రైతుల్లో మోదీ సర్కార్ విభజన తీసుకొస్తోంది
బీజేపీ మేనిఫెస్టోను రైతాంగం నమ్మదు
పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ఆరోపణలు
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్‌కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్‌కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..
ఆర్‌ఎస్‌ఎస్ నేతలే రైతులుగా..
‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్‌కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్‌కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’
జిల్లాకు 40 దొంగ సంఘాలు
‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’
ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర
‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు.
సిఫార్సులపై మరోమారు నమ్మం
స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్‌ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’
Comments
Please login to add a commentAdd a comment