కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి స్వయం ఉపాధి పథకాల కింద లబ్దిదారులను ఎంపిక చేయాలని ఇన్‌చార్జీ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నెల 21లోగా అధికారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో కరీంనగర్ డివిజన్‌స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైకార్ కింద మండలాల వారీగా మంజూరైన స్వయం ఉపాధి యూనిట్ల ఎంపిక ప్రక్రియను జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లతో కలిసి ఆయన సమీక్షించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ఎంపిక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఆయా కార్పొరేషన్లకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు యూనిట్ కాస్ట్‌లో సబ్సిడీ 60 శాతం, గరిష్టంగా రూ.లక్ష, బీసీ, మైనార్టీ, వికలాంగులకు 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు.
మండల ఎంపిక కమిటీలో గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులతోపాటు ముగ్గురు సామాజిక కార్యకర్తలు, అందులో ఒకరు మహిళ ఉంటారన్నారు. లబ్ధిదారుల్లో 33 శాతం యూనిట్లు మహిళలకు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 21 నుంచి 45 సంవత్సరాల వయస్సు, బీసీ, మైనార్టీలకు 21 నుచి 40 సంవత్సరాల వయస్సు పరిమితి ఉంటుందన్నారు. జోగినులు, మోచీలు, ప్రత్యేక తరగతులు, హెచ్‌ఐవీ, లైంగికదాడి బాధితులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. సమావేశంలో ఏజేసీ మనోహర్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, డీఆర్డీఏ పీడీ జె.శంకరయ్య పాల్గొన్నారు.
21లోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
Published Sat, Jan 11 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement