grinsignal
-
కనీస పింఛన్ రూ.2,000
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగ భవిష్య నిధి పథకం ఖాతాదారులకు కనీస పింఛన్ పెరగ నుంది. ఈ పథకం కింద ప్రస్తుతం నెలకు రూ.1,000 కనీస పింఛన్‌గా అందజేస్తుం డగా.. దీనిని రూ.2,000కు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమా చారం. మంగళవారం జరుగనున్న కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకో నున్నట్టు తెలుస్తోంది. సమావేశం ఎజెండాలో ఈ అంశం లేకపోయినా.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఉన్న తాధికారవర్గాలు వెల్లడించాయి. అనుకున్న ట్టుగా జరిగితే జూలై చివరి నాటికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందని పేర్కొన్నాయి. కనీస పింఛన్ పెంపు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల మందికి, తెలుగు రాష్ట్రాల్లో 4.75 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఇప్పటికే కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఈపీఎఫ్‌వో పథకం కింద ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల మూల వేతనంలో 12 శాతాన్ని, దానికి యాజమాన్యం నుంచి మరో 12 శాతం సొమ్మును కలిపి ఈపీఎఫ్‌వోకు మళ్లిస్తారు. ఇందులో ఉద్యోగి వేతనంలోని 12 శాతాన్ని, యాజమాన్యం వాటాలోని 3.67 శాతాన్ని ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి చేర్చుతారు. ఈ ప్రావిడెంట్ ఫండ్‌ను వడ్డీతో కలిపి ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. ఇక యాజమాన్యం వాటాలోని మిగతా 8.33 శాతాన్ని పింఛన్ పరిధిలోకి తీసుకుంటారు. ఇందుకుగాను సదరు ఉద్యోగి పదవీ విరమణ అనంతరం నెలనెలా పింఛన్ అందజేస్తారు. ప్రస్తుతం కనీస పింఛన్‌గా రూ.1,000 అందజేస్తున్నారు. దీనిని పెంచాలంటూ కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కనీస పింఛన్‌ను ఐదింతల (రూ.5 వేల) వరకు పెంచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల శాసనసభలు ఈ మేరకు తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. ఈ నేపథ్యంలోనే పింఛన్ పెంపు అనివార్యమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కనీస పింఛన్ ఎంత ఉండాలన్నదానిపై కేంద్ర కార్మిక శాఖ పలుమార్లు సంప్రదింపులు జరిపి.. ప్రస్తుతమున్న ఉన్న దానిని రెట్టింపు చేయాలని నిర్ణయానికి వచ్చింది. మంగళవారం జరగనున్న ట్రస్టీల బోర్డు సమావేశానికి కేంద్ర కార్మిక మంత్రి చైర్మన్ హోదాలో హాజరవుతారు. ఈ సందర్భంగా కనీస పింఛన్ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ పెంపు అమల్లోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.3 వేల కోట్ల మేర భారం పడుతుందని కార్మిక శాఖ అంచనా వేస్తోంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెంపు! ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ రూపేణా వస్తున్న మొత్తంలో పది శాతం సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టుబడుల కింద పెడుతున్నారు. దీనిని 15 శాతానికి పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి పీఎఫ్ నిధిలో కొంతమొత్తాన్ని షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని 2015–16లో కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆ ఏడాది మొత్తం డిపాజిట్లలో ఐదు శాతాన్ని షేర్ మార్కెట్లో పెట్టారు. దీనిని 2016–17లో పది శాతానికి పెంచారు. తాజాగా 15 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పెంపు సరిపోదంటున్న కార్మికులు ఈపీఎఫ్‌వో కనీస పింఛన్‌ను రూ.2000కు పెంచాలన్న ప్రతిపాదనపై కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని.. కనీసం ఐదింతలు (రూ.5 వేలకు) పెంచితేనే మేలు జరుగుతుందని పేర్కొంటున్నాయి. కనీస పింఛన్ పెంపుతో కేంద్రంపై భారం పడుతుందనడం కార్మికులను మభ్యపెట్టడమేనని.. కార్మికుల సొమ్మును మార్కెట్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. -
‘ఇందిరమ్మ’ కాల్వ పనులకు 108 కోట్లు
నీటి పారుదల శాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో భాగంగా చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఇందిరమ్మ వరద కాల్వ (ఎఫ్ఎఫ్సీ) పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా చేపట్టనున్న పనులకు రూ.108.18 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి సోమవారం ఉత్తర్వులిచ్చారు. మిడ్‌మానేరు కుడి కాల్వల పరిధిలో ప్యాకేజీ-1లోని 17.75 కిలోమీటర్ల పొడవైన కాల్వల పనులకు రూ.54.92 కోట్లు, 17.5 కి.మీ. నుంచి 36.12 కి.మీ. వరకు పనులున్న ప్యాకేజీ-2కి రూ.53.96 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వరద కాల్వ కింద 1.9 లక్షల ఎకరాలుండగా, కొత్తగా దేవాదుల పరిధిలోని 2 లక్షల ఎకరాలు, గండిపల్లి రిజర్వాయర్ పరిధిలోని 30 వేల ఎకరాలను దీని పరిధిలోకి తేవడంతో ఆయకట్టు 4.2 లక్షల ఎకరాలకు పెరిగింది. గోదావరిలో 120 రోజులే నీటి లభ్యత! గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.182 టీఎంసీల నీటిని దేవాదులకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే గోదావరిలో వరద కేవలం 120 రోజులే ఉంటుందని, దేవాదులకు 27 టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని లెక్కగట్టారు. దీంతో ఈ ఆయకట్టుకు వరద కాల్వ ద్వారా నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మిడ్‌మానేరు కెనాల్ తొలి 36 కి.మీ. వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,650 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచాలని, తోటపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి మట్టాన్ని 305.87 నుంచి 307.45కు పెంచాలని కరీంనగర్ ప్రాజెక్టుల అధికారులు సూచించారు. -
జిల్లాల విభజన వేగవంతం!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రెండు రోజులుగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగం పెరిగింది. బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సహా ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం ఉపసంఘం వేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం జిల్లాలో పునర్విభజనపై వేగం పెంచింది. అందరూ కొత్త మండలాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని భావించారు. అయితే సీఎం కేసీఆర్ మంగళవారం చేసిన ప్రకటనతో మళ్లీ కొత్త మండలాలతో జిల్లాల పునర్విభజన వైపు అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. కొత్త జిల్లాల చేర్పులు, మార్పులకు ఎంత శ్రమ పడాల్సి వస్తుందో.. మండలాలకు అంతకంటే ఎక్కువే కసరత్తు చేయాల్సి వస్తున్నప్పటికీ, జిల్లాలతోనే చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 14 జిల్లాలు ఏర్పడితే.. మండలాల ప్రతిపాదన 74గా ఉంది. జిల్లాలో ఏర్పాటుతోపాటు కొత్త జిల్లాల్లో 74 మండలాల్లో కార్యాలయాలు, అధికారులు యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కూడ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త మండలాల ఏర్పాటు కోసం జిల్లా నుంచి ఇదివరకు పంపిన ప్రతిపాదనల ప్రకారమే 10 మండలాలు ఏర్పడితే.. రెండు జిల్లాల్లో మండలాల సంఖ్య 46కు చేరనుంది. నాగిరెడ్డిపేట మండలంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి మరో మండలం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కామారెడ్డిలో 21.. నిజామాబాద్ 25 మండలాలు.. సీఎం కేసీఆర్ వేర్వేరుగా నిర్వహించిన కలెక్టర్లు, టీఆర్ఎస్ఎల్పీ సమావేశాల్లో అధికార పార్టీ నేతలు, అధికారులు సూచించిన మేరకు జిల్లాలో కొత్తగా 10 మండలాలు పెరగనున్నాయి. కొత్త మండలాల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో మండలాల విలీనంపై స్పష్టత వచ్చిన మీదటే ఇచ్చిన నివేదికలకు తుదిరూపు వచ్చింది. 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుండగా.. నిజామాబాద్‌లో ఎనిమిది, కామారెడ్డి రెండు మండలాలు కొత్తగా చేరనున్నాయి. ఇదే సమయమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం మెదక్ జిల్లాలో కలుపుతున్నారన్న ప్రచారం జరుగుతున్నా.. కొత్తగా మరో మండలం కామారెడ్డిలో చేరనుంది. అదే విధంగా బాన్సువాడకు చెందిన కోటగిరి, వర్ని మండలాలు అక్కడి ప్రజల కోరిక మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆ రెండు మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగిస్తామన్న హామీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ ఏర్పడినా.. ఆ రెండు మండలాలు నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించే అవకాశం ఉంది. కేబినేట్ సబ్ కమిటీ నిర్ణయాల మేరకు రెండు జిల్లాల్లో ఏవైనా చేర్పులు, మార్పులు జరిగితే కొత్త మండలాల సంఖ్య ఒకటి, రెండు పెరిగే ఆవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇదివరకు రెండు జిల్లాల్లో కొనసాగే అధికారులు, ఉద్యోగుల విభజన జరిగింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రవర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాల సంఖ్య, కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు, తాత్కాలిక ఏర్పాట్లు, వసతి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల కేటాయింపు, జోనల్, శాఖల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై ఈ కమిటీ మరోమారు అధ్యయనం చేయనుంది. ముసాయిదాకు ముందే వారంలోగా అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది. దీంతో జిల్లాలో పునర్విభజన ప్రక్రియ వేగం పెరిగింది. ఇదిలా వుండగా అధికారులు కొత్తగా ఇప్పుడున్న మండలాలకు తోడు 10 మండలాలకు సబ్‌కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. వాటిలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ అర్బన్, రూరల్‌లో రుద్రూరు, కామారెడ్డి అర్బన్‌తో దేవునిపల్లి, సదాశివనగర్ మండలం రామారెడ్డి, ఆర్మూరు అర్బన్‌కు తోడు ఆలూరు, భిక్కనూర్ మండలం రాజంపేట, దోమకొండ మండలం బీబీపేటలు మండలాలుగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. అలాగే వీటికి తోడు డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి మరో మండలం ఏర్పడనుంది. మండలాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పోరేషన్, రెండు మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. జనాభా విభజనపైన కూడ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటన్నింటిపై ఈ నెల 22న ముసాయిదాలో వివరంగా ప్రకటించనుండగా.. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగనుంది. -
మెట్రోకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నివేదించిన సవివర నివేదికకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన మీదట నిర్ణయించింది. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతికి విస్తరించాలని కేబినెట్ తీర్మానించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని డీఎంఆర్సీ చేపట్టనుంది. ఈ నిర్ణయాలన్నీ గతంలోనే జరిగినా వాటికి కేబినెట్ అధికారికంగా బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 25.76 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలో నిర్మించే తొలి దశ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,705 కోట్లు ఖర్చవుతుందన డీఎంఆర్సీ సవివర నివేదికలో పేర్కొంది. నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి ప్రాజెక్టు పూర్తవడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్పిన శ్రీధరన్ అప్పటికి అంచనా వ్యయం రూ.6,823 కోట్లు అవుతుందని స్పష్టం చేసింది. మొదటి కారిడార్ పండిట్ నెహ్రూ స్టేషన్ నుంచి పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఏర్పాటుచేస్తారు. రెండో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి నిడమానూరు వరకూ 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారిడార్‌లో 13 స్టేషన్లు నెలకొల్పుతారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ మెట్రో ప్రాజెక్టు కంట్రోల్ పాయింట్‌గా, సంయుక్త బస్టేషన్‌గా ఉంటుంది. మొదటి కారిడార్‌ను రెండో దశలో రాజధాని అమరావతికి విస్తరిస్తారు. ఇందుకోసం ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రస్తుతం ఉన్న రైలు బ్రిడ్జికి 200 మీటర్ల అవతల మరో బ్రిడ్జిని నిర్మిస్తారు. ప్రాజెక్టును తుళ్లూరుకు కలుపుతారు. రెండో కారిడార్‌ను రెండో దశలో గన్నవరం ఎయిర్‌పోర్టు వర కూ విస్తరిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను శ్రీధరన్ నేతృ త్వం లోని డీఎంఆర్‌సీకే అప్పగించిన ప్రభుత్వం దీనిపై బుధవారం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 40 శాతం నిధులను భరిస్తాయి. మిగిలిన 60 శాతం నిధులను జపాన్‌కు చెందిన జైకా తదితర సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయి ంచారు. ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వెంటనే వచ్చేం దుకు ప్రభుత్వం ఎస్పీవీని (స్పెషల్ పర్పస్ వెహికల్) కూడా ఏర్పాటు చేసింది. ధ్రువీకరణ అందగానే డీఎంఆర్సీ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. -
శాఖాపరమైన పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన శాఖాపరమైన పరీక్షల నిర్వహణ కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో తదుపరి చర్యలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దృష్టి సారించింది. పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఏర్పాట్లపై కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వెబ్సైట్ రూపకల్పనపై దృష్టి పెట్టింది. అయితే ఇందుకు మరో పది రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. 150 వరకు వివిధ రకాలున్న శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు ఉద్యోగులు ఆన్ లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఫీజుల చెల్లింపునకు సంబంధించిన ఖాతా ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైతే ఈనెలాఖరులో శాఖాపరమైన పరీక్షలకు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సర్వీస్ కమిషన్ భావిస్తోంది. -
సిండికేటు గాళ్లు
మద్యం గేట్లు ఎత్తేశారు జిల్లాలో మద్యం సిండికేట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిన ఎక్సైజ్ అధికారులు బాటిల్‌పై రూ.5 నుంచి రూ.15 పెంచుకునేందుకు సిండికేట్ నిర్ణయం లెసైన్స్‌ఫీజు, నెల మామూళ్లతో ఆదాయం లేక ధరలు పెంచిన వైనం సిండికేట్ ద్వారా ప్రతినెలా అక్రమార్జన రూ.6.75 కోట్లు నెలకు 54.70లక్షల మామూళ్లు ! ఓ అధికార పార్టీ నేత కనుసన్నల్లో సిండికేట్ జిల్లాలోని మద్యం దుకాణాల నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా ఎంత మొత్తంలో మామూళ్లు అందుతున్నాయో మీకు తెలుసా? అక్షరాల 54,70,800 రూపాయలు. వామ్మో! ఇంత డబ్బా! అనుకుంటున్నారా? సిండికేట్ ద్వారా వచ్చే ఆదాయమెంతో తెలుసుకుంటే దాని ముందు ఇది చాలా చిన్న మొత్తం అవుతుంది. సిండికేటు.. మామూళ్లు.. ఆదాయం ఏంటీ గొడవ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి. సాక్షి, చిత్తూరు: సరిగ్గా రెండేళ్ల కిందట మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో 2012 జూలై నుంచి కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుంచి లక్కీడ్రిప్ ద్వారా లెసైన్స్‌లు కేటాయించడం, ఎమ్మార్పీకి మద్యం విక్రయించడం లాంటి నిబంధనలు అమలు చేశారు. అయితే అవి ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది జూలై నుంచి కొత్త లెసైన్స్‌దారులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దుకాణాన్ని బట్టి ఒక్కో లెసైన్స్‌కు 32.52 నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించారు. దీనికి అదనంగా మందుబాబుల ‘సిట్టింగ్ రూం’ కోసం మరో 2 లక్షల రూపాయలు చెల్లించారు. ఇంత భారీగా ఖర్చు పెట్టాం.. మద్యం అమ్మకాల ద్వారా గల్లాపెట్టే నిండా డబ్బులు గలగల అంటుందని భావించారు. అయితే ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని నిబంధనలు పెట్టారు. దీంతో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. ఈ క్రమంలో దుకాణాలు తెరిచిన నెలన్నరకే వ్యాపారులంతా ఎక్కడికక్కడ సమావేశమయ్యారు. ఓ అధికారపార్టీ నేతను ఆశ్రయించారు. అతని అండతో సిండికేట్ అయ్యారు. ఒక్కోబాటిల్‌పై 5-15రూపాయలు పెంచి విక్రయాలు జరుపుకునేందుకు నిర్ణయించారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు చూడకుండా మామూళ్లు నిర్ణయించారు. ఇంకేముంది! గత 23రోజులుగా మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు విక్రయాలు జరుపుతు గల్లా పెట్టె నింపుకుంటున్నారు. సిండికేట్ ద్వారా నెలకు రూ.6.75కోట్ల అదనపు ఆదాయం జిల్లాలో 458 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో లక్కీడిప్ ద్వారా 388 దుకాణాలు కేటాయించారు. 70 షాపులకు లెసైన్స్‌దారులు ముందుకు రాలేదు. నడుస్తున్న వాటిలో రోజుకు సగటున 580బాటిళ్లు విక్రయం అవుతున్నట్లు అంచనా! వీటిలో ప్రతీ బాటిల్‌పై 5-15 రూపాయలు అధికంగా విక్రయిస్తారు. ఇందులో సగటున 10 రూపాయలు అనుకున్నా రోజుకు ఒక్కో షాపునకు 5,800రూపాయల చొప్పున నెలకు 1.74లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. అంటే సిండికేట్ ద్వారా 388 దుకాణాల పరిధిలో నెలకు 6.75కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందన్నమాట. చూసేందుకు పదిరూపాయలా? అనిపించినా దీని ఆదాయం ఎంత ఉంటుందో పై లెక్కలు చూస్తే ఇట్టే తెలుస్తోంది. మద్యం దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు రూ.54.7లక్షలు మద్యం దుకాణాల నుంచి నెలకు 54.7 లక్షల రూపాయల మామూళ్లు అందుతున్నాయి. ఓ మద్యం దుకాణ యజమాని చెప్పిన ప్రకారం నెలకు 2,100 రూపాయలు లా అండ్ ఆర్డర్ సీఐకి, 7వేల రూపాయలు ఎక్సైజ్ సీఐకి, 5వేల రూపాయలు ఈఎస్(ఎక్సైజ్ సూపరింటెండెంట్)కు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈఎస్‌లు డీసీకి చెల్లిస్తున్నట్లు సమాచారం. అంటే ప్రతినెలా ఒక్కో దుకాణం నెలకు 14,100 రూపాయలు మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నాయన్నమాట! సిండికేట్ ద్వారా నెలకు 1.74లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే ఈ మాత్రం చెల్లించడం వీరికి పెద్ద ఁలెక్కేం* కాదు కదా! విచారణ చేయిస్తాం మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనంపై విచారణ చేయిస్తాం. - సత్యప్రసాద్, డెప్యూటీ కమిషనర్, ఎక్సైజ్. -
శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల అడ్మిషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయడానికి మార్గదర్శకాలు (జీవో 120)ను శనివారం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్విమ్స్ నేతృత్వంలో శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు.. బోధన సిబ్బందిని స్విమ్స్ యాజమాన్యం నియమించుకుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఏడాది క్రితం తనిఖీ చేసి వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించడానికి స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ బీ.వెంగమ్మ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈనెల 14న సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్విమ్స్ పాలకమండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో మెరిట్ ఆధారంగా మన రాష్ట్ర విద్యార్థులకు 70 శాతం సీట్లు, 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్ర, ఇతర రాష్ట్ర కోటాల్లో భర్తీ చేసే సీట్లకు రూ.60 వేల వంతున, ఎన్ఆర్ఐ సీట్లకు 20 వేల అమెరికన్ డాలర్ల వంతున ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఇతర రాష్ట్రాలకు కేటాయించిన 15 శాతం సీట్లను కూడా మన రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. తరగతులను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి పాలకమండలి సమావేశంలో అనుమతి ఇచ్చారు. ఈ మహిళా వైద్య కళాశాలలో 150 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ నేతృత్వంలో నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా 127 సీట్ల (85 శాతం)ను మన రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ప్రసూతి ఆస్పత్రి భవనం విషయంలో జూనియర్ డాక్టర్లకు, సిమ్స్‌కు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో మహిళా వైద్య కళాశాల తరగతుల ప్రారంభంపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో బ్రేక్ పడింది. -
టీచర్ల తాత్కాలిక సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్
చిత్తూరు(టౌన్): పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రాజీవ్ విద్యామిషన్ చర్యలు చేపట్టింది. టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు (రేషనలైజేషన్) చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాష్ట్ర ఆర్వీఎం అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దీని వివరాలను జిల్లా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులకు వివరించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో టీచర్లు సరిగ్గా లేనందున విద్యార్థులకు చదువు చెప్పలేకపోతున్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తే గానీ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరదు. ప్రస్తుతం డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేనందున తాత్కాలిక సర్దుబాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుచేసి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. రెండు రోజులు సరిపోతుందా? సర్దుబాటు పూర్తి చేయడానికి రెండు రోజులు సరిపోదని, వారం రోజులైనా గడువిస్తే పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎక్కువగా సబ్జెక్టు టీచర్లు ఉం డే పాఠశాల నుంచి వీరిని సర్దుబాటు ప్రాతిపదికన వేరే పాఠశాలకు పంపాల్సి ఉంటుంది. సెలవుల్లో అధికారులే సర్దుబాటు చేసేందుకు పూనుకొని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి దీనికి పెద్దగా స్పందన రాలేదు. అధికారుల వద్ద జిల్లాలో ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి? టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని? ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎంత ఉంది? అనే వివరాలు పూర్తి స్థాయిలో లేవు. పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లల ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంఈవోల నుంచి వివరాలు తెప్పించుకొని సర్దుబాటు చేయడమనేది కత్తిమీద సామేనని చెప్పొచ్చు. అధికారులకు తలనొప్పులు తప్పవా? తాత్కాలిక సర్దుబాటు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కొంత మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కార్యక్రమం వీరికి వరంలా దొరికింది. కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీరిని పట్టుకొని తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒత్తిళ్లు ఎక్కువైతే నిబంధనలకు అధికారులు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటీవల నిర్వహించిన ఎంఈవోల సమావేశంలో తాత్కాలిక సర్దుబాబు చేయాలని డీఈవో ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది తాము కోరుకున్న చోటుకి వెళ్లేందుకు ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పుడు ఉన్నతాధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడంతో అధికార పార్టీ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.