ఎగుమతికి సిద్ధంగా ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం
నల్లగొండ / మిర్యాలగూడ : జిల్లాలో సివిల్ సప్లయీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణ వేగవంతంగా సాగుతోంది. ఖరీఫ్ – 2018–19లో రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఇచ్చి, వారి నుంచి బియ్యం సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బియ్యం సేకరణ చేపట్టిన అధికారులు గడువులోగా వందశాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74 శాతం బియ్యం సేకరించారు. మార్చి నెలాఖరు వరకు సీఎంఆర్ సేకరణకు గడువు ఉన్నప్పటికీ ఫిబ్రవరి 15లోగా సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన బియ్యం నిల్వ ఉంచడానికి గాను గోదాములలో ఖాళీల కోసం ఉన్నతాధికారుల అనుమతికి కూడా లేఖ రాశారు. మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని నిల్వలు పెట్టుకోవడానికి అనుమతి కూడా వచ్చే అవకాశం ఉంది.
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు ఇలా
ఖరీఫ్ 2018–19లో జిల్లాలో ప్రభుత్వం భారీగా ధాన్యం కొనుగోళ్లు చేసింది. జిల్లాలో 58 ఐకేపీ, 48 పీఏసీఎస్ కేంద్రాలు మొత్తం 106 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఆయా కేంద్రాల ద్వారా 43,598 మంది రైతులనుంచి 391.08 కోట్ల రూపాయలు వెచ్చించి 2,20,949 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎప్పటికప్పుడు జిల్లాలోని 50 రైస్‌మిల్లులకు దిగుమతి చేశారు.
ప్రతి ఏటా ఇలా ...
గతంలో ప్రతిఏటా ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఐకేపీ కేంద్రాలకు కేవలం దొడ్డు ధాన్యం మాత్రమే వచ్చేది. మిల్లర్లే రైతుల వద్దకు వెళ్లి అవసరమైతే ఐకేపీ వద్ద చెల్లించే ధరనే చెల్లించి సన్నధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. పెద్దఎత్తున నిల్వ చేసి ముందుగా వాటిని మర ఆడించి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునేవారు. వారికి ధాన్యం కంటే బియ్యం ధరలు అధికంగా ఉండేవి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని సకాలంలో ఇవ్వకుండా వారు వ్యాపారం చేసుకొని మిల్లులకు పనిలేని సందర్భంలో తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి ఇచ్చేవారు. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వ బియ్యాన్ని కూడా వ్యాపారం చేసుకొని రబీ సీజన్‌లో ఖరీఫ్‌కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేవారు.
ఈసారి కథ అడ్డం తిరిగింది
మిల్లర్లు ప్రతిసారి మాదిరిగా ఈ ఖరీఫ్‌లో సన్నధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి ఎంఎస్‌పీ ధర పెంచింది. గతంలో క్వింటాకు కామన్ ధాన్యానికి ధర రూ.1550 ఉండగా గ్రేడ్ ఏకు రూ.1,590 ఉండేది. దాన్ని కామన్ రకానికి రూ.1750, గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1770కి పెంచడంతో రైతులకు గిట్టుబా టు ధర లభించినట్లయ్యింది. ధాన్యం ధరలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం రేటు పెరగలేదు. దీంతో మిల్లర్లు ధాన్యాన్ని కొని మర ఆడించి బియ్యాన్ని అమ్మడం వల్ల నష్టం వస్తుందని భావించి సన్నధాన్యాన్ని కొనలేదు. దీంతో ఈసారి సన్నధాన్యం కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వచ్చింది.
74 శాతం సీఎంఆర్ సేకరణ :
రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు దిగుమతి చేసిన అధికారులు వెంటనే సీఎంఆర్ సేకరణ కూడా ప్రారంభించారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యానికి సంబంధించి మార్చి 31 వరకు అప్పగించాల్సి ఉంది. ప్రతి ఏటా మిల్లర్లు ఆలస్యంగా బియ్యాన్ని అప్పగిస్తున్నారన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 15ను గడువుగా నిర్ణయించారు. మిల్లులకు ఇచ్చిన 2,20,949 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను 1,48,035 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,09,404 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించారు. ఇంకా 38,631 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 74 శాతం సీఎంఆర్ సేకరణ పూర్తి చేశారు. ఇక 26 శాతం బియ్యం మాత్రమే ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అది ఈనెల పూర్తయ్యేలోపే వచ్చే అవకాశం ఉంది.
గడువుకు ముందు సేకరిస్తాం
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 74 శాతం కస్టమ్ మిల్లింగ్ బియ్యం సేకరించాం. గడువుకు ముందే నూరుశాతం బియ్యం సేకరిస్తాం. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించాం. గోదాములలో నిల్వ ఉంచడానికి కూడా ఖాళీ స్థలం కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. – ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment