రెవె‘న్యూ’ ఆలోచన!   | New Revenue Reforms In Nalgonda | Sakshi
Sakshi News home page

రెవె‘న్యూ’ ఆలోచన!  

Published Mon, Nov 18 2019 8:16 AM | Last Updated on Mon, Nov 18 2019 8:16 AM

New Revenue Reforms In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్‌చార్జ్జ్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం నెల రోజుల పాటు ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం భూ ప్రక్షాళన సందర్భంగా పాత పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త పాస్‌ పుస్తకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు లేని భూములను కేటగిరీ–ఏలో, సమస్యలు ఉన్న వాటిని కేటగిరీ–బీలో చేర్చారు. ఏ–కేటగిరీలో ఉన్న భూములకు సంబంధించి పాస్‌ పుస్తకాల పంపిణీ 95శాతం పైబడి పూర్తయ్యాయి.

పార్ట్‌–బీలోనే సమస్యలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 4,46,345 పట్టాదారు పాస్‌ పుస్తకాలకు సంబంధించి డిజిటల్‌ సంతకాలు అయ్యాయి. అందులో 4,35,350 పాస్‌ బుక్‌లు రైతులకు అందించారు. 7,294 పాస్‌ పుస్తకాలు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 12,488 నాన్‌ అగ్రికల్చర్‌ ఖాతాలను పరిష్కరించారు. ఇదిలా ఉంటే బీ– కేటగిరీలో దాదాపు 23,161 వరకు పెండింగ్‌ ఖాతాలు ఉన్నాయి. కాగాఇటీవల చందంపేట మండలంలో అటవీభూములకు అధికారులు అక్రమంగా పాస్‌ పుస్తకాలు జారీ చేయగా.. ప్రస్తుతం వాటిని రద్దు చేశారు.

పెండింగ్‌ ఖాతాల పరిష్కారానికి కసరత్తు
జిల్లాలో బీ–కేటగిరీలో ఉన్న పెండింగ్‌ ఖాతా లను పరిష్కరించేందుకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై నిత్యం రైతులు ఉన్నతాధికారుల వద్దకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ రెండు మాసాల క్రితమే ఈ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కలెక్టర్‌ బదిలీ కావడంతో ఆయన ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది.

కాగా ఇటీవల తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవె న్యూ అధికారులు భయాందోళనకు గురయ్యా రు. విధులు బహిష్కరించారు. కేటీఆర్‌ హామీ తో ఇటీవలే విధుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా తహసీల్దార్ల బదిలీలు కూడా అవు తా యన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆ లస్యమైంది. తహసీల్దార్ల బదిలీలు పూర్త వ్వడంతో ఈ కార్యక్రమం ముందుకు పోనుంది.

20లోగా పార్ట్‌–బీలోని సమస్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఈ నెల 20వ తేదీలోగా ఆయా మండలాల వారీగా తహసీల్దార్లంతా పార్ట్‌ బీలో ఎన్ని సమస్యలు ఉన్నాయో జాబితాను సమర్పించాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఆదేశించారు. సోమవారం ఆయా మండలాల వారీగా తహసీల్దార్లు, డీటీలు, సూపరింటెండెంట్లు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు, సర్వేయర్లతో పాటు కార్యాలయ సిబ్బంది అంతా కూర్చొని పెండింగ్‌ ఖాతాలపై చర్చిస్తారు.

సంబంధిత ఖాతా సమస్య పరిష్కారం అవుతుందా, కాదా, కాకపోతే ఎందుకు కాలేకపోతుంది, అనే విషయాలపై  చర్చించి ఆ వివరాల జాబితాను బుధవారంలోగా కలెక్టరేట్‌కు పంపించాలి.
21న ఉదయం, సాయంత్రం పెండింగ్‌ ఖాతాలపై చర్చ ఈనెల 21న డీఆర్‌ఓ, ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో ఉదయం కలెక్టర్‌ ఆయా మండలాల వారీగా ఉన్న పెండింగ్‌ ఖాతాలపై చర్చిస్తారు. పరిష్కారం అయ్యేవి ఎన్ని, కానివి ఎన్ని, ఒకవేళ అయితే అవి ఏ స్థాయిలో ఆగాయి అనేది చర్చించనున్నారు.

అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు ఉదయాదిత్య భవన్‌లో డీఆర్‌ఓ, ఆర్‌డీఓలు, ఏఓ, డీఏఓలు, తహసీల్దార్లు, డీటీలు, సూపరింటెండెంట్లు, గ్రామస్థాయిలో వీఆర్‌ఏ, వీఆర్‌ఓలతో పాటు రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఉంటుంది. ఆయా డివిజన్ల వారీగా ఉన్న పెండింగ్‌ సమస్యలను క్షుణ్ణంగా చర్చిస్తారు. ఏయే ఖాతా, ఏ స్థాయిలో నిలిచిపోయింది. ఆ ఖాతా స్వరూపమేంటీ, ప్రస్తుతం తహసీల్దారా, ఇతర సిబ్బంది స్థాయిలో ఆగిపోయిందా, ఆగితే ఎందుకు ఆగింది అనే విషయాలపై చర్చిస్తారు. అందులో వీలైనన్ని ఖాతాలను పరిష్కరిస్తారు. మిగతా వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై చర్చిస్తారు. ఒకవేళ పరిష్కారం కాకపోతే రాత పూర్వకంగా ఆ ఖాతాదారుడు ఏ అధికారి వద్దకు వెళ్లాలనేది తెలియజేస్తారు.

25 నుంచి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌
ఈ సమావేశాల అనంతరం కలెక్టరేట్‌లో ఈ నెల 25వ తేదీనుంచి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలరోజులపాటు ప్రతి సోమవారం ఇది ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసి ఎవరైతే భూ సమస్యలపై రైతులు వస్తారో వారి వద్దనుంచి ఫిర్యాదు తీసుకొని అక్కడే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత మండల తహసీల్దార్‌తో మాట్లాడుతారు. ఆ రైతు ఏ గ్రామానికి చెందిన వ్యక్తో ఆ వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, సర్వేయర్‌ తదితర వారితో ముఖాముఖి మాట్లాడిస్తారు.

ఆ సమస్య పరిష్కారం అవుతుందా, కాదా, అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది, ఆ తేదీని చెబితే అదే రోజు మండలానికి వెళ్లాలని కలెక్టరేట్‌ అధికారులు ఆ రైతుకు సూచిస్తారు. ఒకవేళ ఆ సమస్య మండల స్థాయిలో పరిష్కారం కాకుంటే అక్కడి తహసీల్దార్‌ పరిష్కారం కాదు అంటూ అక్కడినుంచే మెయిల్‌లో సమాచారాన్ని కలెక్టరేట్‌కు పంపిస్తారు. అది తీసుకొని ఆ పట్టాదారు ఎక్కడికి వెళ్లే పరిష్కారం అవుతుందో అంటే ఆర్‌డీఓ కోర్టు లేదా జేసీ కోర్టు లేదా సివిల్‌  కోర్టుకు వెళ్లాలా అనేది రాతపూర్వకంగా సూచించనున్నారు.

పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం
పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ఇప్పటికే పార్ట్‌–ఏ లోని భూమికి సంబంధించి పాస్‌ పుస్తకాలు దాదాపు అందించాం. మిగిలినవి అందించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. పార్ట్‌బీలోని పెండింగ్‌ ఖాతాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించి చర్యలు తీసుకోబోతున్నాం.

ఈనెల 21న జిల్లా స్థాయిలో పెండింగ్‌ ఖాతాలపై సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో భూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంతో జిల్లాలో చాలా వరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం. 
– చంద్రశేఖర్, ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement