సాక్షి, నల్లగొండ: రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో తమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత అరిగోస పడుతున్నాడు. అమ్ముకున్న ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా పేమెంట్లు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు.
దీంతో మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ చివరకు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ సంస్థ నుంచే సొమ్ములు అందాల్సి ఉంది. ప్రధాన కార్యాలయం నుంచే డబ్బుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లా అధికారులు సైతం ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు.
జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లపైకి వచ్చి రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 235 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.813.43కోట్ల విలువైన 4,59,565 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పెడుతుండు. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్‌లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, నెలలు గడుస్తున్నా.. డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ఇంకా చెల్లించాల్సిన బకాయి రూ.344 కోట్లు
ఐకేపీ, పీఏసీఎస్‌లు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ఇంకా రూ.344.04 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 73,582 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు కేవలం 39,958 మంది రైతులకు మాత్రమే రూ.469.39 కోట్లు చెల్లించారు. ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో వీరంతా ఇపుడు ఇంకెప్పుడు చెల్లింపులు జరుపుతారన్న ఆందోళనలో ఉన్నారు.
కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నామని, ప్రైవేటు వ్యాపారులకు, నేరుగా మిల్లర్లకు అమ్ముకున్న రైతుల చేతిలో ఎప్పుడో డబ్బులు పడ్డాయని, తాము మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, తమ అకౌంట్‌లో జమ అయిన వరకు రైతులకు బదిలీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.
ప్రధాన కార్యాలయం నుంచి నిధులు విడుదల కానిదే తామేమీ చేయలేమని వారు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రధాన కార్యాలయం నుంచి అందిన సొమ్ము కేవలం రూ.469.41 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో ఈసారి ఎక్కువగానే కొనుగోలు చేశారు. జిల్లాలోని మిల్లులకు 4,43,697 టన్నుల ధాన్యం తరలించి మిగిలిన 15,867 టన్నుల ధాన్యాన్ని సిద్ధిపేటలోని మిల్లుకు కూడా తరలించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కార్పొరేషన్ ..డబ్బులు చెల్లించడంలో మాత్రం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ ... గణాంకాలు
మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు |
కొనుగోలు |
రైతులకు చెల్లించిన మొత్తం |
ఇంకా చెల్లించాల్సిన డబ్బు |
ధాన్యం అమ్మిన రైతులు |
డబ్బులు అందిన రైతులు | ఎదురు చూస్తున్నవారు |
235 |
4,59,565 |
రూ.469.39 కోట్లు | రూ.344.04 కోట్లు | 73,582 | 39,958 | 33,62 |
ధాన్యం డబ్బులు రాలేదు
చిట్యాల : మా కుటుంబసభ్యులకు ఉన్న పొలంలో పండించిన 262 క్వింటాళ్ల ధాన్యాన్ని గుండ్రాంపల్లి గ్రామంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏప్రిల్ 29వ తేదీన అమ్మాను. నాకు సుమారుగా ఐదు లక్షలకు పైగా డబ్బులు రావాలి. నేటికీ రాలేదు. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు నెలల తరబడి రాకపోవడంతో పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ధాన్యం డబ్బులు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి.
– ఆకుల శంకరయ్య, రైతు. గుండ్రాంపల్లి. చిట్యాల మండలం.
Comments
Please login to add a commentAdd a comment