సాక్షి, నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, మద్దతు ధర దక్కకపోవడం, మిల్లుల వద్ద అన్‌లోడ్ చేయకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి అధికార యంత్రాంగం కదిలింది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ, రవాణా శాఖ అధికారులను రంగంలోకి దించింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్న తీరు, మిల్లులకు త రలించినా మిల్లర్లు లారీల నుంచి దించుకోకపోవడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలు చదివి చలించిన జిల్లా ఉన్నతాధికారులు సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగారు. రైతులకు, ఐకేపీ నిర్వాహకులకు న్యాయం జరిగేలా చర్యలకు ఉపక్రమించారు. జిల్లా సరఫరాల శాఖ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ, రెవెన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధాన్యాన్ని దించుకోవడంలో ఆలస్యం, అలసత్వం పాటిస్తే మిల్లర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదీ పరిస్థితి....
జిల్లాలో రబీ సీజన్‌లో దాదాపు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చే శారు. ఫలితంగా 10లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు వేశారు. ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్ కేంద్రాలతోపాటు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
ఐకేపీ కేంద్రాల నుంచి మిల్లులకు తరలించే ధాన్యాన్ని మిల్లర్లు సకాలంలో అన్‌లోడ్ చేసుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ఈ క్రమంలో మిల్లుల వద్ద సకాలంలో ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడం, తూకం సక్రమంగా వేయడం, ట్రక్ షీట్లు వెంటనే అధికారులకు అందజేయడం, రైతులకు ఆలస్యం కాకుండా నిర్దేశిత కాలంలో డబ్బులు చెల్లించడం వంటి పనులు పకడ్బందీగా చేయడానికి జిల్లా స్థాయిలో పర్యవేక్షణ బృందాన్ని నియమించారు. రోజువారీ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులు ఈ బృందంలోని అధికారులు పర్యవేక్షిస్తారు.
చర్యలు ఇలా....
ప్రతి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక వీఆర్‌ఓను అనుసంధానం చేశారు. వీరు పైస్థాయిలో ఒక మండలానికి ఇద్దరు ఆర్‌ఐలను నియమించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్‌డీఓలు ఉంటారు. కేంద్రాల్లో రోజువారీ ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా, తూకాల్లో అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించడం వంటి బాధ్యతలు వీరు నిర్వహిస్తారు. రోజువారీగా నివేదికలు తప్పకుండా జిల్లా అధికారులకు చేరవేయాల్సి ఉంటుంది. తద్వారా రైతుకు ఎటువంటి ఇబ్బందులూ కలగవని, మద్దతు ధర కూడా లభిస్తుందని అధికార యంత్రాంగం భావిస్తోంది. అకాల వర్షాలకు పెద్దఎత్తున ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉన్నా నీటి పాలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే ైరె తులు, అటు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు ధాన్యాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడానికి నకిరేకల్, సూర్యాపేటలో రెండు గోదాంలను అందుబాటులోకి తె చ్చారు. నిల్వలు అధికంగా ఉన్న కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లి ఈ గోదాంలలో భద్రపరుస్తారు. కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించడానికి అవసరమయ్యే లారీల కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు రవాణా శాఖాధికారులను రంగంలోకి దింపనున్నారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో ప్రైవేటు వాహనాలు స్వాధీనం చేసుకుని ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని అమలు చేయాలని తహసీల్దార్లకు జేసీ సూచించారు.
కదిలిన యంత్రాంగం
Published Thu, May 8 2014 3:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement