రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్లకు చట్టబద్ధత కల్పిస్తూ న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్లకు చట్టబద్ధత కల్పిస్తూ న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర పడింది. చట్ట రూపం పొందిన ఈ బిల్లులకు సంబంధించి న్యాయ శాఖ శుక్రవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం విడివిడిగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు, వ్యాట్ సవరణలకు సంబంధించిన రెండు బిల్లులు, కొత్త జిల్లాల ఏర్పాటు సవరణ బిల్లుల నోటిఫికేషన్లు వీటిలో ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించిన రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.