karimnagar division
-
మళ్లీ అలజడి
వీణవంక : ఇందిరమ్మ ఇంటి దొంగల భరతం పట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి మంత్రి వర్గం ఇటీవల తీర్మానించినట్లు తెలిసింది. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. మరో దఫా సర్వే చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో రెండు రోజుల క్రితం సీఐడీ డీఎస్పీ క్రిష్ణ ఆధ్వర్యంలో వీణవంక మండలం రెడ్డిపల్లి, కొండపాక, మంథని నియోజకవర్గంలోని రుద్రారం, పెగడపల్లి గ్రామాల్లో మూడో విడత సర్వే చేపట్టారు. ఇప్పటికే రెండు విడతలుగా విచారణ జరిపిన సీఐడీ బృందం.. నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందించింది. మంథనిలోని రుద్రారం, వీణవంక మండలంలోని రెడ్డిపల్లిలో భారీ అక్రమాలు జరిగాయని సీఐడీ బృందం నిగ్గుతేల్చింది. మంథని, వీణవంక మండలాల్లో కలిపి 2634ఇళ్లు మంజూరు కాగా ఇందులో 520మంది అక్రమాల పాల్పడ్డట్లు సీఐడీ గుర్తించినట్లు సమాచారం. 2014 ఆగస్టు14న జిల్లాలో సీఐడీ విచారణ ప్రారంభించింది. కరీంనగర్ డివిజన్‌లోనే రెడ్డిపల్లి అవినీతిలో టాప్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నాలుగు గ్రామాల్లో 2634ఇళ్లు ఉండగా, రెడ్డిపల్లిలో 556కు 17, కొండపాకలో 334కు 21, రుద్రారంలో 1344కు 147, పెగడపల్లిలో 400కు 80ఇళ్లలో అక్రమాలు జరిగాయని మొదటి విడత తనిఖీలో వెలుగులోకి వచ్చాయి. రెండో విడతలో భాగంగా రెడ్డిపల్లిలో ఒకే ఇంటిపై 42మంది బిల్లులు పొందగా, 10మంది ప్రభుత్వ ఉద్యోగులు, 16మంది మైనర్లు, పాత ఇంటికే బిల్లులు పొందిన వారు 23మంది ఉన్నట్లు సీఐడీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. ఇక్కడ వీవోలే సగానికి పైగా అక్రమాలకు పాల్పడ్డట్లు సమాచారం. కొండపాకలో సగానికి పైగా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మించుకున్నట్లు తనిఖీలో వెల్లడైంది. మచ్చుకు కొన్ని.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్భాక సువర్ణ, ఎల్భాక వజ్రమ్మకు 2004లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. వీరు స్వయంగా అత్తాకోడళ్లు. వీరు ఇల్లు నిర్మించి రూ.50వేల బిల్లు తీసుకున్నారు. ఇదే ఇంటిపై వజ్రమ్మ ఫేజ్-1కింద మళ్లీ ఇల్లు మంజూరు చేసుకొంది. మరో రూ.25వేలు అధికారులు ఇచ్చారు. అంటే ఒకే ఇంటిపై మూడు బిల్లులు(రూ.75వేలు)పొందారు.అయితే అసలు విషయాన్ని సీఐడీ అధికారులు గుర్తించారు. అసలు వీళ్లు 2003లోనే ఇల్లు కట్టుకున్నట్లు అధికారుల తనిఖీలో బయట పడింది. పాత ఇంటికే బిల్లులు పొందడమే కాగా కమర్షియల్‌గా రూపుదిద్ది హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు లీజుకు ఇవ్వడంపై అధికారులే నివ్వరపోయారు. మంథనిలోని రుద్రారంలో 68ఇళ్లు దళారులు అమ్మకున్నట్లు తేలింది. లబ్ధిదారులకు తెలియకుండా సొమ్ము కాజేశారు. రెడ్డిపల్లికి చెందిన రమకు 2006లో ఇల్లు మంజూరైంది. ఆమె కుటుంబ సభ్యులు రైల్వే ఉద్యోగిగా అధికారులు గుర్తించారు. ఇదే గ్రామానికి చెందిన పోతుల మాణిక్యం ఇద్దరు కూతుళ్లకు రెండు ఇళ్లు మంజూరయ్యాయి. వీరికి రూ.54వేలు అందినట్లుగా అధికారులు గుర్తించారు. కానీ రూ.9వేలు మాత్రమే వీవోలు ఇచ్చినట్లు సీఐడీకి మొరపెట్టుకోవడంతో రూ.45వేలు అక్రమాలు జరిగాయని గుర్తించారు. కొండపాకకు చెందిన కూర నరసింహారెడ్డి ఇల్లు నిర్మించుకోగా రూ.28వేలు ముట్టినట్లు గా రికార్డుల్లో ఉంది. కానీ రూ.5500తోపా టు ఎనిమిది సిమెంటు బస్తాలు అందినట్లు అతడి కుమారుడు సతీష్‌రెడ్డి తెలిపారు. అక్రమార్కుల్లో వణుకు.. మంథని, హుజురాబాద్ నియోజకవర్గాల్లోని ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై గురువారం గృహ నిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరన్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో నాలుగు నెలలుగా స్తబ్ధుగా ఉన్న గ్రామాల్లో మళ్లీ సీఐ డీ తనిఖీలు అలజడి రేపారుు. ముఖ్యంగా అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. -
12,66,720
- లెక్క తేలిన కుటుంబాల సంఖ్య - మూడేళ్లలో 29.87% పెరుగుదల - నూటికి 104.45 % దాటిన సర్వే - మొత్తం 104.45% కుటుంబాల సర్వే - ఎలిగేడు, మహదేవ్‌పూర్‌లో తగ్గిన శాతం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఒక్క రోజు సమగ్ర సర్వేతో జిల్లాలోని కుటుంబాల సంఖ్య నిక్కచ్చిగా లెక్క తేలింది. మొత్తం 12,66,720 కుటుంబాలున్నట్లు వెల్లడైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9,76,022 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అప్పటితో పోలిస్తే మూడేళ్ల వ్యవధిలో 29.87 శాతం కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. కరీంనగర్ డివిజన్‌లోఅత్యధికంగా 35.28 శాతం, సిరిసిల్ల డివిజన్లో 34.50 శాతం కుటుంబాల సంఖ్య పెరిగినట్లు లెక్కతేలింది. ముందుగా గుర్తించిన కుటుంబాలతో పోలిస్తే సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... జిల్లాలో 104.45 శాతం సర్వే పూర్తయినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. సర్వేకు సంబంధించి ఇంటి నంబర్లు వేసే సమయంలో జిల్లాలో 12.12 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీరా.. సర్వే చేసే సమయానికి ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొత్తం 12,66,720 కుటుంబాల వివరాలను సర్వే సిబ్బంది నమోదు చేశారు. తమ ఇంటి నంబర్లు గల్లంతయ్యాయని చాలా కుటుంబాలు అప్పటికప్పుడు నంబర్లు వేయించుకుని తమ వివరాలు నమోదు చేయించటం... దూరప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది కుటుంబాలు అదే రోజున సర్వేలో ఎంట్రీ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ముందుగా నంబర్లు వేయనప్పటికీ.. అడిగిన వారందరికీ తక్షణమే నంబర్లు కేటాయించి వివరాలు నమోదుకు జిల్లా యం త్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేయటంతో సర్వే సంపూర్ణమైంది. గంగాధర మండలంలో అత్యధికంగా 109 శాతం, చొప్పదండి, భీమదేవరపల్లి, రాయికల్, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో 108 శాతం సర్వే జరిగింది. ముందుగా అధికారులు గుర్తించిన కుటుంబాల కంటేతక్కువగా ఎలిగేడు మండలంలో కేవలం 95.39 శాతం, మహదేవ్పూర్ మండలంలో 98.55 శాతం కుటుంబాలు తమ వివరాలు నమోదు చేయించటం గమనార్హం. ఇబ్రహీంపట్నం మండలంలో పక్కాగా నూటికి నూరు శాతం సర్వే జరగ్గా... జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో వంద శాతానికి మించి సర్వే జరిగినట్లు అధికారులు ప్రకటించారు. రామగుండంలో 105 శాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 40,424 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాలుపంచుకున్నారు. ఇక డాటా ఎంట్రీ సర్వే ద్వారా సేకరించిన కుటుంబాల వివరాలు డాటా ఎంట్రీ చేసేందుకు జిల్లాలో దాదా పు మూడు వేల కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. మంథని, కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో దాదాపు 300 కంప్యూటర్లను డాటా ఎంట్రీకి వినియోగిస్తున్నారు. వీటికి తోడుగా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, పట్టణ ప్రాంతాల్లో ఆర్డీవో కార్యాలయాలు, మండలాల్లో తహసీల్ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకి ప్రత్యేకంగా కంప్యూటర్లను సిద్ధం చేశారు. -
లేరు లేరంటూనే.. ఎనిమిది వేలు!
బాలకార్మికులు రెండు వేలకు మించిలేరు... అనాథపిల్లల సంఖ్య అంతంత మాత్రమే... డ్రాపవుట్లు వెతికినా పదుల సంఖ్యలోనే ఉన్నారు... బడికి దూరంగా ఉన్న పిల్లలు కూడా వేళ్లపై లెక్కించే సంఖ్యలోనే ఉన్నారు. కానీ... కేవలం వీరికోసం నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 7,930 మంది బాలికలు చదువుతున్నారు. అంటే అధికారులు చెప్పేదానికి.. వాస్తవానికి ఎక్కడా పొంతన లేదని అర్థమవుతోంది. ప్రధానంగా కేజీబీవీల్లో చదువుతున్న బాలికల సంఖ్య అంచనాకు మించి ఉండటం అనుమానాలకు దారితీస్తోంది. రెగ్యులర్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. అందుకే ఈ గణాంకాల్లో తేడా ఉందని తేలిపోతోంది. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఇటీవల కరీంనగర్ డివిజన్లో ఒక ఎంఈవో అక్కడి కేజీబీవీలో 40 మందికిపైగా రెగ్యులర్ విద్యార్థులు ఉన్న ట్లు స్వయంగా గుర్తించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారిని తిరిగి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారులు సైతం బిత్తరపోయారు. అన్ని కేజీబీవీల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. ఒకవైపు రెగ్యులర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే కేజీబీవీలకు విద్యార్థులను మళ్లించటం కొత్త అనుమానాలకు తెరలేపింది. జిల్లాలో మొత్తం 51 కేజీబీవీలున్నాయి. వీటిలో 42 విద్యాలయాలను స్వయంగా రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షిస్తోంది. బాలకార్మికులు.. అనాథపిల్లలు... డ్రాపవుట్లు.. బడికి దూరంగా ఉన్న బాలికలను మాత్రమే వీటిలో చేర్చుకోవాలి. ఇవన్నీ స్పెషలాఫీసర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల అధ్వర్యంలో నడుస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్లు, సర్కారు పాఠశాలలతో పోలిస్తే ఈ విద్యాలయాలకు ప్రభుత్వం దాదాపు రెండింతలు ఖర్చు చేస్తోంది. ఒక్కో విద్యార్థినికి రోజుకు అల్పాహారం భోజనం ఖర్చుల కింద రూ.33 విడుదల చేస్తోంది. ఎంబ్రాయిడరీ తదితర ఉపాధి కోర్సుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కేజీబీవీల నిర్వహణను రాజీవ్ విద్యామిషన్ తమ గుప్పిట బిగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోధన, భోజన వసతి సదుపాయాలు ఒకేచోట ఉంటాయని ఆశజూపి కొన్నిచోట్ల రెగ్యులర్ విద్యార్థులను మళ్లించటం.. కొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నా ఎక్కువ సంఖ్య చూపించటం వెనుక ఎక్కువ పర్సెంటేజీలు మిగులుతాయనే కక్కుర్తి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. నెల రోజులైనా కేజీబీవీ పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేయకుండా రాజీవ్ విద్యామిషన్ అధికారులు దాచిపెట్టిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఏ కార్యాలయంలో ఇటీవల వివిధ సెక్షన్ల అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం వెనుక కేజీబీవీలకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లే కారణమనే విమర్శలున్నాయి. గత ఏడాది కేజీబీవీలకు కుట్టుమిషన్లతో పాటు వివిధ సామగ్రిని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు, కమిషన్లలో ఎవకిరి వారుగా చేతివాటం ప్రదర్శించటమే కార్యాలయంలో వివిధ సెక్షన్ల మధ్య వివాదానికి తెర లేపిందని తెలుస్తోంది. ఆపన్నులకు, కొత్తగా బడిబాట పట్టిన బాలికలకు నాణ్యమైన బోధన అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేజీబీవీలు ఆర్వీఎం అధికారుల నిర్లక్ష్యం.. ఇష్టారాజ్యంతో గాడి తప్పుతున్న సంకేతాలు జారీ చేస్తున్నాయి. -
21లోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి స్వయం ఉపాధి పథకాల కింద లబ్దిదారులను ఎంపిక చేయాలని ఇన్చార్జీ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. ఈ నెల 21లోగా అధికారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో కరీంనగర్ డివిజన్‌స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైకార్ కింద మండలాల వారీగా మంజూరైన స్వయం ఉపాధి యూనిట్ల ఎంపిక ప్రక్రియను జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లతో కలిసి ఆయన సమీక్షించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ఎంపిక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఆయా కార్పొరేషన్లకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు యూనిట్ కాస్ట్లో సబ్సిడీ 60 శాతం, గరిష్టంగా రూ.లక్ష, బీసీ, మైనార్టీ, వికలాంగులకు 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. మండల ఎంపిక కమిటీలో గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులతోపాటు ముగ్గురు సామాజిక కార్యకర్తలు, అందులో ఒకరు మహిళ ఉంటారన్నారు. లబ్ధిదారుల్లో 33 శాతం యూనిట్లు మహిళలకు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 21 నుంచి 45 సంవత్సరాల వయస్సు, బీసీ, మైనార్టీలకు 21 నుచి 40 సంవత్సరాల వయస్సు పరిమితి ఉంటుందన్నారు. జోగినులు, మోచీలు, ప్రత్యేక తరగతులు, హెచ్ఐవీ, లైంగికదాడి బాధితులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. సమావేశంలో ఏజేసీ మనోహర్, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, డీఆర్డీఏ పీడీ జె.శంకరయ్య పాల్గొన్నారు.