్రదించకుండా చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు అన్నదాతల్లో మరింత ఆందోళన పెంచుతోందన్నారు. రైతుల వద్ద లాక్కున్న భూములను కార్పొరేట్ల చేతికి అప్పగించి చంద్రబాబు ఆర్థికంగా లబ్ధిపొందాలని చూస్తున్నాడనే భావన రైతుల్లో నెలకొందన్నారు.
స్వయానా ఉప ముఖ్యమంత్రే రాజధాని భూముల సమీకరణకు రెండేళ్లపైగా పడుతుందని చెబుతున్నారని.. ఇప్పుడే రైతుల వద్ద భూములు తీసుకుని రాజధానిని ఎప్పుడు నిర్మిస్తారని ఆర్కే ప్రశ్నించారు. అసలు రాజధాని భూముల విషయంలో చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల మాటలు తప్ప ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో కాని, గజిట్ కాని రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆసక్తిగా ఉన్న రైతుల భూములను తీసుకుని రాజధాని నిర్మాణం సాగించాలని, అలాచేయకుండా అధికార పార్టీ పెద్దలు భూములు ఇవ్వమని ఘంటాపథంగా చెబుతున్న గ్రామాల్లో తమ పార్టీ వారితోపాటు రైతుల్లో చీలికతెచ్చి గందరగోళం స్పృష్టించి వారిలో అభద్రతాభావం కల్పించే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.
బాధిత రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు మద్దతుగా తగు న్యాయం జరిగేవరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని చెప్పారు. అవసరమైతే రైతులతో ఢిల్లీ చేరుకుని పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వెనుకాడబోమని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పచ్చల శ్యాంబాబు, మండెపూడి యోహాను, ఉయ్యూరు వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ గాదె లక్ష్మారెడ్డి, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
భూసమీకరణకు చట్టబద్ధత లేదు
Published Wed, Nov 26 2014 1:31 AM | Last Updated on Mon, May 28 2018 3:33 PM
Advertisement
Advertisement