Kisan Morcha Dharna
-
నల్ల జెండాలు ఎగురవేయాలంటూ రైతు సంఘాల పిలుపు
సాక్షి, చండీగఢ్ : కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ రైతులు నల్లజెండాలు ఎగురవేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర (MSP), స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’కు పిలుపునిచ్చాయి. రైతుల ఆందోళనల్ని ప్రారంభించి 38 రోజులు పూర్తైన సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానా పోలీసులు జరిపిన కాల్పుల్లో పంజాబ్ యువ రైతు శుభకరన్ మరణించారు. దీంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రారంభించిన ‘అస్తి కలశ్ యాత్ర’ లక్షలాది మంది దర్శించుకుని నివాళులర్పించినట్లు రైతు నాయకులు తెలిపారు. ఆస్తి కలశ్ యాత్ర తర్వాత మార్చి మార్చి 31 అంబాలాలోని మోహ్రా మండిలో శుభకరన్ సింగ్‌కు అంకితం చేస్తూ ఏర్పాటు భారీ ఎత్తున సంతాప సభను ఏర్పాటు చేసినట్లు, ఈ సభలో ఎస్కేఎం, కేఎంఎం రైతు నాయకులు పాల్గొనున్నారు. బక్సర్ జిల్లాలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై దాడిని ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని నేతలు అన్నారు. పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళలు, వృద్ధులను కొట్టిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రైతు నాయకులు బల్దేవ్ జిరా చెప్పారు. మార్చి 23న శంభు, ఖానౌరీలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు చెప్పిన రైతు నాయకులు.. లడఖ్‌లోని రైతులు కూడా ఈ పోరాట యాత్రలో పాల్గొంటారని వెల్లడించారు. -
కేంద్రంపై పోరుకు కదిలిన 10వేల మంది రైతులు!
లక్నో: కేంద్రానికి వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరీలో ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది సంయుక్త కిసాన్ మోర్చా. మూడు రోజుల పాటు చేపట్టే ఈ నిరసనల్లో పాల్గొనేందుకు సుమారు 10,000 మంది రైతులు పంజాబ్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరారు. లఖింపుర్‌ఖేరీ హింసాత్మక ఘటనలకు న్యాయం చేయాలంటూ గురువారం నుంచి 72 గంటల పాటు(ఆగస్టు 18 నుంచి 20వ తేదీ) ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి రైతు సంఘాలు. సీనియర్ రైతు నేతలు రాకేశ్ టికాయిత్, దర్శన్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ వంటి వారు ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. ఆందోళనల్లో సుమారు 10వేల మంది రైతులు పాల్గొంటారని భారతి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు మంజిత్ సింగ్ రాయ్ తెలిపారు. కొందరు రైళ్లలో, మరికొందరు తమ సొంత వాహనాల్లో లఖింపుర్‌ఖేరీకి చేరుకుంటున్నారని చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులను ఎత్తివేయాలని కోరుతున్నారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం, పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో లఖింపుర్‌ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా అరెస్టయ్యారు. రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు. ఇదీ చదవండి: PM Modi Interview: ఎన్నికల వేళ.. లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని ఏమన్నారంటే.. -
చట్టాలు ఉపసంహరించాకే ఇళ్లకు
న్యూఢిల్లీ/ఘజియాబాద్/పాల్ఘర్: మూడు సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేసే దాకా రైతులు ఉద్యమ వేదికలను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని రైతు సంఘాల సమాఖ్య.. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం స్పష్టంచేసింది. ఎంఎస్పీకి చట్టబద్ధత డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని తెలిపింది. సాగు చట్టాల రద్దు నిర్ణయంపై ఎస్కేఎం హర్షం వ్యక్తంచేసింది. అయితే, చట్టాలు రద్దయ్యేదాకా ఉద్యమవేదికలను వదిలే ప్రసక్తే లేదని, రైతులు ఎవరూ ఇళ్లకు వెళ్లబోరని ఎస్కేఎం కోర్ కమిటీ సభ్యుడు దర్శన్ పాల్ అన్నారు. శని, ఆదివారాల్లో జరిపే ఎస్కేఎం కోర్ కమిటీ సమావేశాల్లో రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు. చట్టాలను రద్దుచేస్తే ఏడాదికాలంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి చరిత్రాత్మక విజయం దక్కినట్లేనని ఎస్కేఎం తెలిపింది. చేతల్లో చూపండి: తికాయత్ సాగు చట్టాలను పార్లమెంటులో రద్దు చేశాక రైతుల ఉద్యమాన్ని విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టంచేశారు. రద్దు చేస్తామని మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపి చట్టాలను వెంటనే రద్దుచేయాలన్నారు. ‘ చట్టాలను పార్లమెంట్లో రద్దుచేసేదాకా రైతులు ఎవ్వరూ సంబరాలు చేసుకోకండి. రైతుల ఆందోళన ఇప్పటికిప్పుడే ఆగిపోదు. పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దుచేసే రోజు దాకా వేచి చూస్తాం. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటు ఇతర ప్రధాన సమస్యలపైనా రైతు సంఘాలతో మోదీ సర్కార్ చర్చలు జరపాల్సిందే’ అని తికాయత్ హిందీలో ట్వీట్‌చేశారు. ‘ చట్టాలు రద్దయ్యేదాకా రైతులు ఉద్యమ వేదికల నుంచి ఇళ్లకు వెనుతిరిగేదే లేదు. పంటలకు కనీస మద్దతు ధర లభించట్లేదు. ఈ సమస్య దేశం మొత్తాన్నీ పట్టి పీడిస్తోంది’ అనిæ అన్నారు. -
కిసాన్‌మోర్చా ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట: వరిసాగు చేయొద్దంటూ మంత్రులు సూచనలు చేయడం, కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా చేపట్టిన వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కమిషనరేట్‌లో కి దూసుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు. గాయపడిన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మహేష్ యాదవ్, కామారెడ్డి జిల్లాకు చెందిన పాటిమీది గంగారెడ్డి తదితరులను ఆసుపత్రులకు తరలించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడేళ్లుగా కేంద్రం సహకారంతో ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వరిసాగుపై ఆంక్షలు విధించడంలో కుట్ర దాగి ఉందని కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. వ్యవ సాయ ఉచిత విద్యుత్ హామీ నుండి తప్పించుకోవడానికే సీఎం కేసీఆర్ ఈ ఆంక్షలు విధించారన్నారు. కార్యక్రమంలో కిసాన్మోర్చానేతలు గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్య గౌడ్, పడమటి జగన్మోహన్ రెడ్డి , బునేటి కిరణ్, అంజన్నయాదవ్ పాల్గొన్నారు. ధాన్యం కొనొద్దని కేంద్రం చెప్పలేదు: సంజయ్ రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయొద్దని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, అలాంటిదేమైనా ఉంటే బహి రంగ పరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అన్నారు. లాఠీచార్జిలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుత్నున ఆ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డిని పరామర్శించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరుణ, విజయశాంతి ఖండన గతేడాది నియంత్రిత సాగు పేరిట రైతులను వం చించిన కేసీఆర్ ఈసారి నియంతగా ప్రవర్తిస్తూ నిర్బంధ వ్యవసాయం చేయాలని బెదిరిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో ఆరోపించారు. రైతులపక్షాన ఉన్న వారిపై లాఠీచార్జీ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి విమర్శించారు. -
జైలుకెళ్లండి.. నేతలవుతారు..
చండీగఢ్: జైలుకెళ్లి వస్తే నేతలవుతారంటూ హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు నిరసనలు జరుగుతున్న చోట్లకు బీజేపీ కార్యకర్తలు 500, 700, 1,000 చొప్పున గుంపులుగా వెళ్లాలని అన్నారు. రైతుల ‘భాష’లోనే వారికి సమాధానం చెబుదాం అని చెబుతున్న వీడియో వైరల్ అయింది. అందులో ఆయన ఇంకా మాట్లాడుతూ. ఒక వేళ జైలుకెళ్లిన బాధపడవద్దని, జైలుకెళ్తే మహా అయితే నెలో, మూడు నెలలో ఉంటారని, కానీ ఆ తర్వాత పెద్ద నేతలవుతారని అన్నారు. చరిత్రలో పేర్లు నిలిచిపోతాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రైతులపై దాడులు చేయాలంటూ రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. ఇలా చేయడానికి మోదీ–నడ్డాల అనుమతి తీసుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేసింది. హింసను ప్రోత్సహిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చెబుతుంటే ఇక రాష్ట్రంలో రాజ్యాంగం ఎలా నడుస్తుందని ప్రశ్నించింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) నేత అభయ్ సింగ్ చౌతాలా దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి మీద దేశద్రోహం కింద కేసు పెట్టాలని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
కొనసాగుతున్న భారత్ బంద్
-
ఎన్నికల్లో తప్పని రైతుల సెగ
ఆగస్ట్ తొమ్మిదో తేదీని క్విట్ ఇండియా దినోత్సవంగా పాటిస్తున్నాం. 1942లో ఇదేరోజున బ్రిటిష్ పాలనకు వ్యతి రేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలై, అనంతర పరిణామాల్లో ఇంగ్లిష్ వారు భారతదేశాన్ని వదలడమూ, దేశం స్వాతంత్య్రం పొందడమూ జరిగాయి. అదే తరహాలో మొన్న ఆగస్ట్ 9న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తున్న రైతులు ‘మోదీ గద్దె దిగాలి’ అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవ కాశం ఉంది. వచ్చే ఏడాది వరుసగా మార్చి, మే నెలల్లో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటగా ఈ ప్రభావం పడనుంది. గతేడాది నవంబర్ 26న మొదలైన రైతుల నిరసన పోరాటం, తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ, రైతులకు ప్రాతినిధ్యం వహి స్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య జరిగిన పదకొండు దశల చర్చలు కూడా ఫలవంతం కాలేదు. వ్యవసాయ చట్టాలను అమలుచేసి తీరాలని కేంద్రమూ, వాటిని వెంటనే రద్దు చేయాలని రైతుసంఘాలూ– ఇరుపక్షాలూ కూడా తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ఏ రాజీకి రాలేకపోయాయి. పదకొండో దశ చర్చలు జనవరి 22న విఫలమయ్యాక మళ్లీ చర్చలకు కేంద్రం ఏ ముందడుగూ వేయలేదు; రైతులు తమ నిరసననూ వీడలేదు. తమను తాము ఐక్యంగా ఉంచుకుంటూనే, కేంద్ర ట్రేడ్ యూనియన్లు, ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొంటూ పద్ధతి ప్రకారం దశల వారీగా రైతులు తమ నిరసనను సజీవంగా ఉంచుతున్నారు. ఢిల్లీ మూడు సరిహద్దులు– సింఘు, తిక్రీ, ఘజియాబాదుల్లో ధర్నాలు కొనసాగిస్తూనే దేశంలోని అన్ని రాష్ట్రాలూ జిల్లాలూ బ్లాకు ల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిపారు. భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాలు జరుగుతున్న దేశ పార్లమెంటుకు కొన్ని వందల మీటర్ల దూరం లోనే, నిరసనగా జంతర్ మంతర్‌లో రైతుల పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రెండూ నేటితో ముగియనున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రైతులు తమ పోరాటానికి కొత్త మలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ సారథ్యంలో సమావేశమై క్విట్ మోదీ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుమారు 40 రైతు సంఘాలు అందులో భాగమయ్యాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. రానున్న కాలంలో జిల్లాలవారీగా కూడా ఇవి ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయికీ పోరాటాన్ని చేర్చాలనేది వీరి లక్ష్యం. జాతీయ రాజకీయాలను రైతుల పోరు ఇదివరకే ప్రభావితం చేసింది. అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించి మనలేని స్థాయికి ఈ పోరాటం చేరింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటా కూడా రైతుల సమస్యలను లేవనెత్తడానికి విపక్షాలు ప్రయత్నించడం, సభా వ్యవహారాలకు చాలాసార్లు ఆటంకం కలగడం చూశాం. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతంగానే కొనసాగుతున్నప్పటికీ, రైతు సంఘాలు తమ డిమాండ్లు నెరవేరేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ సహా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని కూడా రైతులకు పిలుపునిచ్చాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ మూల్ కాంగ్రెస్‌ను ఓడించి, పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ విఫలం కావడం చూశాం. నిరసన చేస్తున్న రైతుల్లో సింహభాగం పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడంతో మోదీ వ్యతిరేక ఉద్యమం ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ప్రభావకారి కానుంది. గత ఎనిమిది నెలల నిరసన కాలంలో ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇది అంత సులభంగా వారి మనోఫలకాల్లోంచి తొలిగేది కాదు. ఇప్పటికే పంజాబ్ స్థానిక సంఘాల ఎన్నికల్లో రైతులు ఎలాంటి పాత్ర పోషించారో చూశాం. బీజేపీకి వ్యతిరేకంగా వారు ఇచ్చిన ఆగ్రహపూరిత ప్రకటనల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేకపోయారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చాక, బీజేపీకి సంప్రదాయ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి రైతుల సమస్యల మీద ప్రచారం చేస్తోంది. అలాగే ఇతర రెండు ప్రధాన పార్టీలు– అధికారంలో ఉన్న కాంగ్రెస్, విపక్షం ఆమ్ ఆద్మీ కూడా రైతులకు మద్దతిస్తున్నాయి. అంటే పంజాబ్ ఎన్నికల్లో రైతుల నిరసనోద్యమం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. – జ్ఞాన్ పాఠక్ -
తెలంగాణ : రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన
-
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు. -
సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలి
ఒంగోలు టౌన్: సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద రైతు పోరాట దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య ప్రారంభించి ప్రసంగించారు. జీఓ నం. 31 ప్రకారం సుబాబుల్ రూ.4200, జామాయిల్ రూ.4400లకు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఎక్కడా ఈ ధర అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ దళారులు ప్రవేశించి రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జీఓ నం. 31ప్రకారం కర్ర మార్కె ట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావం వల్ల ఎండిపోయిన తోటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులు సాగు చేస్తున్నారన్నారు. కర్ర కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రాక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఐటీసీ కంపెనీ ప్రోత్సాహంతో రైతులు పెద్దఎత్తున సాగు చేపట్టారని, అయితే కొనుగోళ్ల రంగంలోకి పూర్తి స్థాయిలో దిగకుండా రైతులను దగా చేసిందన్నారు. సుబాబుర్కు రూ.4200ల ధర రావల్సి ఉండగా రూ.2600కు మించి రావడం లేదన్నారు. జామాయిల్‌కు రూ.4400ల ధర రావల్సి ఉండగా, రూ.2000లకు మించి రావడం లేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దళారీల దోపిడీ పెరిగి పోయిందన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. కమిటీలో సభ్యుడైన జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. శనివారం ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలను తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి. గోపాల్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అబఞ్బరి వెంకటేశ్వర్లు, జే జయంత్‌బాబు, కే వెంకటేశ్వర్లు, కే పెద్దబ్బాయి, ఏ శంకరరావు, బి.లక్ష్మీనారాయణ, ఎన్ సుబ్బారావు, వి.సుబ్బారావు పాల్గొన్నారు. -
ఫసల్ బీమా అమలులో విఫలం
ప్రభుత్వంపై లక్ష్మణ్ ధ్వజం వ్యవసాయ కమిషనరేట్ వద్ద కిసాన్ మోర్చా ధర్నా సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఫసల్ బీమా యోజన అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులుంటే, వారిలో కనీసం 10 శాతం మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో చేర్పించ లేకపోయిందన్నారు. దీనివల్ల కరువు, అతి వృష్టి, వరదలు వంటివాటితో పంటనష్టపోయిన రైతులు పరిహారం పొందే అవకాశంలేకుండా పోయిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగువిడతలుగా చేసిందన్నారు. దీనివల్ల రైతులకు వడ్డీ పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నమాట అబద్ధమని లక్ష్మణ్ అన్నారు. రుణమాఫీ పూర్తికాకపోవడం వల్ల రైతులకు బ్యాంకులు కొత్త రుణాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో, వారికి రుణాలను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, వారి కుటుంబా లను ప్రభుత్వం ఆదుకోవడంలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, బద్దం బాల్‌రెడ్డి, పుష్పలీల, నందీశ్వర్‌గౌడ్, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.