మద్యం వ్యాపారాలకు మండలం గుత్త! | Each zone alone liquor license | Sakshi
Sakshi News home page

మద్యం వ్యాపారాలకు మండలం గుత్త!

Published Sun, Aug 30 2015 2:06 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

మద్యం వ్యాపారాలకు మండలం గుత్త! - Sakshi

మద్యం వ్యాపారాలకు మండలం గుత్త!

ఒక్కో మండలంలో ఒక్కరికే మద్యం లెసైన్స్
ఆ పరిధిలోని గ్రామాల్లో దుకాణాలు, బి-లెసైన్సులు వారికే
రూ.1.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఫీజు
 గ్రామాల్లో అమ్మకాలకు అదనపు ఫీజులు
ఇక కోటీశ్వరులే మద్యం వ్యాపారులు
దరఖాస్తు ఫారం ధరే రూ. 2 లక్షలు!
జిల్లాలకు పరుగు తీసే యోచనలో ‘గ్రేటర్’ మాఫియా

 
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం వ్యాపారం ‘గంపగుత్త’గా మారిపోనుంది.. మద్యం వ్యాపారం కోటీశ్వరుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఒక మండలంలో మద్యం విక్రయాలు మొత్తం ఒక్కరి చేతుల్లోనే ఉండనున్నాయి. ప్రధాన మద్యం దుకాణాలతోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే బి-షాపులు కూడా వారి పరిధిలోనే ఉండనున్నాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న నూతన ఎక్సైజ్ విధానంలో మండలం యూనిట్‌గా మద్యం దుకాణాలకు లెసైన్సులను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి కారణం. దీంతో రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కన్నా గ్రామీణ మండలాల్లో మద్యం వ్యాపారమే ఇక ఖరీదు కాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మద్యం దుకాణం లెసైన్సు పొందాలంటే ఏడాదికి రూ.90 లక్షల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఒక మండలంలో మద్యం దుకాణం లెసైన్సు పొందాలనుకుంటే మాత్రం కనీసం రూ.1.5 కోట్ల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉండనుంది. మండలంలో మద్యం వ్యాపారం చేయాలనుకునేవారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెట్టగలిగితే తప్ప వ్యాపారం చేసే అవకాశం కనిపించడం లేదు. మండలం లెసైన్సు పొందినవారు.. గతంలో సారా కాంట్రాక్టులు నిర్వహించిన తరహాలో గ్రామాల్లో అనుబంధ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫారం నుంచే..!
అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. మండలాల్లో దరఖాస్తు ఫారం ఖరీదే రూ.2 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం. తిరిగి ఇవ్వని ఈ దరఖాస్తు ఫారం ధర గతంలో రూ.25వేలే. దీనిని రూ.2లక్షలకు పెంచడం వెనుక ఆదాయ సమీకరణతో పాటు మండలాల్లో డిమాండ్‌ను తగ్గించాలన్న ఆలోచన కూడా కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా గ్రామీణ మండలాలు 438 ఉన్నాయి. వీటిలో కార్పొరేషన్ల సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న 18 వరకు మండలాలను నగర పరిధిలోనివేగానే పరిగణిస్తారు. మిగతా సుమారు 420 మండలాలను ప్రత్యేక యూనిట్‌లుగా గుర్తించి లెసైన్సు ఫీజులు నిర్ణయించనున్నట్లు సమాచారం.

ప్రారంభమే రూ.కోటిన్నర!
ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి లెసైన్సు ఫీజును నిర్ణయించారు. 10వేల జనాభాలోపు గ్రామీణ ప్రాంతాల్లో దుకాణానికి రూ.32.5 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉన్న చోట దుకాణానికి రూ.34 లక్షలు లెసైన్సు ఫీజుగా ఉండేది. కానీ కొత్త విధానంలో ఒక మండలం మొత్తాన్ని ఒక వ్యాపారికే ధారాదత్తం చేస్తారు. 2014-15లో ఒక మండలంలో ఉన్న అన్ని దుకాణాల నుంచి వచ్చిన లెసైన్సు ఫీజు, ప్రివిలేజ్ ఫీజును పరిగణనలోకి తీసుకుని కొత్త లెసైన్సు ఫీజును నిర్ణయిస్తారు. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో.. మండల కేంద్రంలో 8, గర్రెపల్లి, తొగర్రాయిల్లో ఒక్కోటి చొప్పున 10 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో దుకాణం నుంచి రూ.34 లక్షల చొప్పున 3.40కోట్లు లెసైన్సు ఫీజుగా వచ్చింది. ప్రివిలేజ్ ఫీజు, గుడుంబా అమ్మకాలను బేరీజు వేసుకుని.. ఈ మండ లం లెసైన్సు ఫీజును ఈసారి రూ.4 కోట్లకు పైగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలున్న కొన్ని మండలాల్లో మాత్రమే లెసైన్సు ఫీజును రూ.1.5 కోట్లుగా నిర్ణయించారని... జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మండలాల్లో రూ.5 కోట్ల వరకు ధర నిర్ణయించినట్లు సమాచారం. ఇక మండలం లెసైన్సు పొందిన వ్యాపారి గ్రామాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కో బి-లెసైన్సు కింద రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించాలి. గ్రామాల్లో జనాభా, గుడుంబా అమ్మకాలు, ఇతర ప్రమాణాలను పరిగణ నలోకి తీసుకుని ఒక్కో మండలంలో 10 నుంచి 20 వరకు బి-లెసైన్సులు జారీచే సే అవకాశం ఉంది.

రూ.10 కోట్లు చేతిలో ఉంటేనే..
తక్కువ లెసైన్సు ఫీజు ఉన్న మండలాల్లో మద్యం వ్యాపారం తక్కువే కాబట్టి వ్యాపారులు ఎక్కువ ఫీజు ఉన్న దుకాణాలవైపే మొగ్గు చూపుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.90 లక్షలు చెల్లించి ఒక దుకాణం నడపడం కంటే రూ.5 కోట్లు చెల్లించి మండలంపై గుత్తాధిపత్యం వహించడమే మేలన్న ధోరణిలో వ్యాపారులు ఉన్నారు. ఇలాంటి మండలాల్లో కనీసం రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్నవారే దరఖాస్తులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లెసైన్సు ఫీజుతో పాటు ఏరోజుకారోజు డీడీలు చెల్లించి డిపోల నుంచి మద్యం తెప్పించడం, గ్రామాలకు సరఫరా చేసేందుకు వాహనాలు, సిబ్బంది, ఇతర నిర్వహణ ఖర్చులు కోటీశ్వరులకు మాత్రమే సాధ్యమని ఎక్సైజ్ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం వ్యాపారం చేస్తున్న వారు కూడా జిల్లాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో స్థానికులతో కలిసి మద్యం వ్యాపారం చేసుకుంటే ఆదాయం, గుత్తాధిపత్యం సొంతమవుతాయనే ఆలోచనలో వారు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement