సాక్షి, హైదరాబాద్ : గోధుమ, వరి మినహాయించి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ల పరిధిలోకి వచ్చే ఇతర పంటల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన మార్కెట్ హామీ పథకం(మాస్)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండించిన పంటలను ఎంఎస్‌పీకి కొనుగోలు చేసే వ్యవస్థను బలోపేతం చేసేందుకే మాస్‌ను తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతుల నుంచి ఎంఎస్‌పీకి పంటను కొనుగోలు చేశాక, ఆయా ఉత్పత్తులను తిరిగి వివిధ సంస్థలకు ఎప్పుడు అమ్మాలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలి. పంటలను బయట విక్రయించేప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ఎంఎస్‌పీ విలువలో 40–50% వరకు నష్టం వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. అయితే 50% కంటే ఎక్కువ నష్టం వస్తే రాష్ట్రాలే భరించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన రాష్ట్రాలకు గుదిబండగా మారే ప్రమాదముందన్న విమర్శలున్నాయి.
రాష్ట్రల సంస్థలకు భారీగా నష్టం..: రైతుల నుంచి కొనుగోలు చేశాక పంటను అమ్మే క్రమంలో ఆయా రాష్ట్రాల సంస్థలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అనుసరించాల్సిన వ్యవసాయ ప్రణాళికపై కేంద్రం ఇటీవల రాష్ట్రాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాస్ పథకంపై దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ పాల్గొన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి నూతనంగా ధరల లోటు సేకరణ పథకం(పీడీపీఎస్) కూడా కేంద్రం ప్రారంభిస్తోంది. రైతు ఉత్పత్తి చేసిన పంటకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర, మార్కెట్లో లభించే వాస్తవ ధరకు మధ్య తేడాను ఈ పథకం కింద కేంద్రం అందజేయనుంది. వ్యవసాయ మార్కెట్లో రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఇది వర్తింపజేస్తారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా ఇతర పంటలకు ఏటా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తుంది.
సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం.. : సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది. పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన (పీకేవీవై) కింద దీన్ని అమలు చేస్తారు. క్లస్టర్ల పరిమాణాన్ని 2,500 ఎకరాలకు పెంచారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్ తదితర అంశాలకు సంబంధించి రాష్ట్రాలు వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేంద్రం మార్గదర్శకాల్లో సూచించింది. సాధారణ వ్యవసాయ పద్ధతి నుంచి సేంద్రీయం వైపు మరలడం, పెట్టుబడి రాయితీల వంటి వాటికి ఇచ్చే సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తుంది. నేరుగా మార్కెట్ చేసుకునేందుకు ఆర్థిక సాయం చేస్తుంది. రాష్ట్రానికి అదనంగా 50 సేంద్రీయ వ్యవసాయ క్లస్టర్లు ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని కమిషనర్ జగన్‌మోహన్ తెలిపారు. వ్యవసాయం వైపు యువకులు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment