న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించాయి. రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్థించిన కుహానా రైతు నేతలకు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధి లేమిని బయట పెట్టుకుందంటూ ధ్వజమెత్తాయి. ఆ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకే కమిటీ వేశారని ఆరోపించాయి.
ఇదో బోగస్ కమిటీ అని ఎస్‌కేఎం సభ్యుడు దర్శన్ పాల్ ఆరోపించారు. మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం వెనక ఉద్దేశం ఇదేనని రైతు నేతలు అంటున్నారు. పలు అంశాలను చేర్చడం ద్వారా మద్దతు ధర అంశం ప్రాధాన్యతను తగ్గించారని హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్‌సింగ్ దుయ్యబట్టారు. రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ ప్యానల్లో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్ చెప్పారు. మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఎంఎస్‌పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామన్నారు.
ఇదీ చదవండి: PM Kisan: అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..!
Comments
Please login to add a commentAdd a comment