IKP centres
-
మా డబ్బులు.. మాకివ్వండి!
సాక్షి, నల్లగొండ: రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ కేంద్రాల్లో తమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత అరిగోస పడుతున్నాడు. అమ్ముకున్న ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా పేమెంట్లు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ చివరకు రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ సంస్థ నుంచే సొమ్ములు అందాల్సి ఉంది. ప్రధాన కార్యాలయం నుంచే డబ్బుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లా అధికారులు సైతం ఏం చేయలేక చేతులు ఎత్తేశారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లపైకి వచ్చి రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 235 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.813.43కోట్ల విలువైన 4,59,565 టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాల్లో అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకుంటూ.. ఇలా, అన్ని గండాలు దాటుకుని అమ్ముకున్న ధాన్యానికి వెంటనే డబ్బులు అందక అన్నదాత అరిగోస పెడుతుండు. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48గంటల లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ, నెలలు గడుస్తున్నా.. డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంకా చెల్లించాల్సిన బకాయి రూ.344 కోట్లు ఐకేపీ, పీఏసీఎస్‌లు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ఇంకా రూ.344.04 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 73,582 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు కేవలం 39,958 మంది రైతులకు మాత్రమే రూ.469.39 కోట్లు చెల్లించారు. ఇంకా 33,624 మంది రైతులకు డబ్బులు అందనే లేదు. దీంతో వీరంతా ఇపుడు ఇంకెప్పుడు చెల్లింపులు జరుపుతారన్న ఆందోళనలో ఉన్నారు. కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్నామని, ప్రైవేటు వ్యాపారులకు, నేరుగా మిల్లర్లకు అమ్ముకున్న రైతుల చేతిలో ఎప్పుడో డబ్బులు పడ్డాయని, తాము మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే... సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, తమ అకౌంట్లో జమ అయిన వరకు రైతులకు బదిలీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి నిధులు విడుదల కానిదే తామేమీ చేయలేమని వారు అశక్తత వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రధాన కార్యాలయం నుంచి అందిన సొమ్ము కేవలం రూ.469.41 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో ఈసారి ఎక్కువగానే కొనుగోలు చేశారు. జిల్లాలోని మిల్లులకు 4,43,697 టన్నుల ధాన్యం తరలించి మిగిలిన 15,867 టన్నుల ధాన్యాన్ని సిద్ధిపేటలోని మిల్లుకు కూడా తరలించారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన కార్పొరేషన్ ..డబ్బులు చెల్లించడంలో మాత్రం తాత్సారం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవీ ... గణాంకాలు మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు చెల్లించిన మొత్తం ఇంకా చెల్లించాల్సిన డబ్బు ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు అందిన రైతులు ఎదురు చూస్తున్నవారు 235 4,59,565 టన్నులు రూ.469.39 కోట్లు రూ.344.04 కోట్లు 73,582 39,958 33,62 ధాన్యం డబ్బులు రాలేదు చిట్యాల : మా కుటుంబసభ్యులకు ఉన్న పొలంలో పండించిన 262 క్వింటాళ్ల ధాన్యాన్ని గుండ్రాంపల్లి గ్రామంలోని సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏప్రిల్ 29వ తేదీన అమ్మాను. నాకు సుమారుగా ఐదు లక్షలకు పైగా డబ్బులు రావాలి. నేటికీ రాలేదు. అధికారులు మాత్రం ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు నెలల తరబడి రాకపోవడంతో పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ధాన్యం డబ్బులు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి. – ఆకుల శంకరయ్య, రైతు. గుండ్రాంపల్లి. చిట్యాల మండలం. -
ఆశలు గల్లంతు!
సాక్షి, పెద్దపల్లి : కొనుగోళ్లలో జాప్యం...అకాల వర్షం... వరదకు కొట్టుకుపోతున్న ధాన్యం... బురదనీళ్లలో గింజలు ఏరుకుంటు న్న రైతు ధైన్యం. జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యం. చమటోడ్చి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే అన్నదాత ఆశలు గల్లంతవుతున్నా యి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి, దళారులను ఆశ్రయించొద్దు అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఉండడం లేదనే విమర్శలున్నాయి. తేమ శాతం పేరిట కొనుగోళ్లలో విపరీతమైన జాప్యానికి తోడు, అకాల వర్షాలు రైతును నిండా ముంచుతున్నాయి. బాధ్యులెవరు? ప్రతీ సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 131 పీఏసీఎస్, 35 ఐకేపీ కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 7,24,320 క్వింటాళ్లు, ఐకేపీ ద్వారా 2,51,521 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే క్వింటాళ్ల కొద్దీ ధాన్యం రాశులు ఇప్పటికీ కొనుగోలు కాకుండా కేంద్రాల్లోనే పడిఉన్నాయి. తేమశాతం పేరిట కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని కేంద్రాల్లోనే ఆరబెడుతూ రైతులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతుల కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతోంది. ఆరబెట్టిన ధాన్యం, కుప్పలు పోసిన ధాన్యం కూడా వర్షానికి తడవడమే కాకుండా, వరద నీళ్లతో మోరీల పాలవుతోంది. టార్పాలిన్లు ఉన్నాయని చెబుతున్నా, అవి సమయానికి రైతులకు అందడం లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులకు ముందే టార్పాలిన్లు ఇవ్వాల్సి ఉండగా, సిబ్బంది తమ దగ్గరే ఉంచుకుని వర్షం పడుతున్న సమయంలో ఇస్తుండడంతో ధాన్యం తడిసిపోతుంది. కొన్ని చోట్ల చిరిగిన టార్పాలిన్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు టార్పాలిన్లు లేవు. స్థలాల ఎంపికలోనే సమస్య.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల స్థల ఎంపిక కూడా ఇబ్బందిగా మారింది. పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో కుంట కింద, కాలువ పక్కన కేంద్రం ఏర్పాటు చేయడంతో ధాన్యం నష్టం ఎక్కువ జరిగింది. వర్షానికి తోడు వరద నీళ్లు ముంచెత్తడంతో రైతులు తమ ధాన్యాన్ని అధిక మొత్తంలో నష్టపోతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం, వరదనీళ్ల కారణంగా గంట శ్రీకాంత్ అనే కౌలురైతుకు చెందిన ధాన్యం కుప్ప మొత్తం కొట్టుకుపోయింది. సకాలంలో తన ధాన్యం కొనుగోలు చేస్తే నష్టం తప్పేదని ఆ రైతు వాపోతున్నాడు. ఇంచిమించు జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తేమ, హమాలీ, రవాణా పేరిట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుంది. మద్దతు ధర వస్తుందని ఆశపడి కొనుగోలు కేంద్రాలకు వస్తే, ఆలస్యంతో తాము తెచ్చిన ధాన్యమే నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తమ కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోయిందని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. పంట విక్రయించి అప్పులు తీర్చి, పెట్టుబడికి మిగుల్చుకుందామనుకున్న సమయంలో పంట కొట్టుకుపోతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉండడంతో, ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. జాప్యం లేకుండా కొనుగోళ్లు – చంద్రప్రకాశ్‌రెడ్డి, డీసీవో రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండానే తూకం వేయిస్తున్నాం. తేమశాతం ఎక్కువగా ఉన్న రైతులే రెండు, మూడు రోజులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం నింపేందుకు అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. రవాణాపరమైన ఇబ్బందులు లేవు. టార్పాలిన్లను కూడా కేంద్రాల్లోనే ఉంచాం. అనుకోకుండా వర్షాలు కురవడం వల్లే అక్కడక్కడ కొంత మేరకు ధాన్యం తడిసింది. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. -
కొన్నది కొంతే
ఐకేపీ కేంద్రాల్లో మందగించిన ధాన్యం కొనుగోళ్లు సేకరణ లక్ష్యం 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు కొన్నది 40 శాతమే అందులోనూ మిల్లర్లు సేకరించిందే ఎక్కువ భీమవరం : ’జిల్లాలోని రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐకేపీ కేంద్రాలు, సొసైటీల ద్వారా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు 40 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. సార్వా సాగు ప్రారంభంలో సాగునీటి కొరత, చీడపీడలు వంటి ఇబ్బందుల నడుమ 5.50 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 10 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గత నెలలో ఐకేపీ కేంద్రాలు, సొసైటీల ద్వారా 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఈనెల 15వ తేదీ నాటికి 38,475 మంది రైతుల నుంచి 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులోనూ మిల్లర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు వచ్చిన ధాన్యమే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.575.61 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.485 కోట్లు చెల్లించారు. కష్టాలు అదనం మొన్నటి వరకు మంచు అధికంగా ఉండటం, యంత్రాలతో కోయించడం వంటి పరిస్థితుల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగింది. ఈ కారణంగా మద్దతు ధరలో భారీగా కోత విధించారు. కూలీల సాయంతో ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టినా తేమ శాతం తగ్గలేదు. ఫలితంగా, రైతులకు ఖర్చులు పెరిగిపోగా, గిట్టుబాటు ధర దక్కలేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడం, సాప్ట్వేర్ ఇబ్బందుల వల్ల రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. తెలంగాణలో ధర ఎక్కువ పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ధాన్యానికి మంచి ధర ఇచ్చింది. మన రాష్ట్రంలో ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ రకం ధాన్యానికి రూ.1,470 చొప్పున ధర నిర్ణయించారు. తెలంగాణలో మాత్రం రెండు రకాల ధాన్యంపై క్వింటాల్‌కు బోనస్ రూపంలో రూ.60 అదనంగా చెల్లించారు. ఇక్కడి రైతులకు బోనస్ ఇవ్వకపోగా, తేమ శాతం పేరిట కనీస మద్దతు ధరలోనూ భారీగా కోత విధించారు. దీంతో ఖమ్మం జిల్లాకు సరిహద్దున గల రైతులు తెలంగాణ రాష్ట్రానికి తరలించి విక్రయించారు. ముందుగానే కొనుగోలు చేసిన మిల్లర్లు కొవ్వూరు డివిజన్లో అక్టోబర్ నెలలోనే సార్వా మాసూళ్లు ప్రారంభం కాగా, రైస్ మిల్లర్లు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆలస్యంగా నవంబర్ 7న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో అప్పటికే మిల్లర్లు మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో క్వింటాల్‌కు రూ.100 చొప్పున అదనంగా చెల్లించారు. ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరగలేదని అధికారులు చెబుతున్నారు. -
ధర దగే?
పనిచేయని కొనుగోలు కేంద్రాలు నామ్‌కే వాస్తేగా ప్రభుత్వ రంగ సంస్థలు ‘ఈ-నామ్’పై బోలెడు సందేహాలు వారంలో మార్కెట్లకు రానున్న ఉత్పత్తులు ఆందోళనలో అన్నదాతలు గజ్వేల్: ఈసారి కూడా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల వ్యవహారంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. సివిల్‌సప్లయ్, ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ సంస్థలు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంతో సమస్య తీవ్రమైంది. అంతేకాకుండా సీసీఐ కూడా నామమాత్రంగా పనిచేస్తుండటంతో పత్తి రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. దళారులను నమ్ముతూ.. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్’ అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. సర్కారే కొనుగోలు బాధ్యతలు చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్.. వడ్లు కొనుగోలు చేసే సివిల్‌సప్లయ్(పౌర సరఫరాల శాఖ), ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ), ఆముదాలు, పొద్దుతిరుగుడు తదితర నూనె ఉత్పత్తులు కొనుగోలు చేసే అయిల్‌ఫెడ్ సంస్థలు జిల్లాలో తమ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. మరోపక్క పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కూడా నామమాత్రంగా కేంద్రాలను నడుపుతోంది. అంతేకాకుండా కొనుగోళ్లను పూర్తిగా సహకార సంఘాలు, ఇతర సంస్థలకు వదిలేస్తూ ప్రభుత్వరంగ సంస్థలు పర్యవేక్షణకే పరిమితమైంది. దీంతో మరో వారంలో మార్కెట్ పంటలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్’(ఈ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) విధానంతో మంచి ఫలితాలుంటాయని సర్కార్ వాదిస్తున్నా.. ప్రభుత్వ సంస్థలే నేరుగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. 1.22 లక్షల హెక్టార్లలో పంటలు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.22 లక్షల హెక్టార్లకుపైగా మొక్కజొన్న.. 84,175 హెక్టార్లలో పత్తి.. 34,272 హెక్టార్లకుపైగా వరి.. 40,593 హెక్టార్లలో కంది.. 29,396 హెక్టార్లలో సోయాబీన్.. 27,351 హెక్టార్లలో పెసర్లు సాగులోకి వచ్చాయి. మొక్కజొన్న ఉత్పత్తులు మరో వారంలో మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ రెండో వారం నుంచి ధాన్యం, పత్తి ఉత్పత్తులు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఆదుకోని మార్క్‌ఫెడ్ జిల్లాలో విస్త్రతంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాల్సిన మార్క్‌ఫెడ్.. ఆ బాధ్యతలను మరచిపోయింది. ఐకేపీ సంఘాలకే కొనుగోలు బాధ్యతలను అప్పగించి కేవలం పర్యవేక్షణకు పరిమితమైంది. మూడేళ్ల క్రితం గజ్వేల్‌లో మక్కల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అక్రమాలు చోటుచేసుకున్న వ్యవహారంలో ముగ్గురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం వరకు వరి ఉత్పత్తులకు సంబంధించి గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్ తదితర ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది కొనుగోలు కేంద్రాలను కొనసాగించింది. ప్రస్తుతం అవి కూడా మూతపడ్డాయి. కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 50 వరకు కేంద్రాలను ఏర్పాటు చేసి.. కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమైంది. ప్రతికూల ఫలితాలు గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేది కాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. అక్రమాల దృష్ట్యా గత ఏడాది నుంచి ఐకేపీ కేంద్రాలను సైతం కుదించారు. ప్రత్యేకించి సహకార సంఘాలు కొనుగోళ్ల రంగంలోకి రావడం ఇది మూడో ఏడాదే. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5 శాతం కమీషన్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థలకు మార్కెటింగ్ అధికారులు యార్డులున్న చోట కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తుండగా.. మిగిలినచోట్ల సంస్థలే కొనుగోలు బాధ్యతలు చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితిల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతోంది. ఇదిలా ఉండగా పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదు. సీజన్లో ఈ కేంద్రాలను నిరంతరంగా కొనసాగించకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి.. నష్టపోతున్నారు. ‘ఈ-నామ్’ సరే... ప్రభుత్వ రంగ సంస్థల మాటేమిటి? కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్’ మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విధానం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే కాకుండా దేశంలో మొదటి విడతలో ఉన్న 200 మార్కెట్లలో ఎక్కడైనా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఉత్పత్తులు ఎక్కువగా వచ్చినప్పుడు ధర తక్కువగా ఉండి నష్టపోకుండా సరుకుకు డిమాండ్ ఉన్న రాష్ట్రంలో ఆన్లైన్ ద్వారా అమ్ముకోవచ్చు. రైతులు ఎప్పటికప్పుడు ‘ఈ-నామ్’ ద్వారా దేశ మార్కెట్లలోని ధరలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా మరెన్నో లాభాలు ఈ విధానంలో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 44 మార్కెట్ యార్డుల్లో ‘ఈ-నామ్’ అమల్లోకి రాగా.. జిల్లాలోని గజ్వేల్, జోగిపేట, సదాశివపేట, జహీరాబాద్, సిద్దిపేట మార్కెట్లలో ఈ-నామ్ అమల్లోకి వచ్చింది. ఈ విధానం బాగానే ఉన్నా... కొనుగోళ్ల రంగంలోకి తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే తప్ప రైతుల ఇబ్బందులు తీరే అవకాశం లేదు. -
కొనుడు లేదు.. ఎత్తుడు లేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రైతులకు అండగా నిలిచే ధాన్యం కొనుగో లు కేంద్రాలు... ఈసారి గుదిబండను తలపిస్తున్నాయి. నెలరోజులు కావస్తున్నా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు కుప్పలు తెప్పలుగా ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. ముంద స్తు ప్రణాళిక లేకపోవటం... గతంలో అనుభవమున్న అధికారులు లేకపోవటం... ఎన్నికలు అడ్డంకిగా మారటం తో ఈసారి ధాన్యం కొనుగోలు విధానం గాడి తప్పింది. గన్నీ సంచుల కొరత... రవాణా సమస్యతో గందరగోళం తలెత్తింది. మరోవైపు మిల్లర్లు రకరకాల కుంటి సాకులతో కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు వెనుకాముం దాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు. దీంతో పం డించిన పంటను అమ్ముకునేందుకు రైతు లు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఈలోగా అకాల వర్షాలు.. గాలి దుమా రం.. అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండి.. వరద నీటికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు తల్లడిల్లుతున్నారు. ఇవేమీ పట్టనట్లుగా జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని ఐకేపీ కేంద్రాలు, సహకార సొసైటీల ద్వారా 3.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశా రు. కానీ.. ఈ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించటం లేదా వానకు తడవకుండా రక్షిత ప్రదేశానికి తరలించే విషయంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికీ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు కేంద్రాల్లోనే మగ్గుతుండటం అందుకు నిదర్శనం. సరిపడేన్ని వాహనాలు లేవనే సాకుతో అధికార యంత్రాంతం చేతులెత్తేస్తోంది. కానీ.. గతంలోనూ ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లాలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ట్రాక్టర్లు, భారీ వాహనాలను నిర్బంధంగా ధాన్యం రవాణా చేసేందుకు మళ్లించిన తీరును విస్మరించారు. దీంతో మంథని డివిజన్లోని కొన్ని కేంద్రాల్లో ఇరవై రోజులకుపైగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ధాన్యం తూకం వేసిన తర్వాత మిల్లులకు రవాణా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని.. రైతులపై అదనపు భారం మోపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్ మండలంలో ఐకేపీ ఆద్వర్యంలో జూబ్లీనగర్, నగునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలను నగునూరులోని రైసుమిల్లర్లు సకాలంలో దించుకోవడం లేదు. దీంతో ఆయా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకపోయాయి. అంతేకాకుండా తరుగు పేరిట రైసుమిల్లర్లు ట్రాక్టరు లోడ్‌లో రెండు క్వింటాళ్ల ధాన్యం కట్ చేస్తున్నారు. బావుపేటలోని కేంద్రానికి హుజూరాబాద్‌లోని రైసుమిల్లులను కెటాయించడంతో లారీ, ట్రాక్టర్ల యజమానులు తమ వాహనాలను రవాణాకు పెట్టడానికి ముందుకు రాకపోవడంతో తూకం వేసిన బస్తాలన్ని కేంద్రంలోనే ఉన్నాయి. సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో ట్రాన్స్‌పోర్టేషన్ లేక ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. చొప్పదండి మండల కొనుగోలు కేంద్రాల్లోనే 15వేల క్వింటాళ్ల ధాన్యం పేరుకుపోయింది. జమ్మికుంట మండలంలో ఎనిమిది ఐకేపీ కొనుగోలు కేంద్రాలున్నాయి. రవాణా సమస్య కారణంగా... వెయ్యి క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. హుస్నాబాద్ మండలంలో ఆరు కొనుగోలు కేంద్రాలున్నాయి. ట్రాన్స్పోర్టేషన్తో పాటు గన్ని సంచుల కొరతతో ధాన్యం మార్కెట్లోనే ఉండిపోతుంది. కమలాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో మిల్లరు కొనుగోలు చేసిన ధాన్యం తీసుకెళ్లడం లేదు. నాసిరకంగా ఉందనే సాకుతో అక్కడి మిల్లర్లు ధాన్యం రవాణకు తిరస్కరించటంతో అక్కడ సమస్య జటిలమైంది. ఆగ్రహం చెందిన రైతులు మంగళవారం ఉప్పల్ కొనుగోలు కేంద్రం ఎదుట ధాన్యాన్ని కుప్పగా పోసి నిప్పటించి.. తమ నిరసన వ్యక్తం చేశారు. కోరుట్ల, మెట్పల్లి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్లు జరగడం లేదు. వేములవాడ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రవాణా సమస్యతో పాటు గన్ని సంచుల కొరత ఉంది. ధర్మపురి, గొల్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఉంది. మంథని డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలన్నింటిలో రవాణా సమస్య తీవ్రంగా ఉంది. మానకొండూరు నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవటంతో ధాన్యం తడిసిపోయింది. రవాణా ప్రధాన సమస్యగా మారింది.