18న నాలుగు గంటలపాటు రైల్‌ రోకో | Protesting farmers announce four-hour nationwide Rail Roko on February 18 | Sakshi
Sakshi News home page

18న నాలుగు గంటలపాటు రైల్‌ రోకో

Published Thu, Feb 11 2021 4:04 AM | Last Updated on Thu, Feb 11 2021 4:31 AM

Protesting farmers announce four-hour nationwide Rail Roko on February 18 - Sakshi

ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్‌ నుంచి సిక్కు రైతులు తీసుకొచ్చిన పవిత్ర జలాలను స్వీకరిస్తున్న రాకేశ్‌ తికాయత్‌

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌ రోకో (రైళ్ల నిలిపివేత) చేపట్టనున్నట్లు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని తెలిపాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి రాజస్తాన్‌లో టోల్‌ రుసుము వసూలును అడ్డుకుంటామని తెలియజేసింది.   కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు కేంద్రంలో అధికార మార్పిడిని ఆశించడం లేదని, తమ సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.

తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని, రైతు సంఘాల నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఆయన బుధవారం సింఘు బోర్డర్‌ పాయింట్‌ వద్ద రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే దాకా పోరాటం కొనసాగుతుందని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చాలో(ఎస్‌కేఎం) చీలికలు తెచ్చే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. త్వరలో దేశవ్యాప్తంగా రైతులతో భారీ సభలు నిర్వహిస్తామన్నారు. ‘‘రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. చర్చల కోసం మా కమిటీ సిద్ధంగా ఉంది. సంప్రదింపులతోనే పరిష్కార మార్గం లభిస్తుంది’’ అని చెప్పారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఎర్రకోట ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని తికాయత్‌ ఆరోపించారు. రైతుల పోరాటం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసిందని విమర్శించారు. మత జెండాను ఎగురవేయడం దేశద్రోహం కాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement