మంటల్లో తగలబడుతున్న రైలు బోగీ
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్‌ఎస్‌పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు.
బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్‌టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత
హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్‌టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (ఆర్‌ఆర్‌బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది.
అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్‌సైట్‌లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద
అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్‌మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు.
అణచివేత ధోరణి సరికాదు
అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment