commissionerates
-
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ మురళీధర్ భగవత్ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్ సీపీని ఇన్చార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు గత వారం సైబరాబాద్ కమిషనర్ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్చార్జ్ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్చార్జ్ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు రూపొందించే పెరిస్కోప్ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో (ఐఎస్బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులతో సైబరాబాద్ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. -
Hyderabad: అదనపు డీజీ అయినా నో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15, జనవరి 26న దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందనం ఉంటుంది. సంబంధిత కార్యాలయ అధిపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదనపు డీజీ స్థాయిలో ఉండే నగర పోలీసు కమిషనర్‌కు మాత్రం ఆ చాన్స్ ఉండదు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు మాత్రం అప్పుడప్పుడు అవకాశం చిక్కుతుంటుంది. నగర కొత్వాల్‌కు ఉండే కీలకమైన బాధ్యతే అందుకు కారణం. ► హైదరాబాద్ కమిషనరేట్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండలకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్థాయి అధికారి కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆ రెండు కమిషనరేట్లకూ ఏడీజీలే కమిషనర్లుగా ఉన్నారు. ► రాష్ట్ర డీజీపీకి సైతం లేని విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సహా వివిధ ప్రత్యేక అధికారాలు ఈ ముగ్గురు కమిషనర్లకూ ఉంటాయి. కీలక హోదా కలిగిన ఈ ముగ్గురికీ జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. మిగిలిన ఇద్దరికీ అప్పుడప్పుడూ ఆ చాన్స్ దొరుకుతుంది. ► జీహెచ్ఎంసీలో ప్రధాన కమిషనర్, కలెక్టరేట్లలో కలెక్టర్లు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, జలమండలిలో దాని ఎండీ.. ఇలా వాటి అధిపతులే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కమిషనరేట్లలో మాత్రం ఇతర అధికారులకే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► హైదరాబాద్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.సుధారాణి, సైబరాబాద్‌లో మహిళా భద్రత విభాగం డీసీపీ సి.అనసూయ ఆదివారం జెండా వందనం చేశారు. రాచకొండలో మాత్రం కమిషనర్ మహేష్ భగవత్ ఎగరేశారు. ఇలానే అప్పుడప్పుడు సైబరాబాద్ కమిషనర్ కూడా జెండాను ఆవిష్కరిస్తుంటారు. హైదరాబాద్ కొత్వాల్ మాత్రం ఎగరేసిన దాఖలాలు లేవు. ► ఆయనకు కీలక బాధ్యతల కారణం హైదరాబాద్ కమిషనర్‌కు జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. గణతంత్ర వేడుకలైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా నగరంలో అధికారిక ఉత్సవాలు జరుగుతాయి. వీటికి జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న సీఎం (ఈ రెండు సందర్భాల్లో ఇద్దరూ హాజరైనా అధికారికంగా గౌరవ వందనం స్వీకరించేది ఒకరే) హాజరవుతారు. వారితో పాటే మంత్రులు, అత్యున్నత అధికారులూ వస్తారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ► ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు విభాగంలోని ఇతర ఉన్నతాధికారుల కంటే కమిషనర్‌కే ఎక్కువ. ► ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్నందువల్లే హైదరాబాద్ కమిషనర్‌కు ఎప్పుడూ తన కార్యాలయంలో జెండా ఎగురవేసే అవకాశం చిక్కదు. -
పేరుకే కమిషనరేట్!
పేరు గొప్ప.. ఊరు దిబ్బ..! సరిగ్గా ఇదే పరిస్థితిని రాజధాని బెజవాడ పోలీసు కమిషనరేట్ ఎదుర్కొంటోంది. పాలనా కేంద్రంగా మారినా అనుకున్న స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అటు సీపీ నుంచి ఇటు హోంగార్డు దాకా షిప్టులను వదిలేసి పనివెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది లేమితో అల్లాడుతోంది. నలువైపుల నుంచి ఎదురవుతున్న పని ఒత్తిళ్లతో పోలీసు కమిషనర్ పాలనాంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. హైదరాబాద్ స్థాయిని మించి విజయవాడ పోలీసులను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడలో పోలీసింగ్ ప్రమాణాలపై ఎవరెంత ఊదరగొడుతున్నా వాస్తవంలోకి వస్తే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయనేది అందరూ అంగీరించాల్సిన విషయం. పెను భారంగా మారిన సిబ్బంది కొరత.. కమిషనరేట్ పరిధిలో 5 జోన్లు ఉండగా.. మొత్తం 22 పోలీసు స్టేషన్లు, 4 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. 1,200 మంది ఏఆర్ సిబ్బందితో కలుపుకొని సుమారు 3 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో విజయవాడ భాగమవడం.. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు ఇక్కడే ఉండటంతో కమిషనరేట్ పరిధిలో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. ప్రముఖుల బందోబస్తు పనులతో సిబ్బందికి తీరిక లేకుండా పోతోంది. ప్రధానంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వీఐపీల భద్రత కమిషనరేట్‌పై బాధ్యత చాలా ఎక్కువగా ఉంటోంది. ఇక సివిల్ పోలీసులకు సంబంధించి చూస్తే.. కొన్ని స్టేషన్లలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై పని భారం పడుతోంది. మాటలతో సరిపెట్టిన సర్కారు.. ఎన్నో సవాళ్లు, సమస్యల మధ్య అదనపు డీజీపీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారికి విజయవాడ కమిషనరేట్ పగ్గాలు అప్పగించింది ప్రభుత్వం. 2015 మే నెల నుంచి సీఆర్డీఏ (రాజధాని) పోలీసు కమిషనరేట్ ఆవిర్భవిస్తుందని అందరూ అనుకున్నారు. కృష్ణా, గుంటూరు, విజయవాడలతో కలిపి 8,603.32 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, సుమారు వంద పోలీసు స్టేషన్లతో రాజధాని కమిషనరేట్‌ను విస్తరిస్తారన్న ప్రకటన నాలుగున్నరేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇప్పటిదాకా విజయవాడ కమిషనరేట్ పరిధి అనూహ్యంగా విస్తరిస్తుంది. అదేస్థాయిలో శాంతిభద్రతలు, పరిపాలన సమన్వయం సీపీకి పెను సవాలుగా మారింది. రాజధానికి తగిన స్థాయిలో పోలీసు దళాలను సిద్ధం చేయడం, పరిపాలనను సమన్వయం చేయడం కత్తిమీద సాముగా మారింది. మరో 1,800 మంది సిబ్బంది అవసరం.. బెజవాడ పోలీసు కమిషనరేట్‌లో కలవరపరిచే నేరాలు, మరోవైపు కళ్లు తిరిగే ట్రాఫిక్ రద్దీ పోలీసు బాస్‌కు పెను సవాలుగా మారింది. అమరావతి రాజధాని ప్రకటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన విజయవాడలో జనాభా పెరిగింది. ముఖ్యమంత్రి, కేబినెట్, ఐఏఎస్ గణం బెజవాడలో మకాం వేసింది. జాతీయ, అంతర్జాతీయ గోష్ఠులు, ప్రముఖులు రాకపోకలతో నిత్యం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి రోజూ 1,100 మంది పోలీసులు రాజధాని ప్రాంతంలో పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్ విజయవాడ కానుండటంతో విజయవాడ కమిషనరేట్ స్థాయిలో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందని నగర సీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మరో 1,800 మంది పోలీసు సిబ్బందిని నియమించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన రాలేదని తెలుస్తోంది. -
పరిధుల ప్రభావం ప్రజలపై వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘రాజధానిలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనప్పటికీ ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్ ఉండాలి’అని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చరిత్రలో తొలిసారిగా డీజీపీ మూడు కమిషనరేట్ల అధికారులతో భేటీ అయ్యారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో బుధవారం ‘యూనిఫాం సర్వీస్ డెలివరీ.. వన్ సిటీ–వన్ సర్వీస్–వన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది సిటిజన్’పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి అధికారులు, సిబ్బందికి కొన్ని కీలక సూచనలు చేయడంతో పాటు అనేక ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేరరహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవల్ని కోరుకుంటారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ప్రతి పోలీసునూ మార్చాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్స్పెక్టర్లదని డీజీపీ స్పష్టం చేశారు. మూడు కమిషనరేట్లలోని ఏ ఠాణాకు వెళ్లినా ప్రజలకు ఒకే రకమైన స్పందన కనిపించాలని, బాధితుల సామాజిక–ఆర్థిక–వ్యక్తిగత హోదాల ఆధారంగా ఈ స్పందన మారకూడదని సూచించారు. సహయం కోరుతూ వచ్చిన బాధితులు/ప్రజలతో పోలీసుల వ్యవహారశైలి సక్రమంగా లేకుంటే ఆ ప్రభావం పోలీసు విభాగం మొత్తమ్మీద ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో మాదిరిగా మిగిలిన రెండింటిలోనూ టెక్నాలజీ వినియోగం పెరగాలని, ఫలితంగా నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర రహిత సమాజం ఆవిష్కరించే ప్రయత్నాల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని డీజీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రారంభించిన నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాలు వంటి ప్రాజెక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు మిగిలిన చోట్లా అమలు కావాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్న పోలీసు అధికారుల్ని డీజీపీ అభినందించారు. ప్రభుత్వం పోలీసు విభాగానికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తోందని, ప్రజలకు మేలైన సేవలు అందిస్తేనే సార్థకత ఉంటుందని సూచించారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న అనేక చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు ప్రజల మన్నన పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ముద్రించిన ప్రతిని డీజీపీ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు డీజీ జితేందర్, హైదరాబాద్ ఇన్చార్జ్ సీపీ డీఎస్ చౌహాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ ఎం.భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొత్త కమిషనరేట్లకు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్లకు చట్టబద్ధత కల్పిస్తూ న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర పడింది. చట్ట రూపం పొందిన ఈ బిల్లులకు సంబంధించి న్యాయ శాఖ శుక్రవారం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం విడివిడిగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు, తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటు, వ్యాట్ సవరణలకు సంబంధించిన రెండు బిల్లులు, కొత్త జిల్లాల ఏర్పాటు సవరణ బిల్లుల నోటిఫికేషన్లు వీటిలో ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించిన రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.