minimum pension
-
కనీస పింఛన్ రూ.2,000
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగ భవిష్య నిధి పథకం ఖాతాదారులకు కనీస పింఛన్ పెరగ నుంది. ఈ పథకం కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 కనీస పింఛన్‌గా అందజేస్తుం డగా.. దీనిని రూ.2,000కు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమా చారం. మంగళవారం జరుగనున్న కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకో నున్నట్టు తెలుస్తోంది. సమావేశం ఎజెండాలో ఈ అంశం లేకపోయినా.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఉన్న తాధికారవర్గాలు వెల్లడించాయి. అనుకున్న ట్టుగా జరిగితే జూలై చివరి నాటికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొన్నాయి. కనీస పింఛన్ పెంపు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికి, తెలుగు రాష్ట్రాల్లో 4.75 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఇప్పటికే కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఈపీఎఫ్‌వో పథకం కింద ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల మూల వేతనంలో 12 శాతాన్ని, దానికి యాజమాన్యం నుంచి మరో 12 శాతం సొమ్మును కలిపి ఈపీఎఫ్‌వోకు మళ్లిస్తారు. ఇందులో ఉద్యోగి వేతనంలోని 12 శాతాన్ని, యాజమాన్యం వాటాలోని 3.67 శాతాన్ని ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి చేర్చుతారు. ఈ ప్రావిడెంట్ ఫండ్‌ను వడ్డీతో కలిపి ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. ఇక యాజమాన్యం వాటాలోని మిగతా 8.33 శాతాన్ని పింఛన్ పరిధిలోకి తీసుకుంటారు. ఇందుకుగాను సదరు ఉద్యోగి పదవీ విరమణ అనంతరం నెలనెలా పింఛన్ అందజేస్తారు. ప్రస్తుతం కనీస పింఛన్‌గా రూ.1,000 అందజేస్తున్నారు. దీనిని పెంచాలంటూ కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కనీస పింఛన్‌ను ఐదింతల (రూ.5 వేల) వరకు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల శాసనసభలు ఈ మేరకు తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. ఈ నేపథ్యంలోనే పింఛన్ పెంపు అనివార్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కనీస పింఛన్ ఎంత ఉండాలన్నదానిపై కేంద్ర కార్మిక శాఖ పలుమార్లు సంప్రదింపులు జరిపి.. ప్రస్తుతమున్న ఉన్న దానిని రెట్టింపు చేయాలని నిర్ణయానికి వచ్చింది. మంగళవారం జరగనున్న ట్రస్టీల బోర్డు సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి చైర్మన్ హోదాలో హాజరవుతారు. ఈ సందర్భంగా కనీస పింఛన్ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పెంపు అమల్లోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.3 వేల కోట్ల మేర భారం పడుతుందని కార్మిక శాఖ అంచనా వేస్తోంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెంపు! ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ రూపేణా వస్తున్న మొత్తంలో పది శాతం సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టుబడుల కింద పెడుతున్నారు. దీనిని 15 శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి పీఎఫ్ నిధిలో కొంతమొత్తాన్ని షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని 2015–16లో కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆ ఏడాది మొత్తం డిపాజిట్లలో ఐదు శాతాన్ని షేర్ మార్కెట్లో పెట్టారు. దీనిని 2016–17లో పది శాతానికి పెంచారు. తాజాగా 15 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పెంపు సరిపోదంటున్న కార్మికులు ఈపీఎఫ్‌వో కనీస పింఛన్‌ను రూ.2000కు పెంచాలన్న ప్రతిపాదనపై కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. కనీసం ఐదింతలు (రూ.5 వేలకు) పెంచితేనే మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. కనీస పింఛన్ పెంపుతో కేంద్రంపై భారం పడుతుందనడం కార్మికులను మభ్యపెట్టడమేనని.. కార్మికుల సొమ్మును మార్కెట్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. -
నెలవారీ కనీస పెన్షన్ రూ.7500...
సాక్షి, న్యూఢిల్లీ : పెన్షనర్ల బాడీలో సుమారు లక్ష మంది ఫించన్‌దారులు గురువారం పార్లమెంట్ వరకు ఆందోళన యాత్ర చేపట్టబోతున్నారు. వీరి డిమాండ్లను నెరవేర్చాలంటూ కోరుతూ వీరు ఈ ఆందోళన చేపడుతున్నారు. దీనిలో కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని ప్రధానమైన డిమాండ్. దేశవ్యాప్తంగా ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995(ఈపీఎస్-95) కింద కనీస పెన్షన్ రూ.7500కు పెంచాలని ఈపీఎస్-95 జాతీయ ఆందోళన కమిటీ కోరుతోంది. ప్రస్తుతం ఫించన్‌దారులకు నెలవారీ పెన్షన్ రూ.1000గానే ఉంది. కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ప్రధాన కార్యాలయం వల్ల ఈపీఎస్-95లోని సభ్యులందరూ మూడు రోజుల నిరాహార దీక్ష చేపడుతున్నామని, ఒకవేళ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, డిసెంబర్ 7న రామ్‌లీలా గ్రౌండ్ నుంచి పార్లమెంట్ వరకు ఆందోళన యాత్ర చేపట్టనున్నట్టు సోమవారం ఈపీఎస్-95 చీఫ్ కో-ఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ తెలిపారు. ఈపీఎస్-95 కింద సుమారు 60 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరిలో 40 లక్షల మంది నెలకు రూ.1500 కంటే తక్కువ పెన్షనే పొందుతున్నారు. మిగతా వారు గరిష్టంగా రూ.2000 నుంచి రూ.2500 మధ్యలో పెన్షన్ అందుతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రన్ చేసే సామాజిక భద్రత పథకాల్లో ఈపీఎస్-95 కూడా ఒకటి. తమ ఈ సమస్య రెండేళ్ల నుంచి చర్చనీయాంశంగానే ఉందని పెన్షనర్ల బాడీ తెలిపింది. -
కేంద్ర ఉద్యోగుల కనీస పింఛన్ 9000
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగుల కనీస పింఛన్‌ను రూ.9 వేలు చేసినట్లు , ఎక్స్‌గ్రేషియాను రెండింతలు పెంచినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. స్వచ్ఛంద సంస్థల స్థాయీ సంఘం(ఎస్సీఓవీఏ) 29వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలో సుమారు50–55 లక్షల పింఛనుదారులున్నారని, దాదాపు 88 శాతం పింఛన్ ఖాతాలను ఆధార్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. కనీస పింఛన్‌ను రూ.9 వేలకు, ఎక్స్‌గ్రేషియాను 10–15 లక్షల నుంచి 25–30 లక్షలకు పెంచినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటన జారీచేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల అనుభవం, నైపుణ్యాలను ఉపయోగించుకునేలా సంస్థాగత విధానం ఉండాలని మంత్రి అన్నారు. -
కనీస పెన్షన్ రూ.9 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త. కనీస పింఛన్ ఒకేసారి 157.14 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులకు వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు రిటైర్మెంట్, డెత్ గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తాజా ఉత్తర్వుల ద్వారా 58 లక్షల కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగి గరిష్ట వేతనం రూ.2.5 లక్షలయింది. ఈ క్రమంలో విశ్రాంత ఉద్యోగుల గరిష్ట పింఛన్‌ను రూ.1.25 లక్షలకు పెంచుతూ మం త్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఉగ్రవాద హింసాత్మక చర్యలవల్ల విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సరిహద్దుల్లో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తదితర సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కిచ్చే నష్ట పరిహారాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచింది. యుద్ధ సమయాల్లో శత్రువుల చేతుల్లో బలైన ఉద్యోగులకు పరిహారాన్ని రూ.45 లక్షలకు పెంచింది. ముందుగానే నిర్ణయించుకోవాలి... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) చందాదారులు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా తమ ఖాతాలను కొనసాగించదలుచుకొంటే కనీసం 15 రోజులు ముందుగా కేంద్ర రికార్డ్ కీపింగ్ సంస్థ (సీఆర్ఏ)కు తెలియజేయాలి. 60 ఏళ్ల తరువాత చందాలు కట్టేవారు ఎప్పుడైనా తమ ఖాతాను రద్దు చేసుకోవచ్చు. -
కనీస పెన్షన్ రూ.1000
న్యూఢిల్లీ: ఉద్యోగుల పెన్షన్ పథకం కింద పింఛన్‌దారులకు నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. కనీస పెన్షన్ పథకం మార్చి 2015తో గడువు ముగిసింది. కేబినెట్ తాజా నిర్ణయంతో పింఛనదారులకు ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రమంత్రి వర్గం సమావేశమైంది. కనీస పెన్షన్ పథకం అమలు చేయడానికి ఏడాదికి 850 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడానిఇకి కేబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల 20 లక్షల మంది ఫించన్‌దారులకు లబ్ధి కలగనుంది.