కొన్నది కొంతే
కొన్నది కొంతే
Published Fri, Dec 16 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
ఐకేపీ కేంద్రాల్లో మందగించిన ధాన్యం కొనుగోళ్లు
సేకరణ లక్ష్యం 10 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు కొన్నది 40 శాతమే
అందులోనూ మిల్లర్లు సేకరించిందే ఎక్కువ
భీమవరం :
’జిల్లాలోని రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లో సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐకేపీ కేంద్రాలు, సొసైటీల ద్వారా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు 40 శాతం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. సార్వా సాగు ప్రారంభంలో సాగునీటి కొరత, చీడపీడలు వంటి ఇబ్బందుల నడుమ 5.50 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన అధికారులు 10 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గత నెలలో ఐకేపీ కేంద్రాలు, సొసైటీల ద్వారా 200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఈనెల 15వ తేదీ నాటికి 38,475 మంది రైతుల నుంచి 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులోనూ మిల్లర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు వచ్చిన ధాన్యమే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.575.61 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.485 కోట్లు చెల్లించారు.
కష్టాలు అదనం
మొన్నటి వరకు మంచు అధికంగా ఉండటం, యంత్రాలతో కోయించడం వంటి పరిస్థితుల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగింది. ఈ కారణంగా మద్దతు ధరలో భారీగా కోత విధించారు. కూలీల సాయంతో ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టినా తేమ శాతం తగ్గలేదు. ఫలితంగా, రైతులకు ఖర్చులు పెరిగిపోగా, గిట్టుబాటు ధర దక్కలేదు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడం, సాప్ట్‌వేర్ ఇబ్బందుల వల్ల రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు.
తెలంగాణలో ధర ఎక్కువ
పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ధాన్యానికి మంచి ధర ఇచ్చింది. మన రాష్ట్రంలో ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ రకం ధాన్యానికి రూ.1,470 చొప్పున ధర నిర్ణయించారు. తెలంగాణలో మాత్రం రెండు రకాల ధాన్యంపై క్వింటాల్‌కు బోనస్ రూపంలో రూ.60 అదనంగా చెల్లించారు. ఇక్కడి రైతులకు బోనస్ ఇవ్వకపోగా, తేమ శాతం పేరిట కనీస మద్దతు ధరలోనూ భారీగా కోత విధించారు. దీంతో ఖమ్మం జిల్లాకు సరిహద్దున గల రైతులు తెలంగాణ రాష్ట్రానికి తరలించి విక్రయించారు.
ముందుగానే కొనుగోలు చేసిన మిల్లర్లు
కొవ్వూరు డివిజన్‌లో అక్టోబర్ నెలలోనే సార్వా మాసూళ్లు ప్రారంభం కాగా, రైస్ మిల్లర్లు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఆలస్యంగా నవంబర్ 7న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో అప్పటికే మిల్లర్లు మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అప్పట్లో క్వింటాల్‌కు రూ.100 చొప్పున అదనంగా చెల్లించారు. ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరగలేదని అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement