నీటి పారుదల శాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో భాగంగా చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఇందిరమ్మ వరద కాల్వ (ఎఫ్‌ఎఫ్‌సీ) పరిధిలోకి తెచ్చేందుకు వీలుగా చేపట్టనున్న పనులకు రూ.108.18 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులిచ్చారు. మిడ్‌మానేరు కుడి కాల్వల పరిధిలో ప్యాకేజీ-1లోని 17.75 కిలోమీటర్ల పొడవైన కాల్వల పనులకు రూ.54.92 కోట్లు, 17.5 కి.మీ. నుంచి 36.12 కి.మీ. వరకు పనులున్న ప్యాకేజీ-2కి రూ.53.96 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వరద కాల్వ కింద 1.9 లక్షల ఎకరాలుండగా, కొత్తగా దేవాదుల పరిధిలోని 2 లక్షల ఎకరాలు, గండిపల్లి రిజర్వాయర్ పరిధిలోని 30 వేల ఎకరాలను దీని పరిధిలోకి తేవడంతో ఆయకట్టు 4.2 లక్షల ఎకరాలకు పెరిగింది.
గోదావరిలో 120 రోజులే నీటి లభ్యత!
గోదావరిలో వరద ఉండే 170 రోజుల్లో 38.182 టీఎంసీల నీటిని దేవాదులకు ఎత్తిపోసి దీని ద్వారా 6.21 లక్షల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే గోదావరిలో వరద కేవలం 120 రోజులే ఉంటుందని, దేవాదులకు 27 టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని లెక్కగట్టారు. దీంతో ఈ ఆయకట్టుకు వరద కాల్వ ద్వారా నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం మిడ్‌మానేరు కెనాల్ తొలి 36 కి.మీ. వరకు కెనాల్ సామర్థ్యాన్ని 2,650 క్యూసెక్కుల నుంచి 4,200 క్యూసెక్కులకు పెంచాలని, తోటపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి మట్టాన్ని 305.87 నుంచి 307.45కు పెంచాలని కరీంనగర్ ప్రాజెక్టుల అధికారులు సూచించారు.
‘ఇందిరమ్మ’ కాల్వ పనులకు 108 కోట్లు
Published Tue, Oct 25 2016 4:42 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement