కనీస పెన్షన్ రూ.9 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త. కనీస పింఛన్ ఒకేసారి 157.14 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సులకు వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు రిటైర్మెంట్, డెత్ గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తాజా ఉత్తర్వుల ద్వారా 58 లక్షల కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగి గరిష్ట వేతనం రూ.2.5 లక్షలయింది. ఈ క్రమంలో విశ్రాంత ఉద్యోగుల గరిష్ట పింఛన్‌ను రూ.1.25 లక్షలకు పెంచుతూ మం త్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఉగ్రవాద హింసాత్మక చర్యలవల్ల విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. సరిహద్దుల్లో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తదితర సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కిచ్చే నష్ట పరిహారాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచింది. యుద్ధ సమయాల్లో శత్రువుల చేతుల్లో బలైన ఉద్యోగులకు పరిహారాన్ని రూ.45 లక్షలకు పెంచింది.
ముందుగానే నిర్ణయించుకోవాలి...
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) చందాదారులు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా తమ ఖాతాలను కొనసాగించదలుచుకొంటే కనీసం 15 రోజులు ముందుగా కేంద్ర రికార్డ్ కీపింగ్ సంస్థ (సీఆర్‌ఏ)కు తెలియజేయాలి. 60 ఏళ్ల తరువాత చందాలు కట్టేవారు ఎప్పుడైనా తమ ఖాతాను రద్దు చేసుకోవచ్చు.