నాటి కాంగ్రెస్ పాలకులు స్వార్థంకొద్దీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ వ్యతిరేక ఎమర్జెన్సీకి దీటుగా మరొక ‘ఎమర్జెన్సీ’ రావొచ్చునని బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ప్రకటించడంతో అడ్వాణీయే సైడ్‌లైన్ కావలసి వచ్చింది. ఇక ఇప్పుడు ‘కరోనా’ మహమ్మారి ముసుగులో అసలు పార్లమెంట్‌ని కాస్తా ‘రబ్బరు స్టాంప్’ హోదా కిందికి పాలకులు మార్చారు. సెలెక్ట్ కమిటీలకు, న్యాయ వ్యవస్థకు తగిన విలువ లేకుండా పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ పౌర జీవనాన్ని పౌరుల ఎరుకలో లేని అజ్ఞాత శక్తులు శాసించే దశ ప్రవేశించింది. ఈ దుర్దశ చివరికి అంతర్జాతీయ స్థాయికి పాకి చిన్న వయస్సులోనే పెద్దబుద్ధితో ప్రవేశించిన పర్యావరణ, పౌర చైతన్యమూర్తులయిన ధన్‌బర్గ్, దిశా రవిలను కూడా చుట్టుముట్టింది. అందుకే ‘భారతదేశమా..! ఎటు నీ ప్రయాణం ఇంతకూ’ అని మరొక్కసారి ప్రశ్నించుకోవలసి వస్తోంది.
‘‘మన దేశంలో ఇటీవల కాలంలో నిర్దేశిత కీలక రాజ్యాంగ విలువలు కాస్తా ఊడ్చుకుపోతున్నాయి. రాజ్యాంగ విలువలకు ప్రాణప్రదమైన సెక్యులరిజం (లౌకిక విధానం) అన్న పదమే ప్రభుత్వ పదజాలం నుంచి దాదాపుగా కనుమరుగై పోయింది. ఈ పదం నిజ స్వభావాన్ని, దాని ఆంతరంగిక శక్తిని రాజకీయ, సామాజిక శక్తులు గుర్తించలేకనో లేదా గుర్తించినా పాటించడంలో విఫలం కావడం వల్లనో సెక్యులరిజాన్ని భ్రష్టు పట్టించారు. ఇందుకు మారుగా సెక్యులర్ రాజ్యాంగానికి విరుద్ధమైన భావాలనూ, ఆచారాలను పోషిస్తూ వచ్చారు’.
– భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ (న్యాయచరిత్ర: బై మెనీ ఎ హ్యాపీ యాక్సిడెంట్)
‘‘ఇటీవల ప్రభుత్వ చర్యలు దేశంలో పత్రికా రచనా వ్యవస్థపైనేగాక యావత్తు సమాచార వ్యవస్థనే దెబ్బతీసేవిగా ఉన్నాయి. క్రమంగా ఇది ప్రజాస్వామ్యం కనుమరుగై పోవడమే’’
– పన్నీర్ సెల్వన్ ‘హిందు’ రీడర్స్ ఎడిటర్ (15.2.21)
భారత్ సెక్యులర్ రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షణ కోసం తపన పడుతున్న బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ఇరువురు మేధావులు 74 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత నేడు ఆందోళనతో వెలిబుచ్చుతున్న పై అభిప్రాయాలు మనకు ఏం సందేశం ఇస్తున్నాయి? వారు ప్రకటిస్తున్న ఆందోళనకు తాజా ప్రతిరూపమే– గత వంద రోజులుగా భారత రాష్ట్రాలలో యావత్తు రైతాంగ ప్రజలూ.. బడా పెట్టుబడిదారులకు రైతాంగ మౌలిక ప్రయోజనాలనే తాకట్టుపెట్టేందుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు చట్టాలను ప్రతిఘటిస్తూ ఈ రోజుకీ జరుపుతున్న మహోద్యమం. దేశీయంగా రాష్ట్రాలలోనేగాక, ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సంస్కరణలు రైతాంగ ప్రయోజనాలకు నష్టదాయకంగా ఉండరాదని భావించే వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రసిద్ధ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు.. ఇప్పటికి సుమారు రెండు వందలమంది రైతాంగ సత్యాగ్రహ కార్యకర్తల బలిదానానికి నిరసనగా తమవంతుగా సంఘీభావం వ్యక్తం చేశారు.
అయినా కూడా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో తాను తీసుకొచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడానికి కేంద్రం ఎందుకు భీష్మిస్తోంది? రైతాంగం తాము పండించిన పంట లకు నిర్ణయించే కనీస ధరకు చట్టరూపేణా భద్రత కల్పించమని కోరింది. సరిగ్గా ఈ దేశ ‘స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ’ బతికి బట్ట కట్టడానికి ఆదరువుగా ఉన్న రైతాంగం కోరుతున్న ఈ కనీస కోర్కెను ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తున్నట్టు? ‘కనీస ధర’కు మేం వ్యతిరేకం కాదని ఒకవైపు ప్రకటిస్తున్న పాలకులు దానికి చట్టబద్ధత కల్పించ డాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కనీస మద్దతు ధరను ‘చట్టం’గా ప్రకటించకుండా పాలకుల చేతుల్ని అడ్డుకునేదెవరో, అడ్డుకుంటున్న దెవరో? స్వాతంత్య్రానికి ముందే (1933లో) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రాబోయే పరిణామాలను ఊహించి ఇలా హెచ్చరించాడు: ‘‘ప్రత్యేక హక్కులను, స్వార్థ ప్రయోజనాలనూ అనుభవిస్తున్న ఏ ప్రత్యేక సంపన్న వర్గమూ, గ్రూపులూ తమ హక్కులను తాముగా స్వచ్ఛందంగా వదులుకున్నట్లు చరిత్రకు దాఖలా లేదు. సాంఘికంగా మార్పులు రావాలంటే ఒత్తిడి, అవసరాన్ని బట్టి బలప్రయోగమూ తప్పనిసరిగా అవసరం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడమంటే అర్థం.. ఈ స్వార్థ ప్రయోజనాలకు భరత వాక్యం పలకడమే. విదేశీ ప్రభుత్వ పాలన తొలగి దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ స్వార్థపర వర్గాల ప్రయోజనాలను ముట్టకుండా అలాగే అట్టిపెడితే ఇక అది నామమాత్ర స్వాతంత్య్రం కూడా కాదు.’’
సరిగ్గా 89 ఏళ్ల నాటి ఈ అంచనాకు వీసమెత్తు తేడా లేకుండా మధ్య మధ్యలో ‘ఉదారం’గా ఉన్నట్టు నాటకమాడినా తరువాత స్వాతంత్య్రానంతరం క్రమంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వమూ, ఆ తరువాత వచ్చిన బీజేపీ–ఆరెస్సెస్ పాలనా యంత్రాంగమూ అను సరిస్తూ వచ్చిందీ, వస్తున్నదీ–వీసమెత్తు తేడా లేకుండా బడా పెట్టు బడిదారీ శక్తుల మౌలిక ప్రయోజనాల రక్షణ కోసమే. అందులో భాగంగానే రైతాంగం కోరుతున్న ‘పంటల కనీస ధరకు చట్టరీత్యా’ గ్యారంటీ ఇవ్వబోమన్నది కేంద్ర ప్రభుత్వం. మరొకమాటగా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పాలంటే–వెనకనుంచి ‘తోలుబొమ్మ’ ఆట ఆడించే బడా వ్యాపార వర్గాలు లేకపోతే బీజేపీ పాలకుల చేతులను కట్టిపడవేస్తున్న వాళ్లెవరు? నిజానికి బీజేపీ పాలకుల ప్రయోజనాల రక్షణ కోసమే కాంట్రాక్టు లేదా కార్పొరేట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రవేశపెట్టించగోరారు. రైతాంగం అందుకు వ్యతిరేకించి ‘ససేమిరా’ అని ప్రాణ త్యాగాలకు సిద్ధమైనప్పుడు మాత్రమే ‘లాలూచీ బేరం’గా– ‘మాకు కార్పొరేట్ వ్యవసాయం పెట్టాలన్న ఉద్దేశం లేదు, మాకు ఆ రంగంతో సంబంధం లేద’ని నరేంద్ర మోదీ ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో ఆ రహస్యం ప్రభుత్వానికి తెలియాలి, ఆదానీ అంబానీలకు కూడా తెలియాలి.
స్వాతంత్య్రం వచ్చిన తొలి ఘడియల్లోనే టాటా–బిర్లాలు ఏకమై దేశీయ బడా పెట్టుబడిదారీ వర్గం జాయింట్‌గా జాతీయ పథకం రచించింది. దాని పేరే ప్రసిద్ధ బొంబాయి (బాంబే) ప్లాన్. దాని లక్ష్యం స్థూలంగానూ, సూక్ష్మంగానూ కూడా భారతదేశంలో పక్కా పెట్టుబడి దారీ వ్యవస్థ స్థాపనకు నాంది పలకడమే! అంటే నాడే దేశానికి దశా–దిశా నిర్దేశించిన పక్కా ప్రణాళిక అది. ఆ తరువాత ఎవరెన్ని కబుర్లు చెప్పినా కాంగ్రెస్ (తర్వాత కాంగ్రెస్–యూపీఏ), ఆ పిమ్మట బీజేపీ (ఆరెస్సెస్–ఎన్డీఏ) సంకీర్ణ ప్రభుత్వాలు అనుసరించింది కూడా ఆచరణలో... నాటకంలో ‘విదూషకుల’ పాత్రేనని మాత్రం మనం మరచి పోరాదు.
ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీకి చెందిన పాలకులు తొలి అయిదేళ్లలోనూ ప్రవేశపెట్టిన జీఎస్టీ పన్నుల విధానం– రాజ్యాం గవిహితమైన రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని పూర్తిగా హరించివేస్తూ వచ్చింది. క్రమంగా సెక్యులర్ రాజ్యాంగానికి అడుగడుగునా ఉల్లంఘ నలు ఎదురయ్యాయి, 1975–77 నాటి కాంగ్రెస్ పాలకులు స్వార్థం కొద్దీ ప్రవేశపెట్టిన రాజ్యాంగ వ్యతిరేక ఎమర్జెన్సీకి దీటుగా మరొక ‘ఎమర్జెన్సీ’ రావొచ్చునని బీజేపీ అగ్రనాయకుడు అడ్వాణీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ప్రకటించడంతో తర్వాత అడ్వాణీ తానే సైడ్‌లైన్ కావలసి వచ్చింది. ఇక ఇప్పుడు ‘కరోనా’ మహమ్మారి ముసుగులో అసలు పార్లమెంట్‌ను కాస్తా ‘రబ్బరు స్టాంప్’ హోదా కిందికి మన పాలకులు మార్చారు. సెలెక్ట్ కమిటీలకు, న్యాయ వ్యవస్థకు ఇప్పుడు తగిన విలువ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ పౌర జీవనాన్ని పౌరుల ఎరుకలో లేని అజ్ఞాత శక్తులు శాసించే దశ ప్రవేశించింది. ఈ దుర్దశ చివరికి అంతర్జాతీయ స్థాయికి పాకి చిన్న వయస్సులోనే పెద్దబుద్ధితో ప్రవేశించిన పర్యావరణ, పౌర చైతన్యమూర్తులయిన ధన్‌బర్గ్, దిశా రవిలను కూడా చుట్టుముట్టింది. అందుకే ‘భారతదేశమా..! ఎటు నీ ప్రయాణం ఇంతకూ?’ అని మరొక్కసారి ప్రశ్నించుకోవలసి వస్తోంది.
సామెత ఎందుకు పుట్టిందోగానీ– ‘పాలకుడు ప్రజా సేవలో నీతి తప్పితే, నేల సారం తప్పుతుందట!’ ‘ప్రజాస్వామ్యం’ పేరు చాటున ప్రస్తుత భారత రాజకీయాల్లో ఎన్నితంతులు? ఎన్ని డ్రామాలు? అనుభవానికి ప్రత్యక్ష సాక్షులుండరు గదా!!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment