కొనుడు లేదు.. ఎత్తుడు లేదు | Buying grain farmers support centers ... | Sakshi
Sakshi News home page

కొనుడు లేదు.. ఎత్తుడు లేదు

Published Wed, May 28 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

Buying grain farmers support centers ...

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :  రైతులకు అండగా నిలిచే ధాన్యం కొనుగో లు కేంద్రాలు... ఈసారి గుదిబండను తలపిస్తున్నాయి. నెలరోజులు కావస్తున్నా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు కుప్పలు తెప్పలుగా ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. ముంద స్తు ప్రణాళిక లేకపోవటం... గతంలో అనుభవమున్న అధికారులు లేకపోవటం... ఎన్నికలు అడ్డంకిగా మారటం తో ఈసారి ధాన్యం కొనుగోలు విధానం గాడి తప్పింది. గన్నీ సంచుల కొరత... రవాణా సమస్యతో గందరగోళం తలెత్తింది.
 
 మరోవైపు మిల్లర్లు రకరకాల కుంటి సాకులతో కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు వెనుకాముం దాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు. దీంతో పం డించిన పంటను అమ్ముకునేందుకు రైతు లు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఈలోగా అకాల వర్షాలు.. గాలి దుమా రం.. అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండి.. వరద నీటికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు తల్లడిల్లుతున్నారు. ఇవేమీ పట్టనట్లుగా జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది.
 
 ఇప్పటివరకు జిల్లాలోని ఐకేపీ కేంద్రాలు, సహకార సొసైటీల ద్వారా 3.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశా రు. కానీ.. ఈ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించటం లేదా వానకు తడవకుండా రక్షిత ప్రదేశానికి తరలించే విషయంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికీ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల  ధాన్యం నిల్వలు కేంద్రాల్లోనే మగ్గుతుండటం అందుకు నిదర్శనం.
 
 సరిపడేన్ని వాహనాలు లేవనే సాకుతో అధికార యంత్రాంతం చేతులెత్తేస్తోంది. కానీ.. గతంలోనూ ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లాలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ట్రాక్టర్లు, భారీ వాహనాలను నిర్బంధంగా ధాన్యం రవాణా చేసేందుకు మళ్లించిన తీరును విస్మరించారు. దీంతో మంథని డివిజన్‌లోని కొన్ని కేంద్రాల్లో ఇరవై రోజులకుపైగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ధాన్యం తూకం వేసిన తర్వాత మిల్లులకు రవాణా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనని.. రైతులపై అదనపు భారం మోపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
 కరీంనగర్ మండలంలో ఐకేపీ ఆద్వర్యంలో జూబ్లీనగర్, నగునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలను నగునూరులోని రైసుమిల్లర్లు సకాలంలో దించుకోవడం లేదు. దీంతో ఆయా కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకపోయాయి. అంతేకాకుండా తరుగు పేరిట  రైసుమిల్లర్లు ట్రాక్టరు లోడ్‌లో రెండు క్వింటాళ్ల ధాన్యం కట్ చేస్తున్నారు.
 
 బావుపేటలోని కేంద్రానికి హుజూరాబాద్‌లోని రైసుమిల్లులను కెటాయించడంతో లారీ, ట్రాక్టర్ల యజమానులు తమ వాహనాలను రవాణాకు పెట్టడానికి ముందుకు రాకపోవడంతో తూకం వేసిన బస్తాలన్ని కేంద్రంలోనే ఉన్నాయి.
 
 సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో ట్రాన్స్‌పోర్టేషన్ లేక ధాన్యమంతా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. చొప్పదండి మండల కొనుగోలు కేంద్రాల్లోనే 15వేల క్వింటాళ్ల ధాన్యం పేరుకుపోయింది.
 
 జమ్మికుంట మండలంలో ఎనిమిది ఐకేపీ కొనుగోలు కేంద్రాలున్నాయి. రవాణా సమస్య కారణంగా... వెయ్యి క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి.
 
 హుస్నాబాద్ మండలంలో ఆరు కొనుగోలు కేంద్రాలున్నాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు గన్ని సంచుల కొరతతో ధాన్యం మార్కెట్లోనే ఉండిపోతుంది.
 
 కమలాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో మిల్లరు కొనుగోలు చేసిన ధాన్యం తీసుకెళ్లడం లేదు. నాసిరకంగా ఉందనే సాకుతో అక్కడి మిల్లర్లు ధాన్యం రవాణకు తిరస్కరించటంతో అక్కడ సమస్య జటిలమైంది. ఆగ్రహం చెందిన రైతులు మంగళవారం ఉప్పల్ కొనుగోలు కేంద్రం ఎదుట ధాన్యాన్ని కుప్పగా పోసి నిప్పటించి.. తమ నిరసన వ్యక్తం చేశారు.
 
 కోరుట్ల, మెట్‌పల్లి కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్లు జరగడం లేదు. వేములవాడ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రవాణా సమస్యతో పాటు గన్ని సంచుల కొరత ఉంది. ధర్మపురి, గొల్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఉంది.
 
 మంథని డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలన్నింటిలో రవాణా సమస్య తీవ్రంగా ఉంది. మానకొండూరు నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవటంతో ధాన్యం తడిసిపోయింది. రవాణా ప్రధాన సమస్యగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement