ఘాజీపూర్ వద్ద రైతులనుద్దేశించి మాట్లాడుతున్న, రాకేశ్ తికాయత్
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు ప్రధానమంత్రి అంటే గౌరవం ఉందని, అదే సమయంలో, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలోనూ వారు స్థిరంగా ఉన్నారని రైతు నేతలు, అన్నదమ్ములు నరేశ్ తికాయత్, రాకేశ్ తికాయత్ ఆదివారం స్పష్టం చేశారు. రైతులతో చర్చలకు తమ ప్రభుత్వం ఒక ఫోన్‌కాల్ దూరంలోనే ఉందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యపై వారు స్పందిస్తూ.. ఈ సమస్యకు ఒక మధ్యేమార్గ పరిష్కారం వెతకడానికి ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనేందుకు రైతులు సిద్ధంగానే ఉన్నారన్నారు.
సమస్యకు గౌరవప్రదమైన పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉందని, అయితే, ఒత్తిళ్ల మధ్య చర్చలు సాధ్యం కావని బీకేయూ ప్రధాన కార్యదర్శి రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. అదేసమయంలో, ప్రభుత్వం, పార్లమెంటు తమ ముందు లొంగిపోవాలని కూడా రైతులు కోరుకోవడం లేదన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడాలంటే ముందు అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయాలన్నది ఒక ప్రత్యామ్నాయ సూచన అని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ పేర్కొన్నారు. ‘చర్చలు జరగాల్సిందే. పరిష్కారం సాధించాల్సిందే. రైతుల డిమాండ్లు అంగీకరించాలి.
అయితే, మధ్యేమార్గ పరిష్కారంగా.. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు సాగు చట్టాల అమలును నిలిపేస్తామని హామీ ఇవ్వాలి. అలా ఇస్తే, మేం కూడా రైతులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం’ అని నరేశ్ తికాయత్ సూచించారు. సాగు చట్టాల అమలును 18 నెలల పాటు వాయిదా వేస్తామన్న ప్రతిపాదనకు కేంద్రం కట్టుబడే ఉందని ప్రధాని శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజు చోటు చేసుకున్న హింసను తికాయత్ సోదరులు ఖండించారు. అది ఉద్యమ వ్యతిరేకుల కుట్ర అని ఆరోపించారు. ‘అన్నిటికన్నా త్రివర్ణ పతాకం అత్యున్నతమైనది. జాతీయ జెండాను అవమానించడం ఎట్టి పరిస్థితుల్లో సహించం’ అని స్పష్టం చేశారు.
ఘాజీపూర్‌కు తరలివస్తున్న రైతులు
ఢిల్లీ– మీరట్ హైవేపై ఉన్న ఘాజీపూర్ వద్దకు రైతులు తరలివస్తున్నారు. ఈ కేంద్రం నుంచి రైతాంగ ఉద్యమానికి బీకేయూ నేత రాకేశ్ తికాయత్ నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ల నుంచి తరలి వస్తున్న రైతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ఘాజీపూర్ వద్ద భద్రత బలగాలను భారీగా మోహరించారు. మూడు అంచెల్లో ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘాజీపూర్ కేంద్రం వద్ద రైతులు శనివారం రాత్రంతా జానపద పాటలకు, దేశభక్తి గీతాలకు నృత్యాలు చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి గుర్జర్ల మద్దతు ఉంటుందని గుర్జర్ల నేత మదన్ భయ్యా తెలిపారు. అలాగే, రైతు ఉద్యమానికి మద్దతుగా ఉత్తర ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌లో ఆదివారం జరిగిన మూడో ‘సర్వ్ ఖాప్ మహా పంచాయత్’కు వేల సంఖ్యలో రైతులు హాజరయ్యారు. శుక్రవారం ముజఫర్ నగర్‌లో, మథురలో శనివారం ఈ మహా పంచాయత్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment