సిండికేటు గాళ్లు | District liquor syndicate grinsignal | Sakshi
Sakshi News home page

సిండికేటు గాళ్లు

Published Sat, Sep 13 2014 3:23 AM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM

సిండికేటు గాళ్లు - Sakshi

సిండికేటు గాళ్లు

  • మద్యం గేట్లు ఎత్తేశారు
  •  జిల్లాలో మద్యం సిండికేట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిన ఎక్సైజ్ అధికారులు
  •  బాటిల్‌పై రూ.5 నుంచి రూ.15 పెంచుకునేందుకు సిండికేట్ నిర్ణయం
  •  లెసైన్స్‌ఫీజు, నెల మామూళ్లతో ఆదాయం లేక ధరలు పెంచిన వైనం
  •  సిండికేట్ ద్వారా ప్రతినెలా అక్రమార్జన రూ.6.75 కోట్లు
  •  నెలకు 54.70లక్షల మామూళ్లు !
  •  ఓ అధికార పార్టీ నేత కనుసన్నల్లో సిండికేట్
  • జిల్లాలోని మద్యం దుకాణాల నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ప్రతి నెలా ఎంత మొత్తంలో మామూళ్లు అందుతున్నాయో మీకు తెలుసా? అక్షరాల 54,70,800 రూపాయలు. వామ్మో! ఇంత డబ్బా! అనుకుంటున్నారా? సిండికేట్ ద్వారా వచ్చే ఆదాయమెంతో తెలుసుకుంటే దాని ముందు ఇది చాలా చిన్న మొత్తం అవుతుంది. సిండికేటు.. మామూళ్లు.. ఆదాయం ఏంటీ గొడవ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి.
     
    సాక్షి, చిత్తూరు: సరిగ్గా రెండేళ్ల కిందట మద్యం సిండికేట్ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. దీంతో 2012 జూలై నుంచి కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుంచి లక్కీడ్రిప్ ద్వారా లెసైన్స్‌లు కేటాయించడం, ఎమ్మార్పీకి మద్యం విక్రయించడం లాంటి నిబంధనలు అమలు చేశారు. అయితే అవి ఆచరణకు నోచుకోలేదు. ఈ ఏడాది జూలై నుంచి కొత్త లెసైన్స్‌దారులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు.

    దుకాణాన్ని బట్టి ఒక్కో లెసైన్స్‌కు 32.52 నుంచి 50 లక్షల రూపాయలు చెల్లించారు. దీనికి అదనంగా మందుబాబుల ‘సిట్టింగ్ రూం’ కోసం మరో 2 లక్షల రూపాయలు చెల్లించారు. ఇంత భారీగా ఖర్చు పెట్టాం.. మద్యం అమ్మకాల ద్వారా గల్లాపెట్టే నిండా డబ్బులు గలగల అంటుందని భావించారు. అయితే ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరపాలని నిబంధనలు పెట్టారు. దీంతో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు.

    ఈ క్రమంలో దుకాణాలు తెరిచిన నెలన్నరకే వ్యాపారులంతా ఎక్కడికక్కడ సమావేశమయ్యారు. ఓ అధికారపార్టీ నేతను ఆశ్రయించారు. అతని అండతో సిండికేట్ అయ్యారు. ఒక్కోబాటిల్‌పై 5-15రూపాయలు పెంచి విక్రయాలు జరుపుకునేందుకు నిర్ణయించారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు చూడకుండా మామూళ్లు నిర్ణయించారు. ఇంకేముంది! గత 23రోజులుగా మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు విక్రయాలు జరుపుతు గల్లా పెట్టె నింపుకుంటున్నారు.
     
    సిండికేట్ ద్వారా నెలకు రూ.6.75కోట్ల అదనపు ఆదాయం    

                                       
    జిల్లాలో 458 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో లక్కీడిప్ ద్వారా 388 దుకాణాలు కేటాయించారు. 70 షాపులకు లెసైన్స్‌దారులు ముందుకు రాలేదు. నడుస్తున్న వాటిలో రోజుకు సగటున 580బాటిళ్లు విక్రయం అవుతున్నట్లు అంచనా! వీటిలో ప్రతీ బాటిల్‌పై 5-15 రూపాయలు అధికంగా విక్రయిస్తారు. ఇందులో సగటున 10 రూపాయలు అనుకున్నా రోజుకు ఒక్కో షాపునకు 5,800రూపాయల చొప్పున నెలకు 1.74లక్షల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. అంటే సిండికేట్ ద్వారా 388 దుకాణాల పరిధిలో నెలకు 6.75కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందన్నమాట. చూసేందుకు పదిరూపాయలా? అనిపించినా దీని ఆదాయం ఎంత ఉంటుందో పై లెక్కలు చూస్తే ఇట్టే తెలుస్తోంది.
     
    మద్యం దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు రూ.54.7లక్షలు
     
    మద్యం దుకాణాల నుంచి నెలకు 54.7 లక్షల రూపాయల మామూళ్లు అందుతున్నాయి. ఓ మద్యం దుకాణ యజమాని చెప్పిన ప్రకారం నెలకు 2,100 రూపాయలు లా అండ్ ఆర్డర్ సీఐకి, 7వేల రూపాయలు ఎక్సైజ్ సీఐకి, 5వేల రూపాయలు ఈఎస్(ఎక్సైజ్ సూపరింటెండెంట్)కు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈఎస్‌లు డీసీకి చెల్లిస్తున్నట్లు సమాచారం. అంటే ప్రతినెలా ఒక్కో దుకాణం నెలకు 14,100 రూపాయలు మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నాయన్నమాట! సిండికేట్ ద్వారా నెలకు 1.74లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే ఈ మాత్రం చెల్లించడం వీరికి పెద్ద ఁలెక్కేం* కాదు కదా!
     
    విచారణ చేయిస్తాం
     మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశాం. సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనంపై విచారణ చేయిస్తాం.
     - సత్యప్రసాద్, డెప్యూటీ కమిషనర్, ఎక్సైజ్.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement