న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ రైతులు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై ఇంకా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ శనివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతుల కనీస మద్దతు ధర డిమాండ్ నెరవేర్చాలని, లఖీమ్‌పూర్ ఖేరి హింసలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని ఆయన కోరారు. రైతుల డిమాండ్లు నెరవేర్చేవరకు వారి పోరాటం ఆగదని పేర్కొన్నారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ముందే తీసుకుని ఉండి ఉంటే 700 మంది రైతుల ప్రాణాలను కాపాడగలిగేవారని వ్యాఖ్యానించారు. మోదీకి రాసిన లేఖను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘రైతులు చేస్తున్న డిమాండ్లన్నీ నెరవేర్చేవరకు వారి ఉద్యమం ఆగదు. ఇప్పటికీ వారిలో ఆగ్రహావేశాలు ఉన్నాయి. అవి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో బయటకి వస్తాయి. అందుకే కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి’ అన్నారు. గత ఏడాదిగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తలా రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని వరుణ్ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలన్నారు.
రైతులు చేస్తున్న డిమాండ్లు ఇవే..
► కనీస మద్దతు ధరకి చట్ట బద్ధత కల్పించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేయాలి.
► సంప్రదాయ ఆహార పంటల్ని కొనుగోలు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి
► మండీ వ్యవస్థను పరిరక్షించాలి
► విద్యుత్(సవరణ) బిల్లు–2020ను వెనక్కి తీసుకోవాలి.
► పంట వ్యర్థాల్ని తగలబెడుతున్నందుకు రైతులకు విధిస్తున్న జరిమానాలు, జైలు శిక్షలకు ఇకపై స్వస్తి పలకాలి.
Comments
Please login to add a commentAdd a comment