ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్
జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలతో ప్రత్యేక అధికారాలు
ఆ చట్టంలోని 374–ఏను సవరిస్తూ 374–బీ ఏర్పాటు
కార్పొరేషన్, కమిషనర్‌పై ప్రభుత్వానికి పూర్తి అధికారం
ఆక్రమణలను అడ్డుకొనేందుకు ఈ ఏజెన్సీకి అధికారమిస్తూ నిర్ణయం
తక్షణమే అమల్లోకి కొత్త చట్టం.. ∙వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్‌కు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా)కు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనితో ఇకపై ‘హైడ్రా’ చేపట్టబోయే కార్యకలాపాలకు చట్టబద్ధత లభించనుంది. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారని అధికారవర్గాలు తెలిపాయి.
తక్షణమే అమల్లోకి..
హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ.. చెరువులు, కుంటలు, పార్కులు, ఆటస్థలాలు వంటివి కబ్జా అవకుండా కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్వోసీ జారీచేయడం తదితర లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జీవో ఎంఎస్ నంబర్ 99 ద్వారా ‘హైడ్రా’ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తున్నప్పటికీ.. తాజాగా ఆర్డినెన్స్ ద్వారా కీలక అధికారాలను అప్పగించారు. ఈ సవరించిన జీహెచ్‌ఎంసీ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్నట్టు వెల్లడించారు.
ప్రపంచంలో ఉత్తమ నివాసయోగ్య నగరంగా..
రాష్ట్రంలో పన్ను రాబడి, జీఎస్డీపీలో మూడో వంతు ఆదాయ వనరు అయిన హైదరాబాద్ ప్రపంచంలోని ఉత్తమ నివాస యోగ్య నగరాల్లో ఒకటిగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు గుర్తించాయని గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో, ఈజ్ ఆఫ్ లివింగ్‌తోపాటు ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాల్లో హైదరా బాద్ పేరెన్నికగన్నదని తెలిపింది. వివిధ ప్రగతిశీల విధానా ల ద్వారా ఈ ఆకర్షణను కొనసాగించడానికి హైదరాబాద్ పాలనా యంత్రాంగం ప్రయత్నిస్తోందని వివరించింది.
ప్రత్యేక ఏజెన్సీ ఆవశ్యకత ఉందంటూ..
ఇటీవలి భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ నగరం దుర్భల పరిస్థితికి అద్దం పట్టాయని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఆకస్మిక పరిస్థితులు, విపత్తుల కోసం ప్రత్యేక ఏజెన్సీల అవసరం ఉందని.. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నిర్వహణ కోసం సమర్థమైన స్థితిస్థాపక వ్యవస్థలను అమలు చేయడానికి ఈ ఏజెన్సీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. జీహెచ్‌ఎంసీ మరింత విస్తృతంగా పనిచేయడానికి, అధికారాలను బలోపేతం చేయడానికి ఈ ఏజెన్సీల ఆవశ్యకత ఎంతో ఉందని వివరించింది. ఆక్రమణలకు గురయ్యే చెరువులు, కుంటలు వంటి నీటి వనరులు, గ్రీనరీ, బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ ఆస్తులు మొదలైన విలువైన వాటి రక్షణకు సంబంధించి ప్రత్యేక ఏజెన్సీ అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీకి అవసరమైన సామర్థ్యాన్ని అందించడానికి ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్టం–1955’కు అవసరమైన సవరణలు చేయడం తప్పనిసరని తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ను ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) ఆర్డినెన్స్– 2024’గా పేర్కొంది.
కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్
ఆర్డినెన్స్‌తో జీహెచ్‌ఎంసీ చట్టం–1955లో కొత్తగా 374–బీ సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. కార్పొరేషన్, ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది. కార్పొరేషన్, కమిషనర్‌లకు సంబంధించిన అధికారాలను ఎవరైనా అధికారికి, లేదా ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కే పరిమితమైన అధికారాలన్నీ ఇకపై ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. తద్వారా రోడ్లు, డ్రెయిన్లు, వీధులు, జల వనరులు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్కులు మొదలైన ఆస్తుల పరిరక్షణ వంటివాటి ఆక్రమణలు, విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment