శాన్ శాల్వడార్ (ఎల్ శాల్వడార్): క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ శాల్వడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ శాల్వడార్ నిల్చింది. ఎలాంటి లావాదేవీలకైనా ఈ డిజిటల్ కరెన్సీని ఉపయోగించవచ్చని, టెక్నాలజీ లేని సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్‌కాయిన్ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఎల్ శాల్వడార్ వెల్లడించింది.
అయితే, తమ దేశానికి అమెరికా డాలరే అధికారిక కరెన్సీగా కొనసాగుతుందని, బిట్‌కాయిన్ రూపంలో చెల్లింపులు జరపాలంటూ బలవంతమేమీ ఉండదని పేర్కొంది. ఈ క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరపడం కోసం ప్రజలకు శిక్షణ కూడా కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అధికారికంగా ప్రకటించాక 90 రోజుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, నవకల్పనలు, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడగలదని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్ మారకం విలువపరంగా ఎవరూ నష్టపోయే రిస్కులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment