లేరు లేరంటూనే.. ఎనిమిది వేలు! | There are eight finger | Sakshi
Sakshi News home page

లేరు లేరంటూనే.. ఎనిమిది వేలు!

Published Wed, Jul 16 2014 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

లేరు లేరంటూనే.. ఎనిమిది వేలు!

లేరు లేరంటూనే.. ఎనిమిది వేలు!

బాలకార్మికులు రెండు వేలకు మించిలేరు... అనాథపిల్లల సంఖ్య అంతంత మాత్రమే... డ్రాపవుట్లు వెతికినా పదుల సంఖ్యలోనే ఉన్నారు... బడికి దూరంగా ఉన్న పిల్లలు కూడా వేళ్లపై లెక్కించే సంఖ్యలోనే ఉన్నారు. కానీ... కేవలం వీరికోసం నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 7,930 మంది బాలికలు చదువుతున్నారు. అంటే అధికారులు చెప్పేదానికి.. వాస్తవానికి ఎక్కడా పొంతన లేదని అర్థమవుతోంది. ప్రధానంగా కేజీబీవీల్లో చదువుతున్న బాలికల సంఖ్య అంచనాకు మించి ఉండటం అనుమానాలకు దారితీస్తోంది. రెగ్యులర్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. అందుకే ఈ గణాంకాల్లో తేడా ఉందని తేలిపోతోంది.
 - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
 
 ఇటీవల కరీంనగర్ డివిజన్‌లో ఒక ఎంఈవో అక్కడి కేజీబీవీలో 40 మందికిపైగా రెగ్యులర్ విద్యార్థులు ఉన్న ట్లు స్వయంగా గుర్తించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారిని తిరిగి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారులు సైతం బిత్తరపోయారు. అన్ని కేజీబీవీల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. ఒకవైపు రెగ్యులర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే కేజీబీవీలకు విద్యార్థులను మళ్లించటం కొత్త అనుమానాలకు తెరలేపింది.
 
 జిల్లాలో మొత్తం 51 కేజీబీవీలున్నాయి. వీటిలో 42 విద్యాలయాలను స్వయంగా రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షిస్తోంది. బాలకార్మికులు.. అనాథపిల్లలు... డ్రాపవుట్లు.. బడికి దూరంగా ఉన్న బాలికలను మాత్రమే వీటిలో చేర్చుకోవాలి. ఇవన్నీ స్పెషలాఫీసర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల అధ్వర్యంలో నడుస్తున్నాయి.
 
 
 సంక్షేమ హాస్టళ్లు, సర్కారు పాఠశాలలతో పోలిస్తే ఈ విద్యాలయాలకు ప్రభుత్వం దాదాపు రెండింతలు ఖర్చు చేస్తోంది. ఒక్కో విద్యార్థినికి రోజుకు అల్పాహారం భోజనం ఖర్చుల కింద రూ.33 విడుదల చేస్తోంది. ఎంబ్రాయిడరీ తదితర ఉపాధి కోర్సుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కేజీబీవీల నిర్వహణను రాజీవ్ విద్యామిషన్ తమ గుప్పిట బిగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 బోధన, భోజన వసతి సదుపాయాలు ఒకేచోట ఉంటాయని ఆశజూపి కొన్నిచోట్ల రెగ్యులర్ విద్యార్థులను మళ్లించటం.. కొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నా ఎక్కువ సంఖ్య చూపించటం వెనుక ఎక్కువ పర్సెంటేజీలు మిగులుతాయనే కక్కుర్తి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి.
 
 నెల రోజులైనా కేజీబీవీ పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేయకుండా రాజీవ్ విద్యామిషన్ అధికారులు దాచిపెట్టిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో ఇటీవల వివిధ సెక్షన్ల అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం వెనుక కేజీబీవీలకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లే కారణమనే విమర్శలున్నాయి.
 
 గత ఏడాది కేజీబీవీలకు కుట్టుమిషన్లతో పాటు వివిధ సామగ్రిని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు, కమిషన్లలో ఎవకిరి వారుగా చేతివాటం ప్రదర్శించటమే కార్యాలయంలో వివిధ సెక్షన్ల మధ్య వివాదానికి తెర లేపిందని తెలుస్తోంది. ఆపన్నులకు, కొత్తగా బడిబాట పట్టిన బాలికలకు నాణ్యమైన బోధన అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేజీబీవీలు  ఆర్‌వీఎం అధికారుల నిర్లక్ష్యం.. ఇష్టారాజ్యంతో గాడి తప్పుతున్న సంకేతాలు జారీ చేస్తున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement