సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన శాఖాపరమైన పరీక్షల నిర్వహణ కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో తదుపరి చర్యలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) దృష్టి సారించింది.
పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వానికి ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఏర్పాట్లపై కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్ రూపకల్పనపై దృష్టి పెట్టింది. అయితే ఇందుకు మరో పది రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. 150 వరకు వివిధ రకాలున్న శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు ఉద్యోగులు ఆన్ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఫీజుల చెల్లింపునకు సంబంధించిన ఖాతా ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీలైతే ఈనెలాఖరులో శాఖాపరమైన పరీక్షలకు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని సర్వీస్ కమిషన్ భావిస్తోంది.