ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్ప చేస్తున్న రైతులు
సాక్షి, పెద్దపల్లి : కొనుగోళ్లలో జాప్యం...అకాల వర్షం... వరదకు కొట్టుకుపోతున్న ధాన్యం... బురదనీళ్లలో గింజలు ఏరుకుంటు న్న రైతు ధైన్యం. జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిత్యం కనిపిస్తున్న దృశ్యం. చమటోడ్చి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే అన్నదాత ఆశలు గల్లంతవుతున్నా యి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి, దళారులను ఆశ్రయించొద్దు అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఉండడం లేదనే విమర్శలున్నాయి. తేమ శాతం పేరిట కొనుగోళ్లలో విపరీతమైన జాప్యానికి తోడు, అకాల వర్షాలు రైతును నిండా ముంచుతున్నాయి.
బాధ్యులెవరు?
ప్రతీ సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 131 పీఏసీఎస్, 35 ఐకేపీ కొనుగోలు కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 7,24,320 క్వింటాళ్లు, ఐకేపీ ద్వారా 2,51,521 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే క్వింటాళ్ల కొద్దీ ధాన్యం రాశులు ఇప్పటికీ కొనుగోలు కాకుండా కేంద్రాల్లోనే పడిఉన్నాయి. తేమశాతం పేరిట కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని కేంద్రాల్లోనే ఆరబెడుతూ రైతులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతుల కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతోంది. ఆరబెట్టిన ధాన్యం, కుప్పలు పోసిన ధాన్యం కూడా వర్షానికి తడవడమే కాకుండా, వరద నీళ్లతో మోరీల పాలవుతోంది. టార్పాలిన్లు ఉన్నాయని చెబుతున్నా, అవి సమయానికి రైతులకు అందడం లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులకు ముందే టార్పాలిన్లు ఇవ్వాల్సి ఉండగా, సిబ్బంది తమ దగ్గరే ఉంచుకుని వర్షం పడుతున్న సమయంలో ఇస్తుండడంతో ధాన్యం తడిసిపోతుంది. కొన్ని చోట్ల చిరిగిన టార్పాలిన్లు ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు టార్పాలిన్లు లేవు.
స్థలాల ఎంపికలోనే సమస్య..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల స్థల ఎంపిక కూడా ఇబ్బందిగా మారింది. పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో కుంట కింద, కాలువ పక్కన కేంద్రం ఏర్పాటు చేయడంతో ధాన్యం నష్టం ఎక్కువ జరిగింది. వర్షానికి తోడు వరద నీళ్లు ముంచెత్తడంతో రైతులు తమ ధాన్యాన్ని అధిక మొత్తంలో నష్టపోతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షం, వరదనీళ్ల కారణంగా గంట శ్రీకాంత్ అనే కౌలురైతుకు చెందిన ధాన్యం కుప్ప మొత్తం కొట్టుకుపోయింది. సకాలంలో తన ధాన్యం కొనుగోలు చేస్తే నష్టం తప్పేదని ఆ రైతు వాపోతున్నాడు. ఇంచిమించు జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తేమ, హమాలీ, రవాణా పేరిట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుంది. మద్దతు ధర వస్తుందని ఆశపడి కొనుగోలు కేంద్రాలకు వస్తే, ఆలస్యంతో తాము తెచ్చిన ధాన్యమే నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తమ కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోయిందని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. పంట విక్రయించి అప్పులు తీర్చి, పెట్టుబడికి మిగుల్చుకుందామనుకున్న సమయంలో పంట కొట్టుకుపోతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉండడంతో, ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
జాప్యం లేకుండా కొనుగోళ్లు – చంద్రప్రకాశ్‌రెడ్డి, డీసీవో
రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండానే తూకం వేయిస్తున్నాం. తేమశాతం ఎక్కువగా ఉన్న రైతులే రెండు, మూడు రోజులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం నింపేందుకు అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. రవాణాపరమైన ఇబ్బందులు లేవు. టార్పాలిన్లను కూడా కేంద్రాల్లోనే ఉంచాం. అనుకోకుండా వర్షాలు కురవడం వల్లే అక్కడక్కడ కొంత మేరకు ధాన్యం తడిసింది. రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment