కారంచేడు–చీరాల మధ్య పడిపోయిన వరి పంట (ఫైల్)
కారంచేడు : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతన్నలను నిండా ముంచేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.11 లక్షల ఎకరాల్లో వరి, 2.57 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేశారు. వరి, శనగ సాగుల్లో ప్రకాశం జిల్లా రైతులు మంచి మెళకువలు పాటించి ఎక్కువ దిగుబడులు సాధిస్తుంటారు. కానీ వాతావరణం అనుకూలించక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కర్షకులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దిగుబడులు పతనమై, ధరలు దిగజారిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
ధాన్యాగారానికి తప్పని నష్టాలు..
జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంత రైతన్నలకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వాతావరణం అనుకూలించి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటున్న అన్నదాతలు ఈ ఏడాది మాత్రం పంట దిగుబడుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ఏడాది దిగుబడులు బాగున్నాయి, ధరలు కూడా బాగున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు లేకపోగా ధరలు కూడా పతనమవడంతో ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారు.జిల్లాలోని 12 సబ్ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో మొత్తం శనగ సాగు 2,56,598 ఎకరాల్లో, వరిసాగు 1,10,513 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయా«ధికారుల లెక్కలు చెబుతున్నాయి.
ఇంత ఘోరమైన దిగుబడులు గతంలో చూడలేదు
గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శనగ సాగు ఘోరంగా ఉంది. వాతావరణం అనుకూలించపోవడంతో కాపు తగ్గిపోయింది. చెట్టు బాగా పెరిగింది. కానీ కాయలు తగ్గిపోయాయి. దీంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వచ్చేలా ఉంది. ఒక్కో రైతు కనీసం 5 ఎకరాల వరకు సాగు చేశారు.
– దగ్గుబాటి నాగశ్రీను, రైతు, కారంచేడు
వరిలోనూ నష్టపోవాల్సిందే
ఈ ఏడాది వరి సాగులో కూడా రైతులు నష్టపోవాల్సిందే. ముదురులో సాగు చేసిన చేలల్లో కనీసం 90 శాతం పంట పడిపోయింది. దీంతో గింజ రాలిపోయింది. వాతావరణం ఈ ఏడాది అన్నదాతలను నిండా ముంచేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోగా ధరలో బస్తాకు రూ.300 వరకు తగ్గింది. దీంతో రైతులు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోవాల్సి వస్తుంది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుకు కొంత ఊరటగా ఉంటుంది.
– యార్లగడ్డ శ్రీకాంత్, రైతు, కారంచేడు
Comments
Please login to add a commentAdd a comment