bharatiya kisan morcha
-
Rakesh Tikait: చీలికకు కేంద్రమే కారణం
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరే కంగా నెలల తరబడి పోరాడి మోదీ మెడలు వంచిన రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రధానభూమిక పోషించించింది. అలాంటి ఎస్కేఎంలో తాజా చీలిక కుట్ర వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. బీజేపీ కుట్రలు ఫలించడం వల్లే సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర)పేరిట మరో రైతు సంఘం పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు. ఎస్‌కేఎంకు ఎస్కేఎం(రాజకీయేతర)కు సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో తికాయత్ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్ఎస్ఎస్ నేతలే రైతులుగా.. ‘‘ ఒక్కటిగా ఉంటే మమ్మల్ని ఎదుర్కోలేమని గ్రహించే 41 రైతుల సంఘాల కూటమి అయిన ఎస్కేఎంలో సర్కార్ చీలిక తెచ్చింది. కొత్త సంఘం ఎస్కేఎం(రాజకీయేతర) ఢిల్లీ ఛలో అని పంజాబ్ నుంచి రైతులను తీసుకొచ్చి హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద ఉద్యమం చేస్తోంది. అసలు ఈ కార్యక్రమంపై మాతో వాళ్లు మాటవరసకైనా చెప్పలేదు. రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ నేతలే రైతులుగా నటిస్తూ పంజాబ్ నుంచి వచ్చిన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ జిల్లాకు 40 దొంగ సంఘాలు ‘‘ఒక్క నోయిడాలోనే భారతీయ కిసాన్ యూనియన్ పేరిట 37 రైతు సంఘాలను తెరిపించారు. వీటికి ఎమ్మెల్యేలే నడిపిస్తున్నారు. పంటలు, ఆ పంటల్ని పండించే కులాలవారీగా సంఘాలు తెరిచారు. జిల్లాకు 30–40 దొంగ సంఘాలు తెరచి రైతులందరినీ గందరగోళపరిచి, విభజించడమే మోదీ సర్కార్ లక్ష్యం’’ ఎర్రకోట ఘటన పోలీసు కుట్ర ‘‘ 2021 జనవరి 26 సంబంధ ఘటనల్లో పోలీసుల పాత్ర ఉంది. ఢిల్లీ ఐటీఓ ప్రాంతంలో నిలిపిఉంచిన ట్రాక్టర్లను పోలీసులే ఎర్రకోట వైపు నడిపేలా ఉసిగొల్పారు. నాడు ఉద్యమకారులను పోలీసులే తప్పుదోవ పట్టించారు. సిఫార్సులపై మరోమారు నమ్మం స్వామినాథన్ సిఫార్సులు అమలుచేస్తామని బీజేపీ 2014 మేనిఫెస్టోలో చెప్పింది. పదేళ్లయినా అమలుచేయలేదు. అందుకే 2024 బీజేపీ అజెండాను రైతులు నమ్మట్లేరు. విత్తనాలు, పురుగుమందులు, కూలీ ఖర్చులు, లీజు ఒప్పందం, ఇంథనం, సాగు ఖర్చులకు రైతు కుటుంబం ఉమ్మడి శ్రమ(ఏ2+ఎఫ్ఎల్)కు వెలకట్టి స్వామినాథన్ సిఫార్సుల్నే అమలుచేశామని కేంద్రం అబద్ధం చెబుతోంది. మేం సాగు ఖర్చుకు 50 శాతం విలువ జోడింపు అంటే సీ2+ 50 శాతం ఫార్ములా(స్వామినాథన్ సిఫార్సు) అమలుచేయాలని డిమాండ్‌చేస్తున్నాం’’ -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్‌గ్యాస్ షెల్స్‌కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ టియర్‌స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్‌ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్‌ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్‌బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
Mamata Banerjee: మోదీని గద్దె దించేద్దాం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార బీజేపీ, ప్రధాని∙మోదీపై సమరభేరి మోగించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. రాకేష్ తికాయత్, యుధ్వీర్ సింగ్ (భారతీయ యూనియన్) నేతృత్వంలో బుధవారం తనను కలుసుకున్న రైతు నాయకులతో మమత చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధరని కొనసాగించాలనే డికిసాన్మాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భేటీ తర్వాత తికాయత్ మీడియాతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఓటు వేయొద్దని విస్తృతంగా ప్రచారం నిర్వహించిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్, ఇతర రైతు నాయకులు వచ్చే ఏడాది యూపీ సహా అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే ప్రచారాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ‘మేము ప్రకృతి విపత్తులతో పాటు రాజకీయ విపత్తుల్ని ఎదుర్కొంటున్నాం’’ అని మమత అన్నారు. రైతన్నలకు మద్దతుగా బీజేపీయేతర రాష్ట్రాలన్నీ ఏకం కావాలంటూ ఆమె విపక్షాలకు పిలుపునిచ్చారు. చర్చలకు సిద్ధం: తోమర్ రైతులతో చర్చల్ని పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామనివ్యవసాయ మంత్రి తోమర్ చెప్పారు. అయితే వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరకర అంశాలను సహేతుకంగా చెప్పాలని రైతులకు సూచించారు. -
ఎన్నికల్లో బీజేపీని ఓడించండి
కోల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పంచాయత్‌లలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల వెన్ను విరుస్తోందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటాన్ని అణచి వేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ‘‘బీజేపీకి ఓటు వేయొద్దు. ఆ పార్టీకి అధికారం అప్పగిస్తే మీ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారు. మిమ్మల్ని భూమిలేని పేదలుగా మార్చేస్తారు. దేశాన్ని బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడతారు. మీరు ఉపాధి కోల్పోతారు’’ అని ప్రజలను అప్రమత్తం చేశారు. బీజేపీ మోసాలకు మారుపేరని దుయ్యబట్టారు. ఆ పార్టీ సంపన్నుల పక్షపాతి అన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారి పక్షాన తాము ఉంటామన్నారు. బీజేపీని వ్యతిరేకించేవారు రైతులు, పేదల పక్షాన ఉంటారని రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. కిసాన్ మహాపంచాయత్‌లలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తయిన ఇంట్లో సేదతీరుతున్న రైతులు -
ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తాం
కర్నాల్: డిమాండ్లను పరిష్కరించే వరకు రైతులు ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. కర్నాల్ జిల్లా ఇంద్రి ధాన్యం మార్కెట్లో ఆదివారం జరిగిన మహాపంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా నిరసనలు కొనసాగిస్తున్న రైతు సంఘాలకు చెందిన 40 మంది నేతలు మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తారని వెల్లడించారు. ‘డిమాం డ్లకు అంగీకరించకుండా, రైతు సంఘాలతో చర్చలు జరపకుండా ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ప్రశాంతంగా కూర్చో నివ్వకుండా చేస్తాం’అన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసం హరించుకోవాల్సిందేననీ, అప్పటి దాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలతో ప్రజా పంపిణీ వ్యవస్థ అంతమ వుతుందన్నారు. రైతులతోపాటు చిన్న వ్యాపా రులు, రోజు కూలీలు తదితరులపైనా ఈ చట్టాలు ప్రభావం చూపుతాయని తికాయత్ చెప్పారు. ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబో మని తెగేసి చెప్పారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు అనుకూలమనే విషయం రైతులకు తెలియదను కుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింఘు బోర్డర్లో జరుగుతున్న ఆందోళనలే రైతు నిరసనలకు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేశ్ తికాయత్ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఘాజీపూర్ వద్ద రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
పంజాబ్‌లో కిసాన్ మహా పంచాయత్
జాగ్రాన్(లూధియానా): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల్లోనే జరిగిన కిసాన్ మహా పంచాయత్‌కు తాజాగా పంజాబ్ వేదికగా మారింది. లూధియానా జిల్లాలోని జాగ్రాన్ మార్కెట్లో గురువారం నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌లో 40 రైతు సంఘాలు బలప్రదర్శన నిర్వహించాయి. 30 వేల మందికిపైగా రైతులు పాల్గొన్నారు. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలపై తరలివచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 40 రైతు సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రైతాంగాన్ని సర్వనాశనం చేస్తాయని భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్‌సింగ్ రాజేవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కిసాన్ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. రైతన్నల పోరాటం గురించి ఆందోళన జీవులంటూ తేలికగా మాట్లాడిన ప్రధాని∙మోదీ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో మాట మార్చారని అన్నారు. రైతులది పవిత్ర పోరాటం అంటున్నారని గుర్తుచేశారు. ‘మోదీ పెద్ద అబద్ధాలకోరు, నాటకాల రాయుడు’ అని రాజేవాల్ మండిపడ్డారు. వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని వెల్లడించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తప్పుడు చట్టాలు తెచ్చిందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పోరాటం కొత్త సాగు చట్టాలతో కార్పొరేట్ వ్యాపారులకు లాభం తప్ప రైతులకు ఒరిగేదేమీ ఉండదని రాజేవాల్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, విజయం తప్పకుండా వరిస్తుందని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం మేరకు తదుపరి పోరాట కార్యాచరణను రాజేవాల్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి నివాళిగా ఈ నెల 14న దేశవ్యాప్తంగా కొవ్వొత్తులు/కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సర్ చోటూరామ్‌ను స్మరించుకుంటూ ఈ నెల 16న కిసాన్/మజ్దూర్ దినం పాటిస్తామని వెల్లడించారు. 18న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో చేపడతామని వివరించారు. సుదీర్ఘపోరాటానికి సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ రైతులకు సూచించారు. కాంట్రాక్టు వ్యవసాయం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వంటివి తామెప్పుడూ ప్రభుత్వాన్ని కోరలేదని పేర్కొన్నారు. వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అవసరమైతే సవరణలు: మంత్రి రాజ్‌నాథ్ నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. ఈ చట్టాల్లో అవసరమైతే ప్రభుత్వం సవరణలు చేస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పలు చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాక రాజ్‌నాథ్ మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో సాధారణ రైతన్నల్లో కొత్త విశ్వాసం, ఉత్సాహం వచ్చిందని చెప్పారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య పరిగి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య అన్నారు. ఆదివారం పరిగిలోని పాలశీతలీకరణ కేంద్రంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. మండల నూతన అధ్యక్షుడిగా పెంటయ్యగుప్తా సమావేశం అనంతరం బీజేపీ మండల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడిగా పెంటయ్యగుప్తా, ఉపాధ్యక్షులుగా శ్యాంసుందర్, కాసుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులుగా జనార్దన్‌రెడ్డి, నర్సింహులు, కార్యదర్శిగా మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.