Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్‌కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్‌లో యూఎస్ డాలర్‌తో పాటుగా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్‌కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్‌కు సూచించింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్.
చదవండి: బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత! ఎలాగంటే..
ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్‌కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment