Rail Rocco
-
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
18న నాలుగు గంటలపాటు రైల్ రోకో
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా రైల్ రోకో (రైళ్ల నిలిపివేత) చేపట్టనున్నట్లు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు రోకో నిర్వహిస్తామని తెలిపాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి రాజస్తాన్‌లో టోల్ రుసుము వసూలును అడ్డుకుంటామని తెలియజేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు కేంద్రంలో అధికార మార్పిడిని ఆశించడం లేదని, తమ సమస్యల పరిష్కారాన్ని కోరుకుంటున్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని, రైతు సంఘాల నాయకులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఆయన బుధవారం సింఘు బోర్డర్ పాయింట్ వద్ద రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే దాకా పోరాటం కొనసాగుతుందని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చాలో(ఎస్కేఎం) చీలికలు తెచ్చే ప్రయత్నం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. త్వరలో దేశవ్యాప్తంగా రైతులతో భారీ సభలు నిర్వహిస్తామన్నారు. ‘‘రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. చర్చల కోసం మా కమిటీ సిద్ధంగా ఉంది. సంప్రదింపులతోనే పరిష్కార మార్గం లభిస్తుంది’’ అని చెప్పారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన ఎర్రకోట ఘటన వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని తికాయత్ ఆరోపించారు. రైతుల పోరాటం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసిందని విమర్శించారు. మత జెండాను ఎగురవేయడం దేశద్రోహం కాదన్నారు. -
కొనసాగుతున్న రైతుల రైల్‌రోకో
చండీగఢ్ : పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో రైల్ రోకో ఆందోళన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. తొలుత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అమృత్‌సర్‌లో అన్నదాతలు చొక్కాలు విప్పి బిల్లులపై తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పి రైలు పట్టాలపై కూర్చుంటే అయినా కేంద్రం తమ గోడు వింటుందని కిసాన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వణ్ సింగ్ పాంధేర్ అన్నారు. రైతుల నిరసనలతో రైల్వే అధికారులు మరో మూడు రోజులు రాష్ట్రంలో అన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రైతులకి మద్దతుగా రండి: రాహుల్ పిలుపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా శనివారం స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోదీ ప్రభుత్వం రైతుల్ని అమాయకుల్ని చేసి దోపిడీ చేస్తోందని వారికి మద్దతుగా ప్రజలందరూ గళమెత్తాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించారని ఆరోపించారు. -
సాగు బిల్లులపై కాంగ్రెస్ పోరు
న్యూఢిల్లీ/చండీగఢ్: వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను ప్రారంభించింది. ఈ నిరసన కార్యక్రమాలను రెండు నెలలపాటు నిర్వహిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా పంజాబ్‌లో గురువారం రైల్ రోకో నిర్వహించింది. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ, ఇతర రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రైల్ రోకో కార్యక్రమం మొదలైంది. భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు బర్నాలా, సంగ్రూర్ ప్రాంతంలో రైల్వే పట్టాలపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీదేవిదాస్‌పూర్, బస్తీ టాంకా వాలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ ఆందోళనలకు మద్దతిస్త్నునట్లు కమిటీ ప్రతినిధులు కొందరు తెలిపారు. నేడు భారత్ బంద్ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రైతుల ఎజెండాకు కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్ మద్దతు పలికాయి. 25న అంటే శుక్రవారం పూర్తిస్థాయి బంద్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రైతులను, కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
రైల్వే కోర్టుకు డిప్యూటీ సీఎం..
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోర్టుకు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. రైల్వే కోర్టు పోలీస్‌లు, న్యాయవాది చింతం సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2014లో కడియం శ్రీహరి, నాయకురాలు మమత కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని నష్కల్‌లో రైలురోకో చేశారు. ఈ మేరకు శ్రీహరి, మమతపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీహరి, మమత రైల్వే కోర్టులో హాజరుకాగా.. ఎగ్జామినేషన్ తర్వాత కేసు 2017 అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేస్తు మెజిస్ట్రేట్ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. రైల్వే కోర్టుకు వచ్చిన కడియం శ్రీహరిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కలిశారు. కిషన్‌రెడ్డి, సునీత.. భువనగిరి రైలురోకో కేసుల్లో సోమవారం బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింత సాంబమూర్తి, మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన ఆలేరు ఎమ్మెల్యే సునీతతో పాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు నాయకులు కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఎగ్జామినేషన్ తర్వాత మెజిస్ట్రేట్ 2017 అక్టోబర్ 9వ తేదీకి కేసు వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపా రు. రైల్వే కోర్టుకు వచ్చిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు చింత సాంబమూర్తి, మనోహర్ రెడ్డికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ అర్బన్, రూ రల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తరవి, ఉడుతల బాబురావు, శివ, సదానందం స్వాగతం పలికారు.