కనీస పింఛన్‌  రూ.2,000 | Central Government Employees Minimum Pension | Sakshi
Sakshi News home page

కనీస పింఛన్‌  రూ.2,000

Published Tue, Jun 26 2018 12:47 AM | Last Updated on Tue, Sep 4 2018 4:54 PM

Central Government Employees  Minimum Pension - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగ భవిష్య నిధి పథకం ఖాతాదారులకు కనీస పింఛన్‌ పెరగ నుంది. ఈ పథకం కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 కనీస పింఛన్‌గా అందజేస్తుం డగా.. దీనిని రూ.2,000కు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమా చారం. మంగళవారం జరుగనున్న కేంద్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకో నున్నట్టు తెలుస్తోంది. సమావేశం ఎజెండాలో ఈ అంశం లేకపోయినా.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఉన్న తాధికారవర్గాలు వెల్లడించాయి. అనుకున్న ట్టుగా జరిగితే జూలై చివరి నాటికి దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడుతుందని పేర్కొన్నాయి. కనీస పింఛన్‌ పెంపు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికి, తెలుగు రాష్ట్రాల్లో 4.75 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది.

ఇప్పటికే కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌
ఈపీఎఫ్‌వో పథకం కింద ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల మూల వేతనంలో 12 శాతాన్ని, దానికి యాజమాన్యం నుంచి మరో 12 శాతం సొమ్మును కలిపి ఈపీఎఫ్‌వోకు మళ్లిస్తారు. ఇందులో ఉద్యోగి వేతనంలోని 12 శాతాన్ని, యాజమాన్యం వాటాలోని 3.67 శాతాన్ని ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిధిలోకి చేర్చుతారు. ఈ ప్రావిడెంట్‌ ఫండ్‌ను వడ్డీతో కలిపి ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. ఇక యాజమాన్యం వాటాలోని మిగతా 8.33 శాతాన్ని పింఛన్‌ పరిధిలోకి తీసుకుంటారు. ఇందుకుగాను సదరు ఉద్యోగి పదవీ విరమణ అనంతరం నెలనెలా పింఛన్‌ అందజేస్తారు. ప్రస్తుతం కనీస పింఛన్‌గా రూ.1,000 అందజేస్తున్నారు. దీనిని పెంచాలంటూ కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి.

కనీస పింఛన్‌ను ఐదింతల (రూ.5 వేల) వరకు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల శాసనసభలు ఈ మేరకు తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. ఈ నేపథ్యంలోనే పింఛన్‌ పెంపు అనివార్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. కనీస పింఛన్‌ ఎంత ఉండాలన్నదానిపై కేంద్ర కార్మిక శాఖ పలుమార్లు సంప్రదింపులు జరిపి.. ప్రస్తుతమున్న ఉన్న దానిని రెట్టింపు చేయాలని నిర్ణయానికి వచ్చింది. మంగళవారం జరగనున్న ట్రస్టీల బోర్డు సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి చైర్మన్‌ హోదాలో హాజరవుతారు. ఈ సందర్భంగా కనీస పింఛన్‌ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పెంపు అమల్లోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.3 వేల కోట్ల మేర భారం పడుతుందని కార్మిక శాఖ అంచనా వేస్తోంది.

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెంపు!
ప్రస్తుతం ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపేణా వస్తున్న మొత్తంలో పది శాతం సొమ్మును షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడుల కింద పెడుతున్నారు. దీనిని 15 శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి పీఎఫ్‌ నిధిలో కొంతమొత్తాన్ని షేర్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని 2015–16లో కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆ ఏడాది మొత్తం డిపాజిట్లలో ఐదు శాతాన్ని షేర్‌ మార్కెట్‌లో పెట్టారు. దీనిని 2016–17లో పది శాతానికి పెంచారు. తాజాగా 15 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ పెంపు సరిపోదంటున్న కార్మికులు
ఈపీఎఫ్‌వో కనీస పింఛన్‌ను రూ.2000కు పెంచాలన్న ప్రతిపాదనపై కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. కనీసం ఐదింతలు (రూ.5 వేలకు) పెంచితేనే మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. కనీస పింఛన్‌ పెంపుతో కేంద్రంపై భారం పడుతుందనడం కార్మికులను మభ్యపెట్టడమేనని.. కార్మికుల సొమ్మును మార్కెట్‌లో పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement