
ముజఫర్‌నగర్(యూపీ): భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. రైతు సంఘాల ఆందోళనల నుంచి దూరంగా ఉండకుంటే రాకేశ్ తికాయత్, ఆయన కుటుంబాన్ని బాంబు వేసి చంపుతామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా హెచ్చరించాడు. ఈ మేరకు రాకేశ్ తికాయత్ సోదరుడు గౌరవ్ తికాయత్, బీకేయూ అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ వ్యక్తిని గుర్తించి, పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని భవురా కలాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో అక్షయ్ శర్మ చెప్పారు. రద్దయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు సాగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నేతల్లో రాకేశ్ తికాయత్ ఒకరు. చట్టాలు రద్దయిన తర్వాత కూడా ఆయన దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై రైతు సంఘాలు చేపట్టే నిరసనల్లో పాల్గొంటున్నారు.