
పంటలకు కనీస మద్దతు ధర విషయంలో రాహుల్ ఉద్ఘాటన
విపక్షనేతతో భేటీ అయిన రైతుసంఘాల నేతలు
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సాధన కోసం మోదీ సర్కార్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తామని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు. బుధవారం పార్లమెంట్ భవన కాంప్లెక్స్‌లో రాహుల్‌ను రైతు సంఘాల నేతలు కలిశారు.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన 12 మంది రైతునేతల బృందం రాహుల్‌తో సమావేశమై రైతాంగ సమస్యలపై చర్చించారు. ‘‘ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మా మేనిఫెస్టోలో ప్రస్తావించాం. పూర్తిస్థాయి సమీక్ష తర్వాతే ఇది ఆచరణ సాధ్యమని చెప్పాం. ఈ విషయమై రైతునేతలతో కాంగ్రెస్ చర్చించింది. ఇక ‘ఇండియా’ కూటమి నేతలతో సమాలోచనల జరిపి ఎంఎస్‌పీ చట్టబద్ధత కోసం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తాం’ అని భేటీ తర్వాత రాహుల్ చెప్పారు.