అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలిచాక క్రిప్టో కరెన్సీకి (cryptocurrency) కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం పేర్కొంది.
ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న మూలాల ప్రకారం.. ఈ ఉత్తర్వులు క్రిప్టోకరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టోకరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కాయిన్‌బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టోకరెన్సీ పరిశ్రమ నుండి గణనీయమైన మద్దతును పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్‌లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైంది
జాతీయ బిట్‌కాయిన్ నిధి
యూఎస్‌లో జాతీయ బిట్‌కాయిన్ (Bitcoin) నిధిని సృష్టించడం పరిశీలనలో ఉన్న మరో కీలక అంశంగా నివేదిక పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌ను కలిగి ఉంది. నవంబర్ ఎన్నికల నుండి బిట్‌కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్‌కాయిన్ విలువ లక్ష డాలర్లకు చేరుకుంది.
ప్రతిపాదిత నిధి ప్రభుత్వం బిట్‌కాయిన్‌లను కలిగి ఉండటాన్ని లాంఛనప్రాయంగా మారుస్తుంది. క్రిప్టోకరెన్సీ పట్ల ప్రభుత్వ వైఖరిలో వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తుంది. బిట్‌కాయిన్ 2024లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాని విలువ సంవత్సరంలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.
బైడెన్ పాలనలో ఒడుదొడుకులు
అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో అనేక నియంత్రణ సవాళ్లను ఎదుర్కొన్న క్రిప్టో రంగానికి ఈ చొరవ భారీ మార్పును సూచిస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)తో సహా ఫెడరల్ ఏజెన్సీలు ఇటీవలి సంవత్సరాలలో క్రిప్టో కంపెనీలకు వ్యతిరేకంగా 100 కుపైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment