BKU
-
బీకేయూ నేత తికాయత్‌కు బెదిరింపులు
ముజఫర్‌నగర్(యూపీ): భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. రైతు సంఘాల ఆందోళనల నుంచి దూరంగా ఉండకుంటే రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబాన్ని బాంబు వేసి చంపుతామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా హెచ్చరించాడు. ఈ మేరకు రాకేశ్ తికాయత్ సోదరుడు గౌరవ్ తికాయత్, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని భవురా కలాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అక్షయ్ శర్మ చెప్పారు. రద్దయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నేతల్లో రాకేశ్ తికాయత్ ఒకరు. చట్టాలు రద్దయిన తర్వాత కూడా ఆయన దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై రైతు సంఘాలు చేపట్టే నిరసనల్లో పాల్గొంటున్నారు. -
‘ఎంఎస్పీ’ కమిటీపై రగడ.. కేంద్రం ఏమందంటే?
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్ యూనియన్ (బీకేయూ), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించాయి. రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాలను సమర్థించిన కుహానా రైతు నేతలకు, కార్పొరేట్ శక్తుల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధి లేమిని బయట పెట్టుకుందంటూ ధ్వజమెత్తాయి. ఆ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకే కమిటీ వేశారని ఆరోపించాయి. ఇదో బోగస్ కమిటీ అని ఎస్కేఎం సభ్యుడు దర్శన్ పాల్ ఆరోపించారు. మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం వెనక ఉద్దేశం ఇదేనని రైతు నేతలు అంటున్నారు. పలు అంశాలను చేర్చడం ద్వారా మద్దతు ధర అంశం ప్రాధాన్యతను తగ్గించారని హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్‌సింగ్ దుయ్యబట్టారు. రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ ప్యానల్లో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్ చెప్పారు. మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. ఎంఎస్పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామన్నారు. ఇదీ చదవండి: PM Kisan: అలర్ట్: ఇలా చేయకపోతే మీ రూ. 2000 పోయినట్లే..! -
BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు
చండీగఢ్: ఈ నెల 26న రైతులు తలపెట్టిన బ్లాక్‌డే నిరసన సందర్భంగా పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆరు నెలలకు చేరిన సందర్భంగా రైతు సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ నుంచి భారీ స్థాయిలో రైతులు ఢిల్లీ సరిహద్దులకు వస్తున్నారని భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రాహణ్) సీనియర్ నేత షింగారా సింగ్ సోమవారం చెప్పారు. యువకులు, పెద్దలు అంతా కలసి తమ వాహనాలతో తిక్రి, సింఘు సరిహద్దులకు చేరుకుంటున్నారు. పంజాబ్‌లోని సంగ్రూర్, పాటియాలా, మనసా, బతిందా, మోగ, గుర్దాస్పుర్, ఫరిద్కోట్ జిల్లాల నంచి రైతులు వస్తున్నట్లు షింగారా తెలిపారు. రైతులు చేపట్టనున్న నిరసనకు కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్దు మద్దతు ప్రకటించారు. నిరసన రోజున వారికి సంఘీభావంగా తన ఇంటిపై నల్లజెండా ఎగురవేస్తానని చెప్పారు. (చదవండి: CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!) -
18న నాలుగు గంటలపాటు రైల్ రోకో
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా రైల్ రోకో (రైళ్ల నిలిపివేత) చేపట్టనున్నట్లు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని తెలిపాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి రాజస్తాన్‌లో టోల్ రుసుము వసూలును అడ్డుకుంటామని తెలియజేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు కేంద్రంలో అధికార మార్పిడిని ఆశించడం లేదని, తమ సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని, రైతు సంఘాల నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఆయన బుధవారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే దాకా పోరాటం కొనసాగుతుందని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చాలో(ఎస్కేఎం) చీలికలు తెచ్చే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. త్వరలో దేశవ్యాప్తంగా రైతులతో భారీ సభలు నిర్వహిస్తామన్నారు. ‘‘రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. చర్చల కోసం మా కమిటీ సిద్ధంగా ఉంది. సంప్రదింపులతోనే పరిష్కార మార్గం లభిస్తుంది’’ అని చెప్పారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఎర్రకోట ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని తికాయత్ ఆరోపించారు. రైతుల పోరాటం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసిందని విమర్శించారు. మత జెండాను ఎగురవేయడం దేశద్రోహం కాదన్నారు. -
బిల్ వాపసీ కాదంటే.. గద్దీ వాపసీ!
న్యూఢిల్లీ/జింద్(హరియాణా): ఒకవైపు, రైతు నిరసన కేంద్రాలను ప్రభుత్వం దుర్భేద్య కోటలుగా మారుస్తోంటే.. మరోవైపు, ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి రుచి చూపిస్తామని రైతు నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం ఇలాగే కొనసాగితే మోదీ సర్కారు అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే అధికార పీఠం దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘ఇన్నాళ్లూ వ్యవసాయ చట్టాలను(బిల్ వాపసీ) వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ చేశాం. ఆ చట్టాలను వెనక్కు తీసుకోనట్లయితే.. అధికారాన్ని వెనక్కు తీసుకునే(గద్దీ వాపసీ) నినాదాన్ని మన యువత ఇస్తే పరిస్థితేంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి’ అని హరియాణాలో బుధవారం జరిగిన రైతు మహా పంచాయత్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారికేడ్లను, ముళ్ల కంచెలను, రోడ్లపై మేకులను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. ‘రాజు భయపడినప్పుడే.. కోటను పటిష్టం చేసుకుంటాడు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రోడ్లపై ఏర్పాటు చేసిన మేకులపై తాను పడుకుని, ఇతర రైతులు తనపై నుంచి సురక్షితంగా దాటి వెళ్లేలా చూస్తానని ఉద్వేగభరితమయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోందని, ఖాప్ పంచాయత్‌ల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని పేర్కొన్నారు.ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా వేలాది రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ సరిహద్దు వద్ద భద్రత చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ మద్దతు గర్వకారణం రైతు ఉద్యమానికి అంతర్జాతీయ ప్రముఖుల నుంచి మద్దతు లభించడం గర్వకారణమని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. అనధికార చర్చలు లేవు: తోమర్ రైతులతో అనధికార చర్చలు జరపడం లేదని బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. నిరసన కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టడంపై స్పందిస్తూ అది స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు. రైతు ప్రతినిధులతో ప్రభుత్వం జనవరి 22న జరిపిన 11వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన హింసకు సంబంధించి అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేసేవరకు ప్రభుత్వంతో చర్చల ప్రసక్తే లేదన్న రైతుల వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘అది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దానిపై వారు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాలి. నాతో కాదు’ అని తోమర్ పేర్కొన్నారు. రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతుపై బుధవారం బీజేపీ స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ట్విటర్‌కి కేంద్రం వార్నింగ్ రైతు ఉద్యమానికి సంబంధించి వస్తున్న అసత్య ప్రచారాల ట్వీట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమం ట్విటర్‌ని ఆదేశించింది. వెంటనే ఆ పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యవసాయ చట్టాలపైన, రైతు ఆందోళనలపైన అవగాహన లేని వారంతా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారంది. రైతు మారణహోమం పేరుతో హ్యాష్‌ట్యాగ్ త్వరలో రాబోతోందన్న సమాచారం ఉందని అలాంటివి వెంటనే అడ్డుకోవాలంటూ ట్విటర్‌కి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నోటీసులు పంపింది. -
ప్రధాని అంటే గౌరవం ఉంది
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు ప్రధానమంత్రి అంటే గౌరవం ఉందని, అదే సమయంలో, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలోనూ వారు స్థిరంగా ఉన్నారని రైతు నేతలు, అన్నదమ్ములు నరేశ్ తికాయత్, రాకేశ్ తికాయత్ ఆదివారం స్పష్టం చేశారు. రైతులతో చర్చలకు తమ ప్రభుత్వం ఒక ఫోన్‌కాల్ దూరంలోనే ఉందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యపై వారు స్పందిస్తూ.. ఈ సమస్యకు ఒక మధ్యేమార్గ పరిష్కారం వెతకడానికి ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనేందుకు రైతులు సిద్ధంగానే ఉన్నారన్నారు. సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉందని, అయితే, ఒత్తిళ్ల మధ్య చర్చలు సాధ్యం కావని బీకేయూ ప్రధాన కార్యదర్శి రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. అదేసమయంలో, ప్రభుత్వం, పార్లమెంటు తమ ముందు లొంగిపోవాలని కూడా రైతులు కోరుకోవడం లేదన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడాలంటే ముందు అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్నది ఒక ప్రత్యామ్నాయ సూచన అని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పేర్కొన్నారు. ‘చర్చలు జరగాల్సిందే. పరిష్కారం సాధించాల్సిందే. రైతుల డిమాండ్లు అంగీకరించాలి. అయితే, మధ్యేమార్గ పరిష్కారంగా.. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు సాగు చట్టాల అమలును నిలిపేస్తామని హామీ ఇవ్వాలి. అలా ఇస్తే, మేం కూడా రైతులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం’ అని నరేశ్ తికాయత్ సూచించారు. సాగు చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేస్తామన్న ప్రతిపాదనకు కేంద్రం కట్టుబడే ఉందని ప్రధాని శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు చోటు చేసుకున్న హింసను తికాయత్ సోదరులు ఖండించారు. అది ఉద్యమ వ్యతిరేకుల కుట్ర అని ఆరోపించారు. ‘అన్నిటికన్నా త్రివర్ణ పతాకం అత్యున్నతమైనది. జాతీయ జెండాను అవమానించడం ఎట్టి పరిస్థితుల్లో సహించం’ అని స్పష్టం చేశారు. ఘాజీపూర్‌కు తరలివస్తున్న రైతులు ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ వద్దకు రైతులు తరలివస్తున్నారు. ఈ కేంద్రం నుంచి రైతాంగ ఉద్యమానికి బీకేయూ నేత రాకేశ్ తికాయత్ నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ల నుంచి తరలి వస్తున్న రైతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఘాజీపూర్ వద్ద భద్రత బలగాలను భారీగా మోహరించారు. మూడు అంచెల్లో ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘాజీపూర్ కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రంతా జానపద పాటలకు, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి గుర్జర్ల మద్దతు ఉంటుందని గుర్జర్ల నేత మదన్ భయ్యా తెలిపారు. అలాగే, రైతు ఉద్యమానికి మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌లో ఆదివారం జరిగిన మూడో ‘సర్వ్ ఖాప్ మహా పంచాయత్’కు వేల సంఖ్యలో రైతులు హాజరయ్యారు. శుక్రవారం ముజఫర్ నగర్లో, మథురలో శనివారం ఈ మహా పంచాయత్ జరిగింది. -
హైవేను దిగ్బంధించిన బీకేయూ కార్యకర్తల అరెస్టు
ముజఫర్‌నగర్: గత గురువారం (డిసెంబర్ 5) ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారి, ఇతర రాష్ర్ట రహదారులను దిగ్బంధించిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) కార్యకర్తలపై పోలీసులు కేసులు బనాయించారు. సుమారు 250 మందికి పైగా కార్యకర్తలపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో బీకేయూ డివిజనల్ అధ్యక్షుడు చందర్‌పాల్ ఫోజీ, జిల్లా అధ్యక్షుడు రాజు అహ్లావత్, మహిళా నేత సోహన్‌బిరి దేవి తదితరులు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని చెరుకు రైతులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని, చెరుకు మద్దతు ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల ఐదున బీకేయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, తమ ఆందోళనకారులు ఆ రోజు మూడు గంటలపాటు జాతీయ రహదారి సహా ఖటౌలీ, ఫలౌడా, మిరాన్పూర్, పిన్నా, లాలూఖేరీ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులను దిగ్బంధించడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైందని పోలీసులు తెలిపారు. అలాగే ఒక గంటపాటు ఢిల్లీ-కల్కా రైలును సైతం మన్సూర్పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారని చెప్పారు.