రైతు పోరాట దీక్షలో పాల్గొన్న రైతులు
ఒంగోలు టౌన్: సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద రైతు పోరాట దీక్ష చేపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని ఆచార్య ఎన్‌జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య ప్రారంభించి ప్రసంగించారు. జీఓ నం. 31 ప్రకారం సుబాబుల్ రూ.4200, జామాయిల్ రూ.4400లకు కొనుగోలు చేయాల్సి ఉండగా, ఎక్కడా ఈ ధర అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే కర్ర కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ దళారులు ప్రవేశించి రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. జీఓ నం. 31ప్రకారం కర్ర మార్కె ట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వర్షాభావం వల్ల ఎండిపోయిన తోటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్, సరుగుడు రైతులు సాగు చేస్తున్నారన్నారు. కర్ర కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రాక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఐటీసీ కంపెనీ ప్రోత్సాహంతో రైతులు పెద్దఎత్తున సాగు చేపట్టారని, అయితే కొనుగోళ్ల రంగంలోకి పూర్తి స్థాయిలో దిగకుండా రైతులను దగా చేసిందన్నారు. సుబాబుర్‌కు రూ.4200ల ధర రావల్సి ఉండగా రూ.2600కు మించి రావడం లేదన్నారు. జామాయిల్‌కు రూ.4400ల ధర రావల్సి ఉండగా, రూ.2000లకు మించి రావడం లేదన్నారు.
రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దళారీల దోపిడీ పెరిగి పోయిందన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. కమిటీలో సభ్యుడైన జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. శనివారం ఒంగోలుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలను తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు టి. గోపాల్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అబఞ్బరి వెంకటేశ్వర్లు, జే జయంత్‌బాబు, కే వెంకటేశ్వర్లు, కే పెద్దబ్బాయి, ఏ శంకరరావు, బి.లక్ష్మీనారాయణ, ఎన్ సుబ్బారావు, వి.సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment