ఆగస్ట్ తొమ్మిదో తేదీని క్విట్ ఇండియా దినోత్సవంగా పాటిస్తున్నాం. 1942లో ఇదేరోజున బ్రిటిష్ పాలనకు వ్యతి రేకంగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలై, అనంతర పరిణామాల్లో ఇంగ్లిష్ వారు భారతదేశాన్ని వదలడమూ, దేశం స్వాతంత్య్రం పొందడమూ జరిగాయి. అదే తరహాలో మొన్న ఆగస్ట్ 9న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసిస్తున్న రైతులు ‘మోదీ గద్దె దిగాలి’ అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించారు. ఇది జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవ కాశం ఉంది. వచ్చే ఏడాది వరుసగా మార్చి, మే నెలల్లో శాసనసభ ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటగా ఈ ప్రభావం పడనుంది.
గతేడాది నవంబర్ 26న మొదలైన రైతుల నిరసన పోరాటం, తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికీ, రైతులకు ప్రాతినిధ్యం వహి స్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకూ మధ్య జరిగిన పదకొండు దశల చర్చలు కూడా ఫలవంతం కాలేదు. వ్యవసాయ చట్టాలను అమలుచేసి తీరాలని కేంద్రమూ, వాటిని వెంటనే రద్దు చేయాలని రైతుసంఘాలూ– ఇరుపక్షాలూ కూడా తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో ఏ రాజీకి రాలేకపోయాయి. పదకొండో దశ చర్చలు జనవరి 22న విఫలమయ్యాక మళ్లీ చర్చలకు కేంద్రం ఏ ముందడుగూ వేయలేదు; రైతులు తమ నిరసననూ వీడలేదు.
తమను తాము ఐక్యంగా ఉంచుకుంటూనే, కేంద్ర ట్రేడ్ యూనియన్లు, ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొంటూ పద్ధతి ప్రకారం దశల వారీగా రైతులు తమ నిరసనను సజీవంగా ఉంచుతున్నారు. ఢిల్లీ మూడు సరిహద్దులు– సింఘు, తిక్రీ, ఘజియాబాదుల్లో ధర్నాలు కొనసాగిస్తూనే దేశంలోని అన్ని రాష్ట్రాలూ జిల్లాలూ బ్లాకు ల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిపారు. భారత్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. వర్షాకాల సమావేశాలు జరుగుతున్న దేశ పార్లమెంటుకు కొన్ని వందల మీటర్ల దూరం లోనే, నిరసనగా జంతర్ మంతర్‌లో రైతుల పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రెండూ నేటితో ముగియనున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి కొన్ని రోజుల ముందే రైతులు తమ పోరాటానికి కొత్త మలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత కిసాన్ సభ సారథ్యంలో సమావేశమై క్విట్ మోదీ ఉద్యమాన్ని ప్రారంభించారు. సుమారు 40 రైతు సంఘాలు అందులో భాగమయ్యాయి. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. రానున్న కాలంలో జిల్లాలవారీగా కూడా ఇవి ఏర్పాటు కానున్నాయి. గ్రామస్థాయికీ పోరాటాన్ని చేర్చాలనేది వీరి లక్ష్యం.
జాతీయ రాజకీయాలను రైతుల పోరు ఇదివరకే ప్రభావితం చేసింది. అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా విస్మరించి మనలేని స్థాయికి ఈ పోరాటం చేరింది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటా కూడా రైతుల సమస్యలను లేవనెత్తడానికి విపక్షాలు ప్రయత్నించడం, సభా వ్యవహారాలకు చాలాసార్లు ఆటంకం కలగడం చూశాం. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతంగానే కొనసాగుతున్నప్పటికీ, రైతు సంఘాలు తమ డిమాండ్లు నెరవేరేలా అన్ని రాజకీయ పార్టీల మద్దతును కోరడమే కాకుండా, పశ్చిమ బెంగాల్ సహా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకూడదని కూడా రైతులకు పిలుపునిచ్చాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ మూల్ కాంగ్రెస్‌ను ఓడించి, పశ్చిమ బెంగాల్‌లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ విఫలం కావడం చూశాం.
నిరసన చేస్తున్న రైతుల్లో సింహభాగం పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కావడంతో మోదీ వ్యతిరేక ఉద్యమం ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ ప్రభావకారి కానుంది. గత ఎనిమిది నెలల నిరసన కాలంలో ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇది అంత సులభంగా వారి మనోఫలకాల్లోంచి తొలిగేది కాదు. ఇప్పటికే పంజాబ్ స్థానిక సంఘాల ఎన్నికల్లో రైతులు ఎలాంటి పాత్ర పోషించారో చూశాం. బీజేపీకి వ్యతిరేకంగా వారు ఇచ్చిన ఆగ్రహపూరిత ప్రకటనల నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేకపోయారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమల్లోకి తెచ్చాక, బీజేపీకి సంప్రదాయ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి రైతుల సమస్యల మీద ప్రచారం చేస్తోంది. అలాగే ఇతర రెండు ప్రధాన పార్టీలు– అధికారంలో ఉన్న కాంగ్రెస్, విపక్షం ఆమ్ ఆద్మీ కూడా రైతులకు మద్దతిస్తున్నాయి. అంటే పంజాబ్ ఎన్నికల్లో రైతుల నిరసనోద్యమం ప్రభావం తీవ్రంగానే ఉండనుంది.
– జ్ఞాన్ పాఠక్
Comments
Please login to add a commentAdd a comment